‘జోరమ్’లో మనోజ్ బాజ్‌పాయ్
హిందీ చిత్రం ‘జోరమ్’ చరిత్ర సృష్టించింది. ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ లైబ్రరీలో ఈ సినిమాకు చోటు దక్కింది. దేవాశిష్ మఖిజా దర్శకత్వంలో మనోజ్ బాజ్‌పాయ్, మొహమ్మద్ జీషన్ అయ్యూబ్, తన్నిష్ఠ ఛటర్జీ ప్రధాన పాత్రధారులుగా ఈ సినిమా రూపొందింది. జీ స్టూడియోస్, మఖిజా ఫిలింస్ ఈ సినిమాను నిర్మించాయి. గత ఏడాది ఫిబ్రవరిలో జరిగిన రోటర్‌డామ్ ఇంటర్‌నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, జూన్‌లో సిడ్నీ ఫిల్మ్ ఫెస్టివల్, జూలైలో డర్బన్ ఫిల్మ్ ఫెస్టివల్, అక్టోబరులో 28వ బూసాన్ ఇంటర్‌నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, 59వ చికాగో ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ సినిమా ప్రదర్శితమైంది.
థియేటర్స్‌లో గత ఏడాది డిసెంబరు 8న విడుదలైంది. ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు దక్కినప్పటికీ బాక్సాఫీస్ వద్ద మాత్రం మెరుగైన ఫలితం దక్కలేదు. అయితే తాజాగా ఈ సినిమా వందేళ్ల చరిత్ర ఉన్న ఆస్కార్ లైబ్రరీలో చోటు దక్కించుకుంది. ఈ విషయాన్ని ‘ఎక్స్’లో షేర్ చేశారు మనోజ్ బాజ్‌పాయ్. ‘‘నా చిత్రానికి ఇలాంటి గౌరవం దక్కడం సంతోషంగా ఉంది.
ఇది యూనిట్ సమష్టి విజయం. మనం ఎంత చేయగలమో మనకే తెలుసు’’ అని పేర్కొన్నారు మనోజ్. ఇక ఈ చిత్రకథ విషయానికి వస్తే.. తన కుమార్తె ప్రాణాలను కాపాడటం కోసం ఓ తండ్రి చేసే పోరాటం నేపథ్యంలో సాగే సర్వైవల్ డ్రామాగా ‘జోరమ్’ తెరకెక్కింది. 2016లో ‘తాండవ్’ షార్ట్ ఫిల్మ్, 2020 జూన్‌లో ‘భోంస్లే’ (ఇండియా రిలీజ్) చిత్రాల తర్వాత హీరో మనోజ్ బాజ్‌పాయ్, దర్శకుడు దేవాశిష్ మఖిజా కాంబినేషన్‌లో రూపొందిన మూడో చిత్రం ‘జోరమ్’.
Comments
Please login to add a commentAdd a comment