సాక్షి, హైదరాబాద్: బహిరంగ విపణి (ఓపెన్ యాక్సెస్) నుంచి నేరుగా గ్రీన్ ఎనర్జీ కొనుగోళ్లకు ఉన్న నిబంధనలను కేంద్ర ప్రభుత్వం మరింత సరళతరం చేసింది. ఒకే విద్యుత్ సబ్ డివిజన్ (రెవెన్యూ డివిజన్‌తో సమానం) పరిధిలో ఒకటి/అంతకు మించిన సంఖ్యలో విద్యుత్ కనెక్షన్లు కలిగిన సాధారణ విద్యుత్ వినియోగదారులు ఎవరైనా ఇకపై ఓపెన్ యాక్సెస్ విధానంలో సౌర/పవన/పంప్డ్ స్టోరేజీ విద్యుత్ వంటి గ్రీన్ ఎనర్జీని కొనుగోలు చేసుకోవచ్చు. అయితే సదరు వినియోగదారుకు విద్యుత్ కనెక్షన్ల కాంట్రాక్ట్ లోడ్/శాంక్షన్డ్ లోడ్ కలిపి కనీసం 100 కిలోవాట్లు, ఆపైన ఉండాలి. సొంత విద్యుత్ ప్లాంట్లు కలిగిన భారీ పరిశ్రమల వంటి కాప్టివ్ విద్యుత్ వినియోగదారులైతే.. ఓపెన్ యాక్సెస్‌లో ఎలాంటి పరిమితులు లేకుండా గ్రీన్ ఎనర్జీని
కొనుగోలు చేసుకోవచ్చు. ఈ మేరకు ‘ది ఎలక్ట్రిసిటీ (ప్రమోటింగ్ గ్రీన్ ఎనర్జీ త్రూ గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్) రెండో సవరణ నిబంధనలు–2023’ను అమల్లోకి తెస్తూ కేంద్ర విద్యుత్ శాఖ తాజాగా గెజిట్ నోటిఫికేషన్ వెలువరించింది. ఇప్పటివరకు 1000 కిలోవాట్స్ (ఒక మెగావాట్‌తో సమానం), ఆపై లోడ్ కలిగినవారు మాత్రమే ఓపెన్ యాక్సెస్‌లో విద్యుత్ కొనుగోలు చేసుకోవడానికి అవకాశం ఉంది. డిస్కంల టారిఫ్‌తో పోల్చితే ఓపెన్ యాక్సెస్‌లో తక్కువ ధరకు విద్యుత్ లభ్యత ఉన్నప్పుడు.. భారీ పరిశ్రమలు ఆ విద్యుత్‌ను కొంటూ బిల్లుల భారం తగ్గించుకుంటున్నాయి. ఇకపై ఈ అవకాశం 100 కిలోవాట్ల లోడ్ కలిగిన వినియోగదారులకు సైతం లభించనుంది.
చిన్న పరిశ్రమలకు ప్రయోజనం!
ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ రంగ దక్షిణ/ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థల (ఎస్పీడీసీఎల్ / ఎన్పీడీసీఎల్) నుంచే చాలావరకు వినియోగదా రులకు విద్యుత్ సరఫరా అవుతోంది. హెచ్‌టీ విద్యుత్ కనెక్షన్లు కలిగిన భారీ పరిశ్రమలు మాత్రమే ఇప్పటివరకు ఓపెన్ యాక్సెస్‌లో బయటి నుంచి విద్యుత్ కొనుక్కుంటున్నాయి. ఇలా ఓపెన్ యాక్సెస్ కొనుగోళ్లకు సంబంధించి డిస్కంలు ప్రతి యూనిట్‌పై 50 పైసల వరకు అదనపు సర్‌చార్జి వసూలు చేస్తున్నాయి. ఇకపై 100 కిలోవాట్లు, ఆపై లోడ్ కలిగిన వినియోగదారులు దేశంలో ఎక్కడి నుంచైనా గ్రీన్ ఎనర్జీని ఓపెన్ యాక్సెస్ విధానంలో కొనుగోలు చేసుకోవచ్చు. సాధారణ గృహ విద్యుత్ వినియోగదారుల శాంక్షన్డ్/కాంట్రాక్ట్ లోడ్ 10 కిలో వాట్ల లోపే ఉంటుంది. 100 కిలోవాట్ లోడ్ కలిగి ఉన్న భారీ నివాస భవనాలు, వాణిజ్య, పారిశ్రామి క వినియోగదారులకు కొత్త విధానంతో ప్రయోజ నం ఉండనుంది. ఇక 2032 డిసెంబర్ నాటికి నిర్మా ణం పూర్తి చేసుకోనున్న సముద్ర తీర పవన విద్యుత్ ప్రాజెక్టుల నుంచి ఓపెన్ యాక్సెస్ విద్యుత్ కొనే వినియోగదారులపై అదనపు సర్‌చార్జి విధించవద్ద ని కేంద్రం తాజా నిబంధనల్లో స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment