Oscar library
-
ఆస్కార్ లైబ్రరీలో జోరమ్
హిందీ చిత్రం ‘జోరమ్’ చరిత్ర సృష్టించింది. ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ లైబ్రరీలో ఈ సినిమాకు చోటు దక్కింది. దేవాశిష్ మఖిజా దర్శకత్వంలో మనోజ్ బాజ్‌పాయ్, మొహమ్మద్ జీషన్ అయ్యూబ్, తన్నిష్ఠ ఛటర్జీ ప్రధాన పాత్రధారులుగా ఈ సినిమా రూపొందింది. జీ స్టూడియోస్, మఖిజా ఫిలింస్ ఈ సినిమాను నిర్మించాయి. గత ఏడాది ఫిబ్రవరిలో జరిగిన రోటర్‌డామ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, జూన్‌లో సిడ్నీ ఫిల్మ్ ఫెస్టివల్, జూలైలో డర్బన్ ఫిల్మ్ ఫెస్టివల్, అక్టోబరులో 28వ బూసాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, 59వ చికాగో ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ సినిమా ప్రదర్శితమైంది. థియేటర్స్‌లో గత ఏడాది డిసెంబరు 8న విడుదలైంది. ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు దక్కినప్పటికీ బాక్సాఫీస్ వద్ద మాత్రం మెరుగైన ఫలితం దక్కలేదు. అయితే తాజాగా ఈ సినిమా వందేళ్ల చరిత్ర ఉన్న ఆస్కార్ లైబ్రరీలో చోటు దక్కించుకుంది. ఈ విషయాన్ని ‘ఎక్స్’లో షేర్ చేశారు మనోజ్ బాజ్‌పాయ్. ‘‘నా చిత్రానికి ఇలాంటి గౌరవం దక్కడం సంతోషంగా ఉంది. ఇది యూనిట్ సమష్టి విజయం. మనం ఎంత చేయగలమో మనకే తెలుసు’’ అని పేర్కొన్నారు మనోజ్. ఇక ఈ చిత్రకథ విషయానికి వస్తే.. తన కుమార్తె ప్రాణాలను కాపాడటం కోసం ఓ తండ్రి చేసే పోరాటం నేపథ్యంలో సాగే సర్వైవల్ డ్రామాగా ‘జోరమ్’ తెరకెక్కింది. 2016లో ‘తాండవ్’ షార్ట్ ఫిల్మ్, 2020 జూన్‌లో ‘భోంస్లే’ (ఇండియా రిలీజ్) చిత్రాల తర్వాత హీరో మనోజ్ బాజ్‌పాయ్, దర్శకుడు దేవాశిష్ మఖిజా కాంబినేషన్లో రూపొందిన మూడో చిత్రం ‘జోరమ్’. -
ఆస్కార్ లైబ్రరీకి సోనమ్ సినిమా
కపూర్ల ఖాన్దాన్ నుంచి వచ్చినప్పటికి.. నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సోనమ్ కపూర్. ‘నీర్జా’ సినిమాలో తన నటనకుగాను జ్యూరీ విభాగంలో ఉత్తమ నటి అవార్డు సైతం సొంతం చేసుకున్న సోనమ్‌కు.. ఇప్పుడు మరో అరుదైన గౌరవం దక్కనుంది. సోనమ్, తండ్రి అనిల్ కపూర్‌తో కలిసి నటించిన ‘ఏక్ లడ్కీ కో దేఖా తో ఐసా లగా’ చిత్రాన్ని ఆస్కార్ లైబ్రరీలో చేర్చనున్నారు. మూవీకి సంబంధించిన ఓ కాపీని అందించాలని.. దాన్ని లైబ్రరీ కోర్ కలెక్షన్స్‌లో ఉంచుతామని ‘అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్’ సంస్థ సినిమా నిర్మాతలను కోరిందట. ఈ వార్త తెలిసిన సోనమ్ కపూర్ ఆనందం వ్యక్తం చేశారు. ‘మా నాన్నతో కలిసి నటించిన మొదటి సినిమాకు ఇలాంటి గౌరవం దక్కడం చాలా సంతోషంగా ఉంది. మంచి సందేశంతో వచ్చిన ఈ సినిమాను ప్రేక్షకులు ఎంతో ఆదరించారు. ఇప్పుడు ఈ సినిమాను ఆస్కార్ లైబ్రరీలో కూడా ఉంచడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది’ అంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు సోనమ్. స్వలింగ సంపర్కం అనే అంశంతో తెరకెక్కిన ఈ సినిమాలో టాలీవుడ్ భామ రెజీనా, అనిల్ కపూర్, రాజ్‌కుమార్ రావు, జూహీ చావ్లా కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఇప్పటికే దాదాపు రూ. 20 కోట్లు వసూలు చేసింది. -
ఆస్కార్ లైబ్రరీలో...
ఆస్కార్గా ప్రపంచ ప్రసిద్ధమైన అవార్డులను అందించే ‘అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సెన్సైస్’ లైబ్రరీలో హిందీ చిత్రం ‘హ్యాపీ న్యూ ఇయర్’కు అరుదైన గౌరవం దక్కింది. సినీ దర్శక, నిర్మాతలకు, నటీనటులకు, రచయితలకు.. ఇంకా సినిమా రంగానికి చెందిన ఇతర శాఖలవారికీ, విద్యార్థులకు పరిశోధన నిమిత్తం ఈ లైబ్రరీలో ఉత్తమ స్క్రీన్‌ప్లేతో రూపొందిన కథలను పొందుపరుస్తుంటారు. అలా, 1910వ సంవత్సరం నుంచి ఇప్పటివరకు 11,000 పై చిలుకు స్క్రీప్ప్లేలకు ఈ లైబ్రరీలో స్థానం లభించింది. ఇప్పుడీ జాబితాలో ‘హ్యాపీ న్యూ ఇయర్’ చేరింది. ఈ విషయాన్ని ‘అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సెన్సైస్’ ప్రతినిధులు ఓ ప్రకటనలో తెలియజేశారు. షారుక్ ఖాన్, అభిషేక్ బచ్చన్, దీపికా పదుకొనె తదితరుల కలయికలో ఫరా ఖాన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. షారుక్ సతీమణి గౌరీఖాన్ నిర్మించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 350 కోట్లు వసూళ్లు సాధించింది.