పరిశ్రమలకు ఫుల్ పవర్
పవర్‌హాలిడేను ఎత్తేసిన ప్రభుత్వం
మూడు నెలలుగా కరెంటు ‘కట్’ కట
నేటి నుంచి నిరంతర విద్యుత్తు
సాక్షి, హైదరాబాద్: మూడు నెలలుగా విద్యుత్తు సంక్షోభంతో తల్లడిల్లుతున్న పరిశ్రమలకు శుభవార్త. గురువారం ఉదయం నుంచీ పరిశ్రమలకు పవర్ హాలిడేను ఎత్తివేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఖరీఫ్ సీజన్ ముగియటంతో పాటు విద్యుత్తు డిమాండ్ తగ్గిన దృష్ట్యా పరిశ్రమలకు విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించనుంది. ఈ మేరకు టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ జి.రఘుమారెడ్డి తెలిపారు. రెండ్రోజులు ముందుగానే టీఎస్‌ఎన్‌పీడీసీఎల్ పరిధిలో పరిశ్రమలతో పాటు పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్తు కోతలను ఎత్తివేశారు. రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్ ప్రభుత్వ అంచనాలు దాటిపోయింది. పంట కాలం కావటం... రైతుల ఆందోళనల దృష్ట్యా వ్యవసాయానికి కనీసం ఆరు గంటల సరఫరా అనివార్యమైంది. దీంతో పరిశ్రమలపై కోత విధించటం మినహా గత్యంతరం లేదని ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగా పరిశ్రమలకు వారంలో రెండు రోజుల పాటు విద్యుత్తు కోత విధించింది. అప్పటి వరకు అమల్లో ఉన్న ఒకరోజు పవర్ హాలిడేను... అక్టోబర్ 8 నుంచి రెండు రోజులకు పెంచింది. గత నెలాఖరు నుంచి రాష్ట్రంలో విద్యుత్తు సరఫరా కుదుటపడింది.
వర్షాలతో విద్యుత్తు డిమాండ్ కొంత మేరకు తగ్గింది. విద్యుత్తు డిమాండ్, విద్యుత్తు లభ్యతను సమీక్షించిన ప్రభుత్వం అక్టోబర్ 28 నుంచి పరిశ్రమలకు పవర్ హాలిడేను ఒక రోజుకు కుదించింది. ప్రస్తుతం పరిస్థితి మరింత మెరుగుపడింది. అక్టోబర్‌లో సగటున 160 నుంచి 165 మిలియన్ యూనిట్ల విద్యుత్తు డిమాండ్ ఉంటే.. ఇప్పుడది 125-130 మిలియన్ యూనిట్లకు తగ్గింది. ఖరీఫ్ సీజన్ ముగియటంతో వ్యవసాయానికి సరఫరా చేసే విద్యుత్తు ఆదా అయింది. చలి కాలం కూడా మొదలవటంతో వారం రోజులుగా విద్యుత్తు డిమాండ్ తగ్గింది.