సాక్షి, హైదరాబాద్: బహిరంగ మార్కెట్ నుంచి ఓపెన్ యాక్సెస్ విధానంలో విద్యుత్ కొనుగోలు చేసే పరిశ్రమలు, వినియోగదారులపై అదనపు సర్‌చార్జీల మోత మోగనుంది. రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు ఇప్పటికే వీరి నుంచి ‘క్రాస్ సబ్సిడీ సర్ చార్జీ’ల పేరుతో ఒక్కో యూనిట్‌పై రూ.1.50 వరకు వసూలు చేస్తున్నాయి. వచ్చే నెల 1 నుంచి అదనంగా మరో 52 పైసల చొప్పున వసూలు చేయనున్నాయి. ఈ మేరకు డిస్కంలకు అనుమతినిస్తూ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్ ఈఆర్సీ) తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఒక్కో యూనిట్‌పై సర్‌చార్జీల భారం రూ.2.02కు పెరగనుంది.
తక్కువ ధరకు లభిస్తుండటంతో..
విద్యుత్ చట్టం–2003 కల్పించిన వెసులుబాటు మేరకు భారీ పరిశ్రమలు, రైల్వేలు, వాణిజ్య సంస్థలు వంటి తదితర పెద్ద వినియోగదారులు బహిరంగ మార్కెట్ నుంచి విద్యుత్ కొనుగోలు చేసుకోవచ్చు. రాష్ట్ర విద్యుత్ సంస్థల పంపిణీ లైన్లను వినియోగించుకున్నందుకు చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. దీనినే ఓపెన్ యాక్సెస్ విధానంగా పేర్కొంటారు. పరిశ్రమలు బహిరంగ మార్కెట్లో తక్కువ ధరకు విద్యుత్ లభించినప్పుడు ఈ విధానంతో కొనుగోలు చేస్తూ.. ఏటా రూ.కోట్లలో విద్యుత్ బిల్లులను ఆదా చేసుకుంటున్నాయి. డిస్కంలు ఎల్‌టీ పరిశ్రమల నుంచి యూనిట్‌కు రూ.6.70, హెచ్‌టీ పరిశ్రమల నుంచి రూ.6.65 వరకు, రైల్వే నుంచి రూ.7.50 వరకు చార్జీలు వసూలు చేస్తున్నాయి. ఇటీవల బహిరంగ మార్కెట్లో విద్యుత్ యూనిట్‌కు రూ.2 నుంచి రూ.2.50కే లభిస్తోంది. దీంతో ఓపెన్ యాక్సెస్ కొనుగోళ్లు పెరుగుతున్నాయి.
నష్టం పూడ్చుకునేందుకు..
రాష్ట్రంలో 2015–16లో 902 మిలియన్ యూనిట్లుగా ఉన్న ఓపెన్ యాక్సెస్ విద్యుత్ కొనుగోళ్లు 2016–17లో 2,135 మిలియన్ యూనిట్లకు పెరిగాయి. డిస్కంలు ఫిక్స్‌డ్ చార్జీల రూపంలో నష్టపోయిన మేరకు అదనపు సర్‌చార్జీ రూపంలో వçసూలు చేసుకోవడానికి విద్యుత్ చట్టం వెసులుబాటు కల్పిస్తోంది. దీంతో అదనపు సర్‌చార్జీల వసూలుకు డిస్కంలు సిద్ధమయ్యాయి. ఓపెన్ యాక్సెస్ కొనుగోళ్ల వల్ల 4,911 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను బ్యాక్‌డౌన్ చేయాల్సి వచ్చిందని, ఒక్కో యూనిట్‌పై రూ.1.95 చొప్పున స్థిరచార్జీలు చెల్లించాల్సి వచ్చిందని ఈఆర్సీకి విన్నవించాయి. ఓపెన్ యాక్సెస్ కొనుగోళ్లపై ఒక్కో యూనిట్‌కు రూ.1.95 చొప్పున అదనపు సర్‌చార్జీ వసూలుకు అనుమతి కోరాయి. బ్యాక్‌డౌన్ వల్ల డిస్కంలపై యూనిట్‌కు రూ.1.17 చొప్పున భారం పడిందని, అందులో 44 శాతం నష్టం ఓపెన్ యాక్సెస్ ద్వారా జరి గిందని ఈఆర్సీ తేల్చింది. ఈ మేరకు ఓపెన్ యాక్సెస్ విద్యుత్‌పై యూనిట్‌కు 52 పైసల చొప్పున అదనపు సర్‌చార్జీ వసూలు చేసుకునేందుకు అనుమతిచ్చింది. విద్యుత్ విధానం–2015 కింద వచ్చిన సౌర విద్యుత్ ప్లాంట్లు, సొంత అవసరాలకు విద్యుదుత్పత్తి చేసే క్యాప్టివ్ విద్యుత్ వినియోగదారులు, పవన విద్యుత్ వినియోగదారులకు ఈ అదనపు సర్‌చార్జీలు వర్తించవని స్పష్టం చేసింది.
డిస్కంలకు తీవ్ర నష్టం
వాస్తవానికి గృహాలు, కుటీర పరిశ్రమలు, వ్యవసాయం తదితర కేటగిరీల వినియోగదారులకు సబ్సిడీపై విద్యుత్ సరఫరా జరుగుతుంది. డిస్కంలకు ప్రధానంగా ఆదాయం పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు, రైల్వే సంస్థల నుంచే వస్తుంది. కానీ ఈ సంస్థలు ఓపెన్ యాక్సెస్‌కు తరలివెళ్తుం డటంతో డిస్కంలకు క్రాస్ సబ్సిడీ అందక నష్టాలు వస్తున్నాయి. అంతేకాదు రాష్ట్రంలో డిమాండ్‌కు తగిన విద్యుత్ సరఫరా కోసం డిస్కంలు.. విద్యు దుత్పత్తి కంపెనీలతో ముందస్తు కొనుగోలు ఒప్పం దాలు చేసుకుంటున్నాయి. కానీ భారీ పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు, రైల్వే సంస్థలు.. డిస్కంల విద్యుత్‌ను కాదని ఓపెన్ యాక్సెస్ విధానంలో కొనుగోళ్లు చేస్తున్నాయి. దీంతో డిస్కంలు ఒప్పందాలతో సమీకరిస్తున్న విద్యుత్ నిరుపయో గంగా మారుతోంది. ఈ మేరకు సరఫరా తగ్గించాల ని విద్యుదుత్పత్తి సంస్థలను డిస్కంలు కోరుతు న్నాయి. కానీ ఒప్పందం మేరకు స్థిర చార్జీలను మాత్రం చెల్లించాల్సి వస్తోంది. దీని కారణంగా కూడా డిస్కంలకు భారీగా నష్టాలు వస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment