లిప్‌కిస్ ద్వారా కోట్ల బ్యాక్టీరియాల మార్పిడి!
లండన్: లిప్ కిస్‌లతో కోట్లాది బ్యాక్టీరియాలు కూడా ఒకరి నుంచి మరొకరికి మార్పిడి అవుతాయని ఓ పరిశోధనలో వెల్లడైంది. సుమారు పది సెకన్ల పాటు ముద్దు పెట్టుకుంటే ఒకరి నుంచి మరొకరికి ఏకంగా 8 కోట్ల బ్యాక్టీరియాలు చేరిపోతాయి. మైక్రోపియా మ్యూజియం, నెదర్లాండ్స్ ఆర్గనైజేషన్ ఫర్ అప్లైడ్ సైంటిఫిక్ రీసెర్చ్ పరిశోధకులు ఈ సంగతి వెల్లడించారు. వారు నెదర్లాండ్స్‌లో 21 మంది జంటలపై పరిశోధనలు జరిపారు.
మనిషి నోట్లో సాధారణంగా 700 జాతులకు చెందిన కోట్లాది బ్యాక్టీరియాలు ఉంటాయి. ఫ్రెంచ్ కిస్ వల్ల దంపతులు ఇద్దరిలోనూ ఒకే రకమైన బ్యాక్టీరియాలు కొలువవుతాయని నెదర్లాండ్స్ శాస్త్రవేత్తలు వెల్లడించారు. పరిశోధనలో పాల్గొన్న దంపతుల నోట్లో నుంచి ముద్దు పెట్టుకునే ముందు, తర్వాత లాలాజలం, ఉమ్మి శాంపిళ్లను సేకరించి విశ్లేషించగా ఈ విషయం తెలిసిందని వారు పేర్కొన్నారు. అయితే ఈ విషయాలు కొత్తగా తెలిశాయని మనం కంగారు పడవలసిన అవసరం ఏమీలేదు. ఫ్రెంచ్ కిస్ వల్ల దంపతులిద్దరిలోనూ ఆరోగ్యానికి మేలు చేసే ప్రోబ్యాక్టీరియా కూడా మూడు రెట్లు పెరుగుతోందని వారు కనుగొన్నారు.
**