ఆస్కార్ లైబ్రరీలో...
ఆస్కార్‌గా ప్రపంచ ప్రసిద్ధమైన అవార్డులను అందించే ‘అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సెన్సైస్’ లైబ్రరీలో హిందీ చిత్రం ‘హ్యాపీ న్యూ ఇయర్’కు అరుదైన గౌరవం దక్కింది. సినీ దర్శక, నిర్మాతలకు, నటీనటులకు, రచయితలకు.. ఇంకా సినిమా రంగానికి చెందిన ఇతర శాఖలవారికీ, విద్యార్థులకు పరిశోధన నిమిత్తం ఈ లైబ్రరీలో ఉత్తమ స్క్రీన్‌ప్లేతో రూపొందిన కథలను పొందుపరుస్తుంటారు. అలా, 1910వ సంవత్సరం నుంచి ఇప్పటివరకు 11,000 పై చిలుకు స్క్రీప్‌ప్లేలకు ఈ లైబ్రరీలో స్థానం లభించింది. ఇప్పుడీ జాబితాలో ‘హ్యాపీ న్యూ ఇయర్’ చేరింది. ఈ విషయాన్ని ‘అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సెన్సైస్’ ప్రతినిధులు ఓ ప్రకటనలో తెలియజేశారు. షారుక్ ఖాన్, అభిషేక్ బచ్చన్, దీపికా పదుకొనె తదితరుల కలయికలో ఫరా ఖాన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. షారుక్ సతీమణి గౌరీఖాన్ నిర్మించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 350 కోట్లు వసూళ్లు సాధించింది.