the operating system
-
రూ.5999లకే వీడియోకాన్ ఇన్ఫీనియం జెడ్50
లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్, క్వాడ్‌కోర్ ప్రాసెసింగ్ పవర్లతో కూడిన సరికొత్త స్మార్ట్‌ఫోన్ ఇన్ఫీనియం జెడ్50 నోవాను దేశీ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వీడియోకాన్ ఇటీవల విడుదల చేసింది. అయిదు అంగుళాల స్క్రీన్ కలిగిఉన్న ఈ ఫోన్ ధర రూ.5,999లు మాత్రమే. మైక్రోప్రాసెసర్ సామర్థ్యం 1.3 గిగాహెర్ట్జ్ కాగా, ర్యామ్ ఒక జీబీగా ఉంది. అంతేకాదు.. ఎనిమిది జీబీలు ఉన్న మెమరీని మైక్రోఎస్డీ కార్డు ద్వారా 32 జీబీల వరకూ పెంచుకోవచ్చు. రెండు సిమ్‌లను సపోర్ట్ చేసే ఇన్ఫీనియం జెడ్ 50 నోవాలో 8, 2 మెగాపిక్సెళ్ల రెజల్యూషన్లున్న కెమెరాలు ఉపయోగించారు. ఆంటీవైరస్, జీపీఎస్ ఆధారిత వ్యక్తిగత భద్రత అప్లికేషన్ వీసెక్యూర్లు ఉచితంగా లభిస్తాయి. అంతేకాకుండా హంగామా, గేమ్‌లాఫ్ట్ వంటి సైట్లకు 90 రోజుల ఉచిత సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. బ్లూటూత్ 4.0, వైఫై, మిరాకాస్ట్ సపోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్లున్న ఈ స్మార్ట్‌ఫోన్ బడ్జెట్‌పై శ్రద్ధ ఉన్నవారికి మెరుగైన అవకాశమనే చెప్పాలి. -
కొత్త సరకు
లావా ఐరిస్ ఫ్యుయెల్ 60... లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్.. త్వరలో రానున్న కొత్త ఓఎస్‌కు అప్‌గ్రేడ్ అయ్యే అవకాశం... ఇవీ లావా ఐరిస్ ఫ్యుయెల్ 60 స్మార్ట్‌ఫోన్‌ను ఎంచుకునేందుకు ఉన్న రెండు మంచి కారణాలు. ఈ దేశీ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఇటీవలే విడుదల చేసిన ఈ సరికొత్త మోడల్ ఫోన్ ఐదు అంగుళాల ఐపీఎస్ హెచ్డీ స్క్రీన్, 1280 బై 720 రెజల్యూషన్ డిస్ప్లేతో లభిస్తోంది. స్క్రీన్‌పై గీతలు వంటివి పడకుండా ఉండేందుకు గొరిల్లా గ్లాస్-3ని ఉపయోగించడం విశేషం. శక్తిమంతమైన మీడియాటెక్ 1.3 గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్‌తో వస్తున్న ఫ్యుయెల్ 60లో ఒక జీబీ ర్యామ్, 8 జీబీల మెమరీ ఉంది. కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టమ్‌కు తోడుగా 4000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండటం వల్ల 2జీ నెట్‌వర్క్‌పై దాదాపు 32 గంటల టాక్‌టైమ్ లభిస్తుందని కంపెనీ చెబుతోంది. క్విక్‌ఛార్జ్ టెక్నాలజీ కారణంగా మూడు గంటల 15 నిమిషాల్లో ఫోన్‌ను పూర్తిగా ఛార్జ్ చేసుకోవచ్చు. ప్రధాన కెమెరా రెజల్యూషన్ 10 ఎంపీ కాగా, వీడియోకాలింగ్ కోసం 2 ఎంపీ కెమెరాను ఏర్పాటు చేశారు. త్రీజీ, వైఫై, బ్లూటూత్ 3.0 యూఎస్బీ ఓటీజీ వంటి కనెక్టివిటీ ఆప్షన్లున్న ఈ ఫోన్ ధర రూ.8888. ఎనిమిది అంగుళాల స్క్రీన్‌తో ‘హానర్ టీ1’ టాబ్లెట్ చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ హువాయి తాజాగా టీ1 పేరుతో ఎనిమిది అంగుళాల స్క్రీన్సైజున్న టాబ్లెట్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. వాయిస్ కాలింగ్ సౌకర్యం కూడా ఉన్న ఈ టాబ్లెట్‌లో 1.2 గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్ (క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్)ను ఉపయోగించారు. స్క్రీన్ రెజల్యూషన్ 1280 బై 800 గా ఉంది. ర్యామ్ 1 జీబీ, మెమరీ 8 జీబీలుగా కాగా... మైక్రోఎస్డీ కార్డు ద్వారా మెమరీని 32జీబీ వరకూ పెంచుకునే వెసలుబాటు ఉంది. వైఫై, బ్లూటూత్, జీపీఎస్/ఏజీపీఎస్ త్రీజీ వంటి కనెక్టివిటీ ఆప్షన్లున్న ఈ టాబ్లెట్‌లో 4800 ఎంఏహెచ్ సామర్థ్యమున్న బ్యాటరీని వాడారు. ఫలితంగా దాదాపు 300 గంటల స్టాండ్‌బై టైమ్ లభిస్తుందని కంపెనీ చెబుతోంది. అయితే ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టమ్ అందుబాటులోకి వచ్చినప్పటికీ దీంట్లో జెల్లీబీన్ 4.3 వెర్షన్‌ను మాత్రమే వాడుతూండటం అది కూడా కంపెనీ చేసిన ఔట్ ఆఫ్ ది బాక్స్ మార్పులు, యూజర్ ఇంటర్ఫేస్ 1.6లతో ఉండటం గమనార్హం. -
కొత్త సరకు
జోలో ప్లే 8ఎక్స్-1100... పెన్‌డ్రై వ్ను నేరుగా కనెక్ట్ చేసుకునేందుకు వీలుకల్పించే సరికొత్త స్మార్ట్‌ఫోన్ ఒకదాన్ని దేశీయ సంస్థ జోలో ఇటీవలే మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. జోలో ప్లే 8ఎక్స్-1100 పేరుతో అందుబాటులోకి వచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్ హైఎండ్ ఫీచర్లు కలిగి ఉంది. ఇందుకు తగ్గట్టుగానే ధర రూ.14,999. ఈ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ఫీచర్ ప్రాసెసర్ వేగం. ఎనిమిది కోర్లతో వచ్చే ప్రాసెసర్ 1.7 గిగాహెర్ట్జ్ క్లాక్‌స్పీడ్‌తో పనిచేస్తుంది. ర్యామ్ కూడా రెండు జీబీలు ఉండటం విశేషం. ప్రధాన కెమెరా 13 మెగాపిక్సెళ్ల సామర్థ్యం ఉండటంతోపాటు, సోనీ ఎక్స్మోర్ ఆర్ఎస్ సెన్సర్ కలిగి ఉండటం విశేషం. ఈ సెన్సర్ ద్వారా ఫొటోల నాణ్యత చాలా మెరుగ్గా ఉంటుంది. సెల్ఫీల కోసం 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఏర్పాటు చేశారు. ఫైల్ షేరింగ్ వేగంగా జరిగేందుకు ‘హాట్‌నాట్’ అనే కొత్త టెక్నాలజీని ఉపయోగించారు. మామూలు స్మార్ట్ఫోన్లతో పోలిస్తే హాట్‌నాట్ ద్వారా అయిదు రెట్లు ఎక్కువ వేగంతో ఫైల్ షేరింగ్ సాధ్యమని అంచనా. జోలో ప్లే ఇంటర్నల్ మెమరీ 16 జీబీ కాగా, ఎస్డీ కార్డు ద్వారా 32 జీబీ వరకూ పెంచుకోవచ్చు. సెల్కాన్ మిలినియం గ్లోరీ క్యూ5... లేటెస్ట్ ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టమ్, 1.3 గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, రెండు త్రీజీ సిమ్‌లకు సపోర్ట్... ఇవీ దేశీ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ సెల్కాన్ తాజాగా విడుదల చేసిన మిలినియం గ్లోరీ క్యూ5లో కనిపించే ప్రముఖమైన ఫీచర్లు. హై ఎండ్ ఫీచర్లు ఉన్నప్పటికీ ధర మాత్రం రూ.7299లు మాత్రమే ఉండటం విశేషం. అంతేకాదు... మొబైల్గేమింగ్ అంటే ఎక్కువ ఆసక్తి ఉన్న వారి కోసం గేమ్‌లాఫ్ట్ సహకారంతో ‘ప్రిన్స్ ఆఫ్ పర్షియా’, ‘ది అవెంజర్స్’, ‘మోడ్రన్ కాంబాట్ -4’ వంటి గేమ్స్‌ను ఇన్‌బిల్ట్‌గా లభిస్తాయి ఈ ఫోన్లో. స్క్రీన్ సైజు ఐదు అంగుళాలు. క్యూహెచ్డీ ఐపీఎస్ ఓజీఎస్ రకం స్క్రీన్ కావడం వల్ల చిత్రాల నాణ్యత మెరుగ్గా ఉంటుంది. భారతీయ భాషలకు సపోర్ట్ ఉండటం, ఒక గిగాబైట్ ర్యామ్, ఎనిమిది జీబీల ఇంటర్నల్ మెమరీ కొన్ని ఇతర ఫీచర్లు. బ్యాటరీ సామర్థ్యం 1800 ఎంఏహెచ్ మాత్రమే అయినప్పటికీ ఆపరేటింగ్ సిస్టమ్ కిట్‌క్యాట్ కాబట్టి మెరుగైన టాక్‌టైమ్, స్టాండ్‌బై టైమ్ లభించే అవకాశముంది. -
ఎక్స్పీ కథ కంచికి...ఐతే నాకేంటి?
మైక్రోసాఫ్ట్ విండోస్ ఎక్స్‌పీకి గుడ్‌బై చెప్పేసింది. 8 ఏప్రిల్ 2014 నుంచి ఈ ఆపరేటింగ్ సిస్టమ్ సెక్యూరిటీ అప్డేట్స్ని నిలిపివేసింది. హ్యాకర్ చొరబడినా... వైరస్ దాడి చేసినా విలువైన సమాచారం కోల్పోవాల్సిందే. అంతేనా? ఇంకేమీ చేయలేమా? డేటాను కాపాడుకోవడం ఎలా? అన్న సందేహాలకు సమాధానాలు ఇవిగో.... ప్రపంచంలోని ప్రతి మూడు కంప్యూటర్లలో ఒకటి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎక్స్‌పీని వాడుతూందంటేనే దీని ప్రాముఖ్యత ఏమిటో అర్థం చేసుకోవచ్చు. విండోస్ 98 తరువాత అత్యంత ప్రజాదరణ పొందని ఓఎస్ ఇది. విస్టా, విండోస్ 7, 8 వెర్షన్లు వచ్చినా అనుకూల అంశాలను దృష్టిలో ఉంచుకుని చాలామంది దీనికే కట్టుబడి ఉండిపోయారు. అయితే మైక్రోసాఫ్ట్ ఏప్రిల్ ఎనిమిదవ తేదీ నుంచి ఈ ఓఎస్‌కు అందించే సపోర్ట్ సేవలన్నింటినీ నిలిపివేస్తున్నట్లు ప్రకటిండంతో చాలామందిలో ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలో వినియోగదారుల ముందు ఉన్న అవకాశాలు ఇలా ఉన్నాయి... కొత్త ఓఎస్‌లకు వెళ్లడం... విండోస్ ఎక్స్పీ స్థానంలో నేరుగా విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఎంచుకోవచ్చు. అయితే దీనికి మీరు ఉపయోగిస్తున్న పీసీలోని హార్డ్‌వేర్ సపోర్ట్ చేస్తుందా లేదా? చూసుకోవాల్సి ఉంటుంది. ఒక గిగాహెర్ట్జ్ కంటే ఎక్కువ వేగమున్న ప్రాసెసర్, ఒక జీబీ ర్యామ్, (64 బిట్ కంప్యూటర్లకైతే 2 జీబీ), 16 నుంచి 20 జీబీల హార్డ్‌డిస్క్ ఉంటే చాలు... ప్రస్తుతం మీరు ఉపయోగిస్తున్న పీసీలోనే విండోస్ 7 లేదా 8ను ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అయితే పీసీ పనితీరు చెప్పుకోదగ్గ స్థాయిలో ఉండదు. ఈ సరికొత్త ఓఎస్‌లు వేగంగా పనిచేయాలన్నా, ఫొటోలు, వీడియోలతో పాటు అనేక రకాల సాఫ్ట్వేర్లను స్టోర్ చేసుకోవాలన్నా, ఏకకాలంలో అనేక అప్లికేషన్లను రన్ చేయాలన్నా మీ పీసీలో కనీసం డ్యుయెల్‌కోర్ ప్రాసెసర్ ఉండాలి. అదే సమయంలో నాలుగు జీబీల ర్యామ్‌తోపాటు 500 జీబీల హార్డ్‌డిస్క్ తప్పనిసరి. సమాచారం మాటేమిటి? ఎక్స్పీ సపోర్ట్ సేవలు రద్దవుతున్న నేపథ్యంలో సమాచార తస్కరణకు, విధ్వంసానికి హ్యాకర్లు సిద్ధమవుతున్నట్లు వార్తలొస్తున్నాయి. కాబట్టి మీ పీసీల్లో ఉండే సమాచారం విషయంలో తగు జాగ్రత్త అవసరం. ఇందుకోసం మొత్తం సమాచారాన్ని నేరుగా ఫ్లాష్ లేదా యూఎస్బీ ఆధారిత ఎక్స్టర్నల్ హార్డ్డ్రైవ్ల్లోకి ఎక్కించుకోవడం ఒక ఆప్షన్. లేదా డ్రాప్‌బాక్స్ వంటి క్లౌడ్ సర్వీసులపై ఆధారపడాలి. ఈ రకమైన క్లౌడ్ సర్వీసులు కొంత మేరకు ఉచిత స్టోరేజీ సౌకర్యం ఇస్తాయి. ఎక్కువ మోతాదులో సమాచారాన్ని స్టోర్ చేసుకోవాలంటే మాత్రం కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఎక్స్పీ నుంచి విండోస్ 7 లేదా 8కు మారుతూంటే ‘ఈజీ ట్రాన్స్ఫర్ టూల్’ ద్వారా సమాచారాన్ని భద్రంగా కొత్త ఓఎస్లోకి మార్చుకోవచ్చు. ఎక్స్పీ కోసం ఈ టూల్ ఇప్పటికే అందుబాటులో ఉంది. పాత పీసీతో మరిన్ని చిక్కులు కొత్త విండోస్ ఓఎస్‌కు మారిపోదామనుకున్నా మీ పీసీ మరీ పాతదైతే ఆ అవకాశముండదు. కచ్చితంగా చెప్పాలంటే 2006కు ముందునాటి పీసీలతో కొన్ని చిక్కులున్నాయి. తగిన ర్యామ్, హార్డ్‌డ్రైవ్, డిస్ప్లే అడాప్టర్లు లభించడం కష్టం. ఒకవేళ ఇవన్నీ అందుబాటులో ఉన్నప్పటికీ పాతకాలం నాటి మదర్బోర్డుతోనూ సమస్యలొస్తాయి. ఈ చిక్కులేవీ వద్దనుకుంటే నేరుగా కొత్త పీసీ కొనడం మేలు. లేదా లినక్స్ వంటి ఓపెన్‌సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్, లేదా ఆపిల్ మ్యాకింతోష్ ఓఎస్‌లకు మారడం మేలు. లినక్స్ మింట్ ఆపరేటింగ్ సిస్టమ్‌కు క్రాస్ఓవర్ లేదా ప్లేఆన్ లినక్స్ వంటి అప్లికేషన్లను జత చేసుకుంటే విండోస్ ఓస్‌తో పనిచేసే చాలావరకూ సాఫ్ట్వేర్లను లినక్స్ ఓఎస్‌లోనూ పనిచేసేలా చేసుకోవచ్చు. 2001లో అందుబాటులోకి వచ్చిన విండోస్ ఎక్స్పీ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30 శాతం పీసీల్లో పనిచేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 95 శాతం ఏటీఎంలకు ఈ ఆపరేటింగ్ సిస్టమే ఆధారం. 2014 ఏప్రిల్ 8వ తేదీ నుంచి సెక్యూరిటీ ఆప్‌డేట్స్‌ను నిలిపేయనున్న మైక్రోసాఫ్ట్ వచ్చే ఏడాది వరకూ మాల్వేర్ నుంచి రక్షణ కల్పించేందుకు అంగీకరించింది. సపోర్ట్ సర్వీసులను మరో ఏడాదిపాటు పొడిగించేందుకు యునెటైడ్ కింగ్డమ్ మైక్రోసాఫ్ట్‌కు చెల్లించనున్న మొత్తం 55 లక్షల పౌండ్లు!