Open Access
-
100 కిలోవాట్ ఉంటే ‘ఓపెన్’ కరెంట్
సాక్షి, హైదరాబాద్: బహిరంగ విపణి (ఓపెన్ యాక్సెస్) నుంచి నేరుగా గ్రీన్ ఎనర్జీ కొనుగోళ్లకు ఉన్న నిబంధనలను కేంద్ర ప్రభుత్వం మరింత సరళతరం చేసింది. ఒకే విద్యుత్ సబ్ డివిజన్ (రెవెన్యూ డివిజన్‌తో సమానం) పరిధిలో ఒకటి/అంతకు మించిన సంఖ్యలో విద్యుత్ కనెక్షన్లు కలిగిన సాధారణ విద్యుత్ వినియోగదారులు ఎవరైనా ఇకపై ఓపెన్ యాక్సెస్ విధానంలో సౌర/పవన/పంప్డ్ స్టోరేజీ విద్యుత్ వంటి గ్రీన్ ఎనర్జీని కొనుగోలు చేసుకోవచ్చు. అయితే సదరు వినియోగదారుకు విద్యుత్ కనెక్షన్ల కాంట్రాక్ట్ లోడ్/శాంక్షన్డ్ లోడ్ కలిపి కనీసం 100 కిలోవాట్లు, ఆపైన ఉండాలి. సొంత విద్యుత్ ప్లాంట్లు కలిగిన భారీ పరిశ్రమల వంటి కాప్టివ్ విద్యుత్ వినియోగదారులైతే.. ఓపెన్ యాక్సెస్‌లో ఎలాంటి పరిమితులు లేకుండా గ్రీన్ ఎనర్జీని కొనుగోలు చేసుకోవచ్చు. ఈ మేరకు ‘ది ఎలక్ట్రిసిటీ (ప్రమోటింగ్ గ్రీన్ ఎనర్జీ త్రూ గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్) రెండో సవరణ నిబంధనలు–2023’ను అమల్లోకి తెస్తూ కేంద్ర విద్యుత్ శాఖ తాజాగా గెజిట్ నోటిఫికేషన్ వెలువరించింది. ఇప్పటివరకు 1000 కిలోవాట్స్ (ఒక మెగావాట్తో సమానం), ఆపై లోడ్ కలిగినవారు మాత్రమే ఓపెన్ యాక్సెస్‌లో విద్యుత్ కొనుగోలు చేసుకోవడానికి అవకాశం ఉంది. డిస్కంల టారిఫ్‌తో పోల్చితే ఓపెన్ యాక్సెస్‌లో తక్కువ ధరకు విద్యుత్ లభ్యత ఉన్నప్పుడు.. భారీ పరిశ్రమలు ఆ విద్యుత్‌ను కొంటూ బిల్లుల భారం తగ్గించుకుంటున్నాయి. ఇకపై ఈ అవకాశం 100 కిలోవాట్ల లోడ్ కలిగిన వినియోగదారులకు సైతం లభించనుంది. చిన్న పరిశ్రమలకు ప్రయోజనం! ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ రంగ దక్షిణ/ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థల (ఎస్పీడీసీఎల్ / ఎన్పీడీసీఎల్) నుంచే చాలావరకు వినియోగదా రులకు విద్యుత్ సరఫరా అవుతోంది. హెచ్‌టీ విద్యుత్ కనెక్షన్లు కలిగిన భారీ పరిశ్రమలు మాత్రమే ఇప్పటివరకు ఓపెన్ యాక్సెస్‌లో బయటి నుంచి విద్యుత్ కొనుక్కుంటున్నాయి. ఇలా ఓపెన్ యాక్సెస్ కొనుగోళ్లకు సంబంధించి డిస్కంలు ప్రతి యూనిట్‌పై 50 పైసల వరకు అదనపు సర్‌చార్జి వసూలు చేస్తున్నాయి. ఇకపై 100 కిలోవాట్లు, ఆపై లోడ్ కలిగిన వినియోగదారులు దేశంలో ఎక్కడి నుంచైనా గ్రీన్ ఎనర్జీని ఓపెన్ యాక్సెస్ విధానంలో కొనుగోలు చేసుకోవచ్చు. సాధారణ గృహ విద్యుత్ వినియోగదారుల శాంక్షన్డ్/కాంట్రాక్ట్ లోడ్ 10 కిలో వాట్ల లోపే ఉంటుంది. 100 కిలోవాట్ లోడ్ కలిగి ఉన్న భారీ నివాస భవనాలు, వాణిజ్య, పారిశ్రామి క వినియోగదారులకు కొత్త విధానంతో ప్రయోజ నం ఉండనుంది. ఇక 2032 డిసెంబర్ నాటికి నిర్మా ణం పూర్తి చేసుకోనున్న సముద్ర తీర పవన విద్యుత్ ప్రాజెక్టుల నుంచి ఓపెన్ యాక్సెస్ విద్యుత్ కొనే వినియోగదారులపై అదనపు సర్‌చార్జి విధించవద్ద ని కేంద్రం తాజా నిబంధనల్లో స్పష్టం చేసింది. -
విధిగా గ్రీన్ ఎనర్జీ!.. కేంద్రం చేతిలో ఓపెన్ యాక్సెస్
సాక్షి, హైదరాబాద్: డిస్ట్రిబ్యూషన్ లైసెన్సీలు, ఓపెన్ యాక్సెస్, క్యాప్టివ్ వినియోగదారులు విధిగా నిర్దేశిత మొత్తంలో పునరుత్పాదక విద్యుత్ (గ్రీన్ ఎనర్జీ) కొనుగోలు చేయాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందుకోసం కొత్తగా గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్ రూల్స్–2021 ముసాయిదాను ప్రకటించింది. వచ్చే నెల 14లోగా దీనిపై అభ్యంతరాలు, సలహాలు, సూచనలు తెలపాలని రాష్ట్రాలను కోరింది. దీనిప్రకారం విధిగా గ్రీన్ ఎనర్జీ కొనుగోలు బాధ్యత (రెన్యూవబుల్ పర్చేజ్ ఆబ్లిగేషన్/ఆర్పీఓ)ను అందరిపై ఏకరీతిన ఉండనుంది. డిస్ట్రిబ్యూషన్ లైసెన్సీలు, ఓపెన్ యాక్సెస్, క్యాప్టివ్లకు ఈ నిబంధనలు తుది నోటిఫికేషన్ జారీ తేదీ నుంచి వర్తించనున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వరంగ విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు మాత్రమే డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్ కలిగి ఉన్నాయి. విద్యుత్ పంపిణీ రంగం ప్రైవేటీకరణలో భాగంగా ప్రైవేటు డిస్ట్రిబ్యూషన్ లైసెన్సీలను తీసుకొచ్చేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. ఈ తరుణంలో ఈ నిబంధనలను తీసుకురావడం ప్రాధాన్యత సంతరించుకుంది. సొంతంగా పునరుత్పాదక విద్యుత్ ప్లాంట్ పెట్టుకోవచ్చు... ►తప్పనిసరి అయినా, కాకపోయినా ఏదైనా సంస్థ తమ అవసరాల కోసం పునరుత్పాదక ఇంధనాన్ని దిగువ పేర్కొన్న ఏదైనా పద్ధతిలో కొనుగోలు చేసి వాడుకోవచ్చు. ►సొంత వినియోగం కోసం ఏర్పాటు చేసుకొనే పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ల స్థాపిత సామర్థ్యంపై ఎలాంటి పరిమితి ఉండకూడదు. అయితే విద్యుత్‌ను గ్రిడ్‌కు సరఫరా చేయరాదు. దీనిని ‘బిహైండ్ ద మీటర్’వినియోగం అంటారు. ఈ విద్యుత్ కొనాల్సిన బాధ్యత డిస్కంలకు ఉండదు. ఈ విద్యుత్ ప్లాంట్‌ను సొంతంగా లేదా డెవలపర్ ద్వారా పెట్టించుకోవచ్చు. డెవలపర్‌తో దీర్ఘకాల/మధ్యకాల విద్యుత్ కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది. ►ఒప్పందం ద్వారా ఓపెన్ యాక్సెస్ విధానంలో డెవలపర్ నుంచి పునరుత్పాదక ఇంధనాన్ని సమీకరించుకోవచ్చు. కేంద్రం చేతిలో ఓపెన్ యాక్సెస్ ఓపెన్ యాక్సెస్‌లో పునరుత్పాదక విద్యుత్ కొనుగోళ్లకు అనుమతులు ఇకపై నేరుగా కేంద్రం నుంచి లభించనున్నాయి. కేంద్రం ఏర్పాటు చేసే నోడల్ ఏజెన్సీ ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించి సింగిల్ విండో విధానం ద్వారా సంబంధిత ఈఆర్సీలకు వాటిని పంపిస్తుంది. ఆ ఈఆర్సీ అనుమతులు ఇస్తుంది. ►ఓపెన్ యాక్సెస్ దరఖాస్తులను తిరస్కరిస్తే కారణాన్ని రాతపూర్వకంగా తెలపాలి. పునరుత్పాదక విద్యుత్ కావాలని విజ్ఞప్తి చేయవచ్చు... ►ఏదైనా సంస్థ తమ అవసరాల్లో కొంత శాతం మేరకు లేదా పూర్తిగా పునరుత్పాదక విద్యుత్ కొనుగోలు చేసి వాడుకోవచ్చు. ఈ మేరకు పునరుత్పాదక విద్యుత్‌ను సమీకరించి సరఫరా చేయాలని డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు విజ్ఞప్తి చేయవచ్చు. ►క్యాప్టివ్ విద్యుత్ ప్లాంట్ లేదా ఓపెన్ యాక్సెస్ ద్వారా అందుబాటులో ఉన్న పునరుత్పాదక విద్యుత్‌ను రెన్యూవబుల్ పర్చేజ్ ఆబ్లిగేషన్‌తో సంబంధం లేకుండా కొనుగోలు చేయవచ్చు. ►విధిగా కొనుగోలు చేయాల్సిన దానికన్నా అధిక మొత్తం/వాటాలో పునరుత్పాదక ఇంధ నాన్ని వినియోగదారులు స్వచ్ఛందంగా కొనుగోలు చేసుకోవచ్చు. కనీసం 50%, 75%, 100% పునరుత్పాదక ఇంధనాన్ని కొనొచ్చు. ►సంబంధిత విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ) పునరుత్పాదక విద్యుత్ టారిఫ్‌ను ఖరా రు చేస్తుంది. పునరుత్పాదక విద్యుత్ సమీకరణ సగటు ధర, క్రాస్ సబ్సిడీ చార్జీలు, సర్వీ సు చార్జీల ఆధారంగా టారిఫ్ నిర్ధారిస్తారు. ►పునరుత్పాదక విద్యుత్ కోసం డిస్ట్రిబ్యూషన్ లైసెన్సీ చేసే విజ్ఞప్తి కనీసం ఏడాది కాలం కోసం ఉండాలి. ఏడాది పాటు కొంటామని ముందే సూచించాలి. ►డిస్ట్రిబ్యూషన్ లైసెన్సీ నుంచి వినియోగ దారులు కొనుగోలు చేసిన పునరుత్పాదక విద్యుత్‌ను, ఆ కంపెనీ విధిగా కొనుగోలు చేయాల్సిన విద్యుత్ (ఆర్బీఓ) కింద లెక్కి స్తారు. ప్రతినెలా డిస్ట్రిబ్యూషన్ లైసెన్సీ స్థాయిలో పునరుత్పాదక విద్యుత్ సరఫరాను లెక్కిస్తారు. ►విధిగా కొనాల్సిన పునరుత్పాదక విద్యుత్ లక్ష్యాలను అందుకోవడానికి రెన్యూవబుల్ ఎనర్జీ సర్టిఫికెట్లను కొనుగోలు చేసుకోవచ్చు. ►పునరుత్పాదక విద్యుత్ ఉపయోగించి ఉత్ప త్తి చేసిన ‘గ్రీన్ హైడ్రోజన్’ను పరిశ్రమలు, ఇతర సంస్థలు కొనుగోలు చేయడం ద్వారా విధిగా కొనుగోలు చేయాల్సిన పునరుత్పాదక విద్యుత్ లక్ష్యాలను చేరుకోవచ్చు. ►ఓపెన్ యాక్సెస్‌లో పునరుత్పాదక విద్యుత్ కొనుగోళ్లకు వచ్చే దరఖాస్తులన్నింటినీ 15 రోజుల్లోగా పరిష్కరించాలి. 100 కిలోవాట్స్, ఆపై కాంట్రాక్టెడ్ లోడ్, శాంక్షన్డ్ లోడ్ ఉన్న వినియోగదారులకు మాత్రమే ఓపెన్ యాక్సెస్ అనుమతి. -
ఓపెన్ యాక్సెస్ విద్యుత్‌పై మోత
సాక్షి, హైదరాబాద్: బహిరంగ మార్కెట్ నుంచి ఓపెన్ యాక్సెస్ విధానంలో విద్యుత్ కొనుగోలు చేసే పరిశ్రమలు, వినియోగదారులపై అదనపు సర్‌చార్జీల మోత మోగనుంది. రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు ఇప్పటికే వీరి నుంచి ‘క్రాస్ సబ్సిడీ సర్ చార్జీ’ల పేరుతో ఒక్కో యూనిట్‌పై రూ.1.50 వరకు వసూలు చేస్తున్నాయి. వచ్చే నెల 1 నుంచి అదనంగా మరో 52 పైసల చొప్పున వసూలు చేయనున్నాయి. ఈ మేరకు డిస్కంలకు అనుమతినిస్తూ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్ ఈఆర్సీ) తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఒక్కో యూనిట్‌పై సర్‌చార్జీల భారం రూ.2.02కు పెరగనుంది. తక్కువ ధరకు లభిస్తుండటంతో.. విద్యుత్ చట్టం–2003 కల్పించిన వెసులుబాటు మేరకు భారీ పరిశ్రమలు, రైల్వేలు, వాణిజ్య సంస్థలు వంటి తదితర పెద్ద వినియోగదారులు బహిరంగ మార్కెట్ నుంచి విద్యుత్ కొనుగోలు చేసుకోవచ్చు. రాష్ట్ర విద్యుత్ సంస్థల పంపిణీ లైన్లను వినియోగించుకున్నందుకు చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. దీనినే ఓపెన్ యాక్సెస్ విధానంగా పేర్కొంటారు. పరిశ్రమలు బహిరంగ మార్కెట్లో తక్కువ ధరకు విద్యుత్ లభించినప్పుడు ఈ విధానంతో కొనుగోలు చేస్తూ.. ఏటా రూ.కోట్లలో విద్యుత్ బిల్లులను ఆదా చేసుకుంటున్నాయి. డిస్కంలు ఎల్టీ పరిశ్రమల నుంచి యూనిట్‌కు రూ.6.70, హెచ్‌టీ పరిశ్రమల నుంచి రూ.6.65 వరకు, రైల్వే నుంచి రూ.7.50 వరకు చార్జీలు వసూలు చేస్తున్నాయి. ఇటీవల బహిరంగ మార్కెట్లో విద్యుత్ యూనిట్‌కు రూ.2 నుంచి రూ.2.50కే లభిస్తోంది. దీంతో ఓపెన్ యాక్సెస్ కొనుగోళ్లు పెరుగుతున్నాయి. నష్టం పూడ్చుకునేందుకు.. రాష్ట్రంలో 2015–16లో 902 మిలియన్ యూనిట్లుగా ఉన్న ఓపెన్ యాక్సెస్ విద్యుత్ కొనుగోళ్లు 2016–17లో 2,135 మిలియన్ యూనిట్లకు పెరిగాయి. డిస్కంలు ఫిక్స్డ్ చార్జీల రూపంలో నష్టపోయిన మేరకు అదనపు సర్‌చార్జీ రూపంలో వçసూలు చేసుకోవడానికి విద్యుత్ చట్టం వెసులుబాటు కల్పిస్తోంది. దీంతో అదనపు సర్‌చార్జీల వసూలుకు డిస్కంలు సిద్ధమయ్యాయి. ఓపెన్ యాక్సెస్ కొనుగోళ్ల వల్ల 4,911 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను బ్యాక్‌డౌన్ చేయాల్సి వచ్చిందని, ఒక్కో యూనిట్‌పై రూ.1.95 చొప్పున స్థిరచార్జీలు చెల్లించాల్సి వచ్చిందని ఈఆర్సీకి విన్నవించాయి. ఓపెన్ యాక్సెస్ కొనుగోళ్లపై ఒక్కో యూనిట్‌కు రూ.1.95 చొప్పున అదనపు సర్‌చార్జీ వసూలుకు అనుమతి కోరాయి. బ్యాక్‌డౌన్ వల్ల డిస్కంలపై యూనిట్‌కు రూ.1.17 చొప్పున భారం పడిందని, అందులో 44 శాతం నష్టం ఓపెన్ యాక్సెస్ ద్వారా జరి గిందని ఈఆర్సీ తేల్చింది. ఈ మేరకు ఓపెన్ యాక్సెస్ విద్యుత్‌పై యూనిట్‌కు 52 పైసల చొప్పున అదనపు సర్‌చార్జీ వసూలు చేసుకునేందుకు అనుమతిచ్చింది. విద్యుత్ విధానం–2015 కింద వచ్చిన సౌర విద్యుత్ ప్లాంట్లు, సొంత అవసరాలకు విద్యుదుత్పత్తి చేసే క్యాప్టివ్ విద్యుత్ వినియోగదారులు, పవన విద్యుత్ వినియోగదారులకు ఈ అదనపు సర్‌చార్జీలు వర్తించవని స్పష్టం చేసింది. డిస్కంలకు తీవ్ర నష్టం వాస్తవానికి గృహాలు, కుటీర పరిశ్రమలు, వ్యవసాయం తదితర కేటగిరీల వినియోగదారులకు సబ్సిడీపై విద్యుత్ సరఫరా జరుగుతుంది. డిస్కంలకు ప్రధానంగా ఆదాయం పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు, రైల్వే సంస్థల నుంచే వస్తుంది. కానీ ఈ సంస్థలు ఓపెన్ యాక్సెస్‌కు తరలివెళ్తుం డటంతో డిస్కంలకు క్రాస్ సబ్సిడీ అందక నష్టాలు వస్తున్నాయి. అంతేకాదు రాష్ట్రంలో డిమాండ్‌కు తగిన విద్యుత్ సరఫరా కోసం డిస్కంలు.. విద్యు దుత్పత్తి కంపెనీలతో ముందస్తు కొనుగోలు ఒప్పం దాలు చేసుకుంటున్నాయి. కానీ భారీ పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు, రైల్వే సంస్థలు.. డిస్కంల విద్యుత్‌ను కాదని ఓపెన్ యాక్సెస్ విధానంలో కొనుగోళ్లు చేస్తున్నాయి. దీంతో డిస్కంలు ఒప్పందాలతో సమీకరిస్తున్న విద్యుత్ నిరుపయో గంగా మారుతోంది. ఈ మేరకు సరఫరా తగ్గించాల ని విద్యుదుత్పత్తి సంస్థలను డిస్కంలు కోరుతు న్నాయి. కానీ ఒప్పందం మేరకు స్థిర చార్జీలను మాత్రం చెల్లించాల్సి వస్తోంది. దీని కారణంగా కూడా డిస్కంలకు భారీగా నష్టాలు వస్తున్నాయి. -
‘ఛత్తీస్’ వెలుగుల వెనుక చీకట్లు!
రాష్ట్రంలో విద్యుత్ కొరతను అధిగమించేందుకు ఛత్తీస్‌గఢ్ నుంచి 1,000 మెగావాట్ల విద్యుత్ కొనుగోళ్ల కోసం ప్రభుత్వం అక్కడి ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఛత్తీస్‌గఢ్ నుంచే మరో 1,000 మె.వా.ను కొనుగోళ్లు చేయాలన్న ప్రతిపాదన సైతం ప్రభుత్వం వద్ద ఉంది. అయితే పరిస్థితులు ‘ఓపెన్ యాక్సెస్’కు మారిన నేపథ్యంలో అక్కడి నుంచి టెండర్లు లేకుండా విద్యుత్ కొనుగోలు చేయాల్సిన అవసరం లేదన్న భావన వ్యక్తమవుతోంది. భవిష్యత్తులో ఛత్తీస్‌గఢ్ విద్యుత్ ధరలు భారం కానున్నాయి. ఉత్తరాదిన తక్కువ ధరకే విద్యుత్ లభిస్తుండడంతో ఛత్తీస్‌గఢ్ నుంచే ఎందుకు మొగ్గుచూపాలన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. టెండర్లు లేకుండా ఆ రాష్ట్రం నుంచి విద్యుత్ కొనుగోలా? * కాంపిటిటీవ్ బిడ్డింగ్‌కు వెళ్లకపోవడంతో భారీగా చార్జీల భారం * ఛత్తీస్‌గఢ్‌తో ఎంవోయూపై పునఃపరిశీలన జరపాల్సిన తరుణం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తీవ్ర విద్యుత్ కొరత ఉన్న సమయంలో ప్రభుత్వం ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు చేయాలన్న ఆలోచన చేసింది. ఇతర ప్రాంతాలతో పోల్చితే.. పొరుగునే ఉన్న ఛత్తీస్‌గఢ్ నుంచి రాష్ట్రానికి విద్యుత్ లైన్ల నిర్మాణానికి వ్యయప్రయాసలు తక్కువ ఉంటాయన్న ఆలోచనే ఇందుకు కారణం. ఛత్తీస్‌గఢ్ నుంచి రాష్ట్రానికి విద్యుత్ లైన్లను నిర్మించాలని అప్పట్లో నిర్ణయం తీసుకుంది. అయితే ఇందుకు రూ.3 వేల కోట్ల ఖర్చు అవుతుందని ట్రాన్స్‌కో తేల్చడంతో ఈ ప్రతిపాదనను ప్రభుత్వం విరమించుకుంది. సీన్ కట్ చేస్తే మొత్తం కథే మారింది. కారిడార్‌పై గ్యారెంటీ లేదు : సొంత లైన్ల నిర్మాణానికి బదులు.. కేంద్ర ప్రభుత్వ సంస్థ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ లిమిటెడ్(పీజీసీఎల్) నిర్మిస్తున్న వార్దా-డిచ్పల్లి-మహేశ్వరం లైన్ల ద్వారా ఛత్తీస్‌గఢ్ నుంచి ‘ఓపెన్ యాక్సెస్’ విధానంలో విద్యుత్ తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ లైన్ల నిర్మాణం పూర్తికావడానికి రెండున్నరేళ్లకు పైనే పట్టనుంది. అప్పటి వరకు ఛత్తీస్‌గఢ్ విద్యుత్ రాష్ట్రానికి వచ్చే అవకాశం లేదు. ఈ లైన్‌ను పూర్తిగా తెలంగాణకే కేటాయిస్తారా అంటే.. అందుకు గ్యారెంటీ లేదు. ఈ లైన్ల కోసం ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం కంటే ముందే తమిళనాడు ప్రభుత్వం దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోలు అవసరాల కోసం దరఖాస్తు చేసుకుంది. నిబంధనల మేరకు ముందు దరఖాస్తు చేసుకున్న వారికే కేటాయింపులు జరగనున్నాయి. దీంతో ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ తీసుకొచ్చేందుకు కారిడార్ లభిస్తుందా అన్నది అనుమానమే. కారిడార్ వస్తే తక్కువ ధరకే కొనొచ్చు.. రెండున్నరేళ్ల తర్వాత ‘ఓపెన్ యాక్సెస్’లో విద్యుత్ కొనుగోలు చేయాలనుకున్నప్పుడు ఛత్తీస్‌గఢ్ నుంచే కరెంటు ఎందుకు కొనుగోలు చేయడం అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఛత్తీస్‌గఢ్ జెన్కో నిర్మిస్తున్న ప్రాజెక్టు వ్యయం ఇప్పటికే మెగావాట్‌కు రూ.7 కోట్లు దాటింది. స్థిర, అస్థిర వ్యయాలు, ట్రాన్స్మిషన్ చార్జీలు కలుపుకుంటే ఈ ప్రాజెక్టు నుంచి వచ్చే విద్యుత్ వ్యయం యూనిట్‌కు రూ.5పైనే కానుందని అంచనా. కేవలం రూ.4 నుంచి రూ.4.50 వ్యయంతో విద్యుత్‌ను విక్రయించేందుకు ఉత్తరాదిన పలు విద్యుదుత్పత్తి కేంద్రాలు సిద్ధంగా ఉన్నాయి. కొనుగోళ్లు చేసేవారు లేక వేల మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులు నిరుపయోగంగా మారడంతో ఉత్తరాదిన విద్యుత్ ధరలు భారీగా తగ్గిపోతున్నాయి. ఉత్తర-దక్షిణాది గ్రిడ్ల మధ్య కారిడార్ లభ్యత లేకపోవడంతో ఈ విద్యుత్‌ను దక్షిణాదికి తరలించే మార్గం లేకపోవడమే ప్రధాన కారణం. వార్దా-డిచ్పల్లి-మహేశ్వరం లైన్లతో ఈ అడ్డంకి తొలగిపోనుంది. రాష్ట్ర ప్రభుత్వం సొంత కారిడార్ నిర్మాణ ఆలోచనను విరమించుకున్న నేపథ్యంలో... ఛత్తీస్‌గఢ్ నుంచి కాంపిటీటివ్ బిడ్డింగ్ లేకుండా విద్యుత్ కొనుగోలు చేయాల్సిన అవసరమే లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. విద్యుత్ కొనుగోళ్ల కోసం కాంపిటీటివ్ బిడ్డింగ్‌కు వెళ్తే ఛత్తీస్‌గఢ్ కంటే తక్కువ ధరకే విద్యుత్‌ను విక్రయించేందుకు ఉత్తరాది విద్యుత్కేంద్రాలు ముందుకు వచ్చే అవకాశం ఉండడమే ఇందుకు కారణం. ఛత్తీస్‌గఢ్ విద్యుత్ ఉత్పత్తి ధరను ఆ రాష్ట్ర ఈఆర్సీ నిర్ణయించనుంది. ఆ విద్యుత్‌ను అక్కడి డిస్కంలు కొనుగోలు చేసి తెలంగాణకు అమ్ముతాయి. దీంతో ధరల విషయంలో ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఆడిందే ఆట పాడిందే పాట కానుంది.