op sharma
-
'ఏ తప్పూ చేయలేదు.. సీసీటీవీ చూసుకోండి'
న్యూఢిల్లీ: ఢిల్లీ వీధుల్లో మరోసారి బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య వివాదం చోటుచేసుకుంది. తమ పార్టీ నేత ఆల్కా లాంబ విషయంలో అసభ్యకరంగా ప్రవర్తించారని, అనకూడని మాటలు అన్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీజేపీ నేత ఓపీ శర్మ ఇంటి వద్దకు భారీ సంఖ్యలో ఆప్ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. ఆయన ఇంటి వద్ద ఆందోళన నిర్వహిస్తూ ఇంట్లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వారిని అడ్డుకునేందుకు పోలీసులు బారీ కేడ్లు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఓపీ శర్మ మీడియాతో మాట్లాడుతూ తన తప్పు ఉంటే ఆప్ ఎలాంటి ఫిర్యాదునైనా పోలీసులకు చేసుకోవచ్చని అన్నారు. ఢిల్లీ అసెంబ్లీలో తనను ఆల్కా లాంబ అవమానించిందని, తిట్టిందని, అవన్నీ కూడా సీసీటీవీలో రికార్డయి ఉందని, వాటని పరిశీలిస్తే అసలు విషయాలు తెలుస్తాయని చెప్పారు. ఆప్ చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలని చెప్పారు. తాను ఒక్క మాట కూడా ఆల్కాను అనలేదని చెప్పారు. -
'ఆ ఎమ్మెల్యే.. ఓ డ్రగ్ ఎడిక్ట్'
తనపై దాడి జరిగిందని ఆరోపిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అల్కా లాంబా.. నిజానికి ఓ డ్రగ్ ఎడిక్ట్ అని బీజేపీ ఎమ్మెల్యే ఓపీ శర్మ ఆరోపించారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా పోరాటం చేయడం వల్లే ఆమెపై దాడి జరిగి ఉంటుందని ఆయన అన్నారు. అయితే.. ఈ ఘటన తర్వాత చాందినీ చౌక్ ఎమ్మెల్యే అయిన లాంబాతో పాటు అరవింద్ కేజ్రీవాల్ అనుచరులైన కొందరు గూండాలు చాందినీ చౌక్ ప్రాంతంలో దుకాణాలను తగలబెట్టారని, భవిష్యత్తులో ఇలాంటి దాడులు చేస్తే లాఠీలు పట్టుకునే బీజేపీ కార్యకర్తలు గట్టిగా ఎదుర్కొంటారని హెచ్చరించారు. తెల్లవారుజామున, రాత్రి ప్రాంతాల్లో అల్కా లాంబా ఇక్కడ కనిపించినట్లు స్థానికులు చెప్పారని, డ్రగ్స్‌ను అరికట్టాలని పోరాడేవాళ్లు అర్ధరాత్రి 1 నుంచి 4 గంటల సమయంలో అక్కడకు రారని శర్మ అన్నారు. దీన్ని బట్టి చూస్తే, ఆమే డ్రగ్స్‌కు బానిస అన్న విషయం తెలుస్తోందన్నారు. తనకు మహిళలంటే చాలా గౌరవమని, అయితే.. ఫూలన్ దేవి లాంటి వాళ్లను మహిళా శక్తికి నిదర్శనంగా చూపాలనుకుంటే మాత్రం కుదరదని చెప్పారు. డ్రగ్స్ మత్తులోనే ఆమె హింసాత్మకంగా ప్రవర్తించారని శర్మ విలేకరులతో వ్యాఖ్యానించారు.