భలే ఆప్స్
ఆండ్రాయిడ్‌కూ వీఎల్‌సీ...
పీసీ ల్యాప్‌టాప్‌లలో ఆడియో, వీడియోలు చూసేవారికి వీఎల్‌సీ పేరు చిరపరిచితమే. దాదాపు అన్ని రకాల ఫార్మాట్లలోని ఆడియో/వీడియో ఫైళ్లను రన్ చేసే ఈ ప్లేయర్ ఇప్పుడు ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫార్మ్‌లోనూ అందుబాటులోకి వచ్చింది. కొన్ని వారాల క్రితం దీని బీటా వెర్షన్ విడుదల కాగా, తాజాగా గూగుల్ ప్లేస్టోర్‌లో దీన్ని అందరికీ అందుబాటులో ఉంచారు. మీడియా లైబ్రరీ ఏర్పాటుకు అవకాశముండటం, ఫోల్డర్లలోని ఫైళ్లను నేరుగా బ్రౌజ్ చేయగలగడం ఈ అప్లికేషన్‌లోని కొన్ని ప్రత్యేకతలు. ఒకటికంటే ఎక్కువ భాషల్లో సబ్‌టైటిల్స్ చూసుకునే అవకాశం కూడా ఉంది. ఆటో రొటేషన్, ఆస్పెక్ట్ రేషియోలను సరిచేసుకునే అవకాశం, బ్రై ట్‌నెస్ సౌండ్‌ల అడ్జస్ట్‌మెంట్లకు గెస్చర్ కంట్రోల్ మరికొన్ని అదనపు ఫీచర్లు.
మంచినీటి లెక్కకూ ఓ అప్లికేషన్...
మెరుగైన ఆరోగ్యం కోసం రోజూ తగు మోతాదులో మంచినీళ్లు తాగాలని వైద్యులు చెబుతూంటారు. పనిఒత్తిడి లేదా మతిమరపుల కారణంగా మనం ఈ విషయాన్ని పక్కనపెట్టేస్తూండటం కద్దు. ‘వాటర్ యువర్ బాడీ’ అప్లికేషన్‌ను స్మార్ట్‌ఫోన్‌లో పెట్టేసుకున్నారనుకోండి. నీరు తాగండని అదే మీకు గుర్తు చేస్తూంటుంది. మీరు ఎంత బరువు ఉన్నారో దీంట్లో నమోదు చేస్తే ... రోజుకు మీకెన్ని నీళ్లు కావాలో కూడా అప్లికేషన్ ద్వారానే గుర్తించవచ్చు. నీరు తాగినప్పుడల్లా అప్లికేషన్‌లో దాన్ని నమోదు చేస్తే ఆ తరువాత మీరెప్పుడు నీరుతాగాలో అదే గుర్తు చేస్తుంది. నోటిఫికేషన్లు రోజువారీగానైనా సెట్ చేసుకోవచ్చు. లేదంటే నిర్దిష్ట సమయానికైనా ఏర్పాటు చేసుకునే అవకాశముంది. గూగుల్ ప్లే స్టోర్‌లో ఉచితంగా లభిస్తుంది ఈ అప్లికేషన్.