నేను తప్పులు చేశా...
విరాట్ కోహ్లి ప్రపంచ క్రికెట్‌ను శాసించే బ్యాట్స్‌మన్‌గా ఎదగక ముందు ఎలా ఉన్నాడో గుర్తుందా? మైదానంలో అనవసర దూకుడు, మాట్లాడితే బూతులు, వరుస వివాదాలు అతనికి చెడ్డ పేరు తెచ్చి పెట్టాయి. ఆ తర్వాత ఆటతో పాటు వ్యక్తిగతంగా కోహ్లిలో పెను మార్పు వచ్చి అతడిని దిగ్గజ స్థాయిలో నిలబెట్టింది. ఈ విషయం అతనికీ బాగా తెలుసు. తాను తప్పులు చేశానని ఒప్పుకుంటూ జూనియర్లు అలాంటి పని చేయకుండా నిరోధిస్తున్నానని విరాట్ అంటున్నాడు.
న్యూఢిల్లీ: వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓటమి తర్వాత తొలిసారి మీడియాతో సవివరంగా మాట్లాడిన భారత కెప్టెన్... వేర్వేరు అంశాలపై తన మనసులో మాటను బయటపెట్టాడు. కోహ్లి ఇంటర్వ్యూ విశేషాలు అతని మాటల్లోనే...
వరల్డ్ కప్‌లో ఓటమిపై...
నేను నా జీవితంలో పరాజయాల నుంచే ఎక్కువ పాఠాలు నేర్చుకున్నాను. పెద్ద ఓటములే మున్ముందు ఇంకా బాగా ఆడేలా స్ఫూర్తినిచ్చాయి. మున్ముందు ఏం చేయాలనే విషయంపై దిశానిర్దేశం చేశాయి. ఇలాంటి సమయంలోనే మనతో ఎవరు ఉంటారో, ఎవరు గోడ దూకుతారో కూడా తెలిసిపోతుంది. దురదృష్టం ఏమిటంటే అందరూ అద్భుతంగా ఆడుతున్నారు అనిపించిన సమయంలో మరో జట్టు మనకంటే బాగా ఆడిందని తెలుస్తుంది. దీనిని జీర్ణించుకోవడం చాలా కష్టం. ఏదైనా తప్పు చేస్తే చెప్పవచ్చు గానీ తప్పు చేయకపోయినా ఓడిపోయామని తెలిస్తే ఎలా ఉంటుంది! వరల్డ్ కప్‌లో ఏం సాధించామో దానిని చూసి గర్వపడాలని మేమంతా చెప్పుకున్నాం. మన ఘనతను మనం చెప్పుకోకుండా ఉంటే ఎలా? ఓటమి ఎదురైనంత మాత్రాన మన శ్రమను తక్కువ చేసి చూపవద్దని అందరం నిర్ణయించుకున్నాం.
ఈ స్థాయికి చేరడంపై...
పోరాడటం వదిలేస్తే మన ప్రయాణం ముగిసిపోయినట్లే. ఉదయం లేచిన దగ్గరి నుంచి కష్టపడటం, చేసిన పనినే మళ్లీ మళ్లీ చేయడం మినహా మరో మార్గం లేదు. వీటిని పునరావృతం చేస్తేనే నిలకడ, విజయాలు వస్తాయి. నిజానికి ఇదంతా చాలా విసుగు తెప్పిస్తుంది. అయినా సరే చేయాల్సి రావడం చాలా కష్టం. గోల్ఫ్ ఆటగాళ్లు ఒకే షాట్‌ను ఎన్ని సార్లు ప్రాక్టీస్ చేస్తారో కదా. యూఎస్ ఓపెన్ చాంపియన్‌గా నిలిచినా సరే అది అలా చేయాల్సిందే. ఎందుకంటే అలా చేస్తేనే తర్వాత దాని ఫలితం దక్కుతుంది. క్రికెట్లో అడుగు పెట్టినప్పుడు దేవుడు నా కోసం ఏం రాసి పెట్టాడో తెలీదు. దేని గురించి కూడా ఊహించలేదు. నాలో మరీ అంత గొప్ప సామర్థ్యం లేదని నాకూ తెలుసు. అయితే నా చుట్టూ ఉన్నవారితో పోలిస్తే ఎంతైనా కష్టపడగలనని, ఎంత శ్రమకైనా ఓర్చుకోగలననే విషయం మాత్రం నాకు బాగా తెలుసు. దేవుడు బహుశా ఈ శ్రమనే చూసినట్లున్నాడు!
క్రికెట్ బయట జీవితంపై...
నేను నా కోసం క్రికెట్ ఆడుతున్నానే తప్ప ఎవరిని మెప్పించడానికో కాదు. నా ఉద్దేశాలు, ఆలోచనలు స్పష్టం. అయితే ఆ తర్వాత సహజంగానే క్రికెట్ తర్వాత కూడా జీవితం ఉందనే వాస్తవం అర్థమవుతుంది. అప్పటి వరకు ఆటనే సర్వస్వం అనిపించినా భార్య, కుటుంబానికి కూడా సమయం కేటాయించాలి. అప్పుడు అవి ప్రాధాన్యతలుగా మారిపోతాయి. మతపరమైన అంశాల్లో నేను భాగం కాను. మొదటి నుంచీ ఏ మతంతో నన్ను నేను ముడివేసుకోలేదు. అన్ని మతాలతో, అందరు మనుషులతో కలిసిపోతా. నాకు తెలిసి మనందరిలో ఆధ్యాత్మికత ఉంటుంది.
కొత్త కుర్రాళ్లతో సాన్నిహిత్యంపై...
రిషభ్ పంత్, శుబ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్‌లాంటి కుర్రాళ్లంతా అద్భుతమైనవారు. గతంలోనే చెప్పినట్లు నేను 19–20 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఆలోచనాధోరణితో పోలిస్తే వీరంతా చాలా ముందున్నారు. ఐపీఎల్‌తో ఆట మెరుగుపడితే... తప్పుల నుంచి నేర్చుకోవడం మొదలు ఇతరత్రా వాటిలో కూడా వారిలో ఆత్మవిశ్వాసంపాళ్లు చాలా ఎక్కువ. కుర్రాళ్లపై కోపం ప్రదర్శించే సంస్కృతి మా జట్టులో లేదు. వారు కూడా సీనియర్లలాగే మనసు విప్పి మాట్లాడవచ్చు. నేనైతే వారి దగ్గరకు వెళ్లి ‘నేను ఇలాంటి తప్పులు చేశాను. మీరు మాత్రం అలా చేయకండి’ అంటూ విడమర్చి చెబుతాను. ఎందుకంటే ఎదుగుతున్న సమయంలో నేను చాలా తప్పులు చేశాను. కెరీర్ ఆరంభంలో ఇతర విషయాలపై దృష్టి పెట్టి ఆటపై ఏకాగ్రత కనబర్చలేకపోయాను. అదృష్టవశాత్తూ మళ్లీ దారిలో పడ్డాను.
రాబోయే టెస్టు చాంపియన్‌షిప్‌పై...
నేను కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. సరైన సమయంలో ఇది జరుగుతోంది. ఆడేది ద్వైపాక్షిక సిరీస్‌లే అయినా వాటి ప్రాధాన్యత పెరిగిపోతుంది. కాబట్టి ప్రతీ సిరీస్ కోసం ప్రత్యేక ప్రణాళికతో సిద్ధం కావాల్సి ఉంటుంది. గతంలోనే టెస్టు చాంపియన్‌షిప్ గురించి ఆలోచించా. ఇప్పడది వాస్తవ రూపం దాలుస్తోంది.