కొత్త సరకు
లావా ఐరిస్ ఫ్యుయెల్ 60...
లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్.. త్వరలో రానున్న కొత్త ఓఎస్‌కు అప్‌గ్రేడ్ అయ్యే అవకాశం... ఇవీ లావా ఐరిస్ ఫ్యుయెల్ 60 స్మార్ట్‌ఫోన్‌ను ఎంచుకునేందుకు ఉన్న రెండు మంచి కారణాలు. ఈ దేశీ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఇటీవలే విడుదల చేసిన ఈ సరికొత్త మోడల్ ఫోన్ ఐదు అంగుళాల ఐపీఎస్ హెచ్‌డీ స్క్రీన్, 1280 బై 720 రెజల్యూషన్ డిస్‌ప్లేతో లభిస్తోంది. స్క్రీన్‌పై గీతలు వంటివి పడకుండా ఉండేందుకు గొరిల్లా గ్లాస్-3ని ఉపయోగించడం విశేషం. శక్తిమంతమైన మీడియాటెక్ 1.3 గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్‌తో వస్తున్న ఫ్యుయెల్ 60లో ఒక జీబీ ర్యామ్, 8 జీబీల మెమరీ ఉంది. కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టమ్‌కు తోడుగా 4000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండటం వల్ల 2జీ నెట్‌వర్క్‌పై దాదాపు 32 గంటల టాక్‌టైమ్ లభిస్తుందని కంపెనీ చెబుతోంది. క్విక్‌ఛార్జ్ టెక్నాలజీ కారణంగా మూడు గంటల 15 నిమిషాల్లో ఫోన్‌ను పూర్తిగా ఛార్జ్ చేసుకోవచ్చు. ప్రధాన కెమెరా రెజల్యూషన్ 10 ఎంపీ కాగా, వీడియోకాలింగ్ కోసం 2 ఎంపీ కెమెరాను ఏర్పాటు చేశారు. త్రీజీ, వైఫై, బ్లూటూత్ 3.0 యూఎస్‌బీ ఓటీజీ వంటి కనెక్టివిటీ ఆప్షన్లున్న ఈ ఫోన్ ధర రూ.8888.
ఎనిమిది అంగుళాల స్క్రీన్‌తో ‘హానర్ టీ1’ టాబ్లెట్
చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ హువాయి తాజాగా టీ1 పేరుతో ఎనిమిది అంగుళాల స్క్రీన్‌సైజున్న టాబ్లెట్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. వాయిస్ కాలింగ్ సౌకర్యం కూడా ఉన్న ఈ టాబ్లెట్‌లో 1.2 గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్ (క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్)ను ఉపయోగించారు. స్క్రీన్ రెజల్యూషన్ 1280 బై 800 గా ఉంది. ర్యామ్ 1 జీబీ, మెమరీ 8 జీబీలుగా కాగా... మైక్రోఎస్‌డీ కార్డు ద్వారా మెమరీని 32జీబీ వరకూ పెంచుకునే వెసలుబాటు ఉంది. వైఫై, బ్లూటూత్, జీపీఎస్/ఏజీపీఎస్ త్రీజీ వంటి కనెక్టివిటీ ఆప్షన్లున్న ఈ టాబ్లెట్‌లో 4800 ఎంఏహెచ్ సామర్థ్యమున్న బ్యాటరీని వాడారు. ఫలితంగా దాదాపు 300 గంటల స్టాండ్‌బై టైమ్ లభిస్తుందని కంపెనీ చెబుతోంది. అయితే ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టమ్ అందుబాటులోకి వచ్చినప్పటికీ దీంట్లో జెల్లీబీన్ 4.3 వెర్షన్‌ను మాత్రమే వాడుతూండటం అది కూడా కంపెనీ చేసిన ఔట్ ఆఫ్ ది బాక్స్ మార్పులు, యూజర్ ఇంటర్ఫేస్ 1.6లతో ఉండటం గమనార్హం.