Oscar winner
-
రచ్చకెక్కిన మరక్కుమా..నెంజం!
సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహ్మాన్ బృందం నిర్వహించిన ‘మరక్కుమా..నెంజం’ సంగీత వేడుక రచ్చకెక్కింది. 20 వేల సీట్లు ఉన్న చోట 40 వేలకు పైగా టికెట్లను నిర్వాహకులు విక్రయించడం తీవ్ర వివాదానికి దారి తీసింది. తమ అభిమాన సంగీత దర్శకుడు, గాయకుడి స్వరాన్ని ప్రత్యక్షంగా వినేందుకు వచ్చిన అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నిర్వాహకులు సరైన ఏర్పాట్లు చేయక పోవడంతో ఆ మార్గంలో సీఎం స్టాలిన్ కాన్వాయ్ సైతం ట్రాఫిక్‌లో చిక్కుకుపోయింది. ఈ ఘటనపై విచారణకు డీజీపీ శంకర్ జివ్వాల్ ఆదేశాలు జారీ చేశారు. తాంబరం కమిషనర్ అమల్ రాజ్ నేతృత్వంలోని బృందం విచారణ చేపట్టింది. సాక్షి, చైన్నె: సంగీత మాంత్రికుడు, ఆస్కార్ విజేత ఏఆర్ రెహ్మాన్ సంగీతం అంటే పడిచచ్చి పోయే అభిమానులు దేశ విదేశాల్లో భారీ సంఖ్యలో ఉన్నారు. ఆయన నేతృత్వంలో మ్యూజికల్ నైట్స్, సంగీత వేడుక ఎక్కడైనా జరుగుతుందంటే చాలు జిల్లాలు, రాష్ట్రాలు దాటి వచ్చి మరీ వీక్షించే అభిమానులు ఉన్నారు. ఆ దిశగా గత నెల ఓ ప్రైవేటు సంస్థ నేతృత్వంలో చైన్నె శివార్లలోని పనయూరులో ఏర్పాట్లు చేశారు. చివరి క్షణంలో వర్షం పడడంతో మరో తేదీకి వేడుకను మార్చారు. ఆ మేరకు సంగీతోత్సవం ఆదివారం అర్ధరాత్రి వరకు సాగింది. టికెట్ల రూపంలో రచ్చ.. 20 వేల మంది కూర్చుని చూసేందుకు పనయూరులో ఏర్పాట్లు ఉన్నాయి. అయితే నిర్వాహకులు మాత్రం 40 వేలకు పైగా టికెట్లను విక్రయించారు. వివిధ కేటగిరీలలో ఒక్కో టికెట్టు ధర రూ. 10 వేలు, రూ. 25 వేలకు పైగా పలికాయి. సరైన సలహాలు ఇచ్చే వారు లేక పోవడంతో అభిమానులకు కష్టాలు తప్పలేదు. అలాగే పార్కింగ్ ఏర్పాట్లు సరిగ్గా లేక పోవడంతో వచ్చిన అభిమానులు రోడ్డు పక్కగా వాహనాలను ఆపేశారు. సంగీతోత్సవ వేదిక నిండి పోవడంతో లోనికి వేలాది మంది వెళ్ల లేకపోయారు. తమ వద్ద టికెట్లు ఉన్నా, అనుమతించక పోవడంతో అభిమానులు ఆందోళనకు దిగారు. నిర్వహకుల నుంచి సరైన సమాధానం రాక పోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ వద్ద ఉన్న టికెట్లును చించి పడేసి ఏఆర్ రెహ్మాన్ స్పందించాలంటూ నినాదాలు చేశారు. ట్రాఫిక్‌లో సీఎం కాన్వాయ్.. సీఎం స్టాలిన్ కాన్వాయ్ పనయూరు మార్గంలో ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కింది. మామండూరులో జరిగిన ఓ వివాహ వేడుకకు హాజరై రాత్రి తిరుగు పయనంలో సీఎం స్టాలిన్ కాన్వాయ్ ట్రాఫిక్‌లో ఇరుక్కుంది. ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు అధికారులు ఉరుకులు పరుగులు తీశారు. చివరికి అర్ధరాత్రి వేళ పోలీసు బాసులు పరుగులు తీయాల్సి వచ్చింది. ట్రాఫిక్ కష్టాలతో పాటు సంగీతోత్సవంలో అభిమానులకు ఎదురైన అనుభవనాలు, అధిక టికెట్ల విక్రయాల వ్యవహారం చివరకు సోమవరం ఉదయం పోలీసుల దృష్టికి చేరింది. అలాగే, సామాజిక మాధ్యమాల్లో నిర్వాహకులు, ఏఆర్‌కు వ్యతిరేకంగా విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో డీజీపీ శంకర్ జివ్వాల్ విచారణకు ఆదేశించారు. ఈ మేరకు తాంబరం పోలీసు కమిషనర్ అమల్‌రాజ్ నేతృత్వంలోని బృందాన్ని రంగంలోకి దించారు. ఈ బృందంలోని సభ్యులు నిర్వహకులను వివిధ అంశాలపై ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో అభిమానులకు నిర్వాహకులు క్షమాపణ చెప్పారు. ఇక, సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహ్మాన్ స్పందిస్తూ, టికెట్లు ఉన్నా, తన కార్యక్రమాన్ని వీక్షించ లేక పోయిన అభిమానులు, ఆ ఫొటోలను తన మెయిల్‌కు పంపించాలని, తన బృందంలోని వారు అభిమానులను సంప్రదిస్తారని పేర్కొంటూ ఓ ప్రకటన విడుదల చేశారు. అలాగే తాను ఎవరో చేసే తప్పులకు తాను బలిపశువు అవుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ఆవేదన వ్యక్తం చేశారు. -
ధోనీని కలిసిన ఎలిఫెంట్ విస్పర్స్ చిత్రబృందం
-
ఆస్కార్ విన్నర్.. 'ది ఎలిఫెంట్ విష్పరర్స్' ప్రెస్ మీట్ ఫోటోలు
-
ప్రపంచ వేదికపై ఓరుగల్లు
హన్మకొండ కల్చరల్/సాక్షి నెట్వర్క్: కళలు, కళాకారులు, కవులు, రచయితలకు పుట్టినిల్లు ఓరుగల్లు. అలాంటి నేపథ్యమున్న ప్రాంతంనుంచి విశ్వవేదిక వరకు ఎదిగిన చంద్రబోస్ ఉమ్మడి జిల్లా కలికితురాయిగా నిలిచారు. ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు పాటకు ఉత్తమ ఒరిజినల్ పాటల విభాగంలో పాట రచయిత, ఉమ్మడి జిల్లాకు చెందిన చంద్రబోస్ ఆస్కార్ అవార్డు గెలుచుకోవడంపై పలువురు కవులు, కళాకారులు, రచయితలు, సినీగేయ రచయితలు హర్షం వ్యక్తం చేశారు. వారు కవిత ద్వారా, గీతికల ద్వారా చంద్రబోస్‌ను అభినందించారు. శారద నాట్యమండలి సభ్యులు జేఎన్ శర్మ, జూలూరు నాగరాజు, జేబీ కల్చరల్ సొసైటీ నిర్వాహకులు జడల శివ తదితరులు చంద్రబోస్‌కు అభినందనలు తెలిపారు. ఉమ్మడి జిల్లా కవులు, కళాకారులు, సినీ దర్శకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. బంగారు గురిగిని తీసుకొచ్చే స్థాయికి.. తెలుగు పాటకు ఆస్కార్ రావడం మన జాతికి లభించిన గౌరవం. చంద్రబోస్ అన్నను స్ఫూర్తిగా తీసుకొని సినిమా రంగంలోకి వచ్చా. తెలుగు వర్ణమాల ఈనాడు మీ మెడలో విజయ వర్ణమాలగా మారింది. చల్లగరిగ నుంచి బంగారు గురిగిని(భారతదేశానికి మొదటిసారిగా గోల్డెన్ గ్లోబ్ అవార్డు లభించడం), ఇప్పుడు ఆస్కార్ అవార్డు తీసుకొచ్చే స్థాయికి ఎదిగిన చంద్రబోస్‌కు అభినందనలు. – కాసర్ల శ్యామ్, ప్రముఖ జానపద, సినీ గేయ రచయిత తెలంగాణ తల్లికి వజ్రకిరీటం చంద్రబోస్‌కు ఆస్కార్ అవార్డు రావడం తెలుగు జాతికి వచ్చినంత గర్వకారణం. తెలంగాణ తల్లికి వజ్రకిరీటం.. పల్లె పల్లె పచ్చికలో పూలు పూసిన సంతోషం.. తెలంగాణ పల్లెలోని పచ్చిక పూల తీవాచీ పరుస్తుంది.. పుట్ల కొద్దీ వృక్షజాతి నవధాన్యాల సిరిసంపదలు .. ఇవన్నీ విరివిగా పండి పల్లె ఆసాముల ఇండ్లలో రాశులుగా పోసిన సంతోషం. జాతి గర్వపడే విషయం. తేట జలపాతపు ఊటలు వెనుకటి లాగా ఉప్పొంగి అలుగులు వారిన సంతోషం. జానపద కళలన్నీ కూడా ఈ సందర్భంగా ఆయనకు స్వాగత విజయభేరి మోగిస్తున్నాయి. – వరంగల్ శ్రీనివాస్, సినీ సంగీత దర్శకుడు తెలుగు వారంతా గర్వపడే విషయం భారతదేశ చరిత్రలో నాకు తెలిసి గేయ రచయితకు ఆస్కార్ రావడం ఇదే ప్రథమం. అప్పట్లో ‘రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే’ పాటకు జాతీయ పురస్కారాన్ని అందించేందుకు భారత ప్రభుత్వం వేటూరి సుందరరామమూర్తిని ఆహ్వానించింది. ‘నా తెలుగు భాషను ప్రాచీన భాషగా గుర్తిస్తేనే ఈ అవార్డు తీసుకుంటా’ అని ఆయన పురస్కారాన్ని తిరస్కరించారు. అలాంటిది ఈ దేశం గుర్తించని భాషలో(తెలంగాణ మాండలికంలో) పాట రాసిన చంద్రబోస్ ఇప్పుడు ప్రపంచం నోట తెలుగు పాటను పాడిస్తున్నారు. ఈ అవార్డు రావడం తెలుగు వారంతా గర్వించదగ్గ విషయం. – మిట్టపల్లి సురేందర్, సినీ గేయ రచయిత సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు... సినీ కళా సామ్రాజ్యంలో చిరకాల కలగా మిగిలిపోయిన ఆస్కార్ సాకారమైన ఆ సమయం. భారతీయ చలనచిత్ర చరిత్రలో సువర్ణాక్ష రాలతో లిఖించదగింది. తెలంగాణ తెలుగు పాటల రచయిత చంద్రబోస్ కలం నుంచి జాలువారిన ఆణిముత్యం నాటు నాటు పాట. తెలంగాణ భాష, యాసకు విశ్వవేదికపై స్థానం కల్పించి విజయజెండా ఎగరేసి వీనుల విందుగా విహరింపజేసిన చంద్రబోస్ ఎందరికో ఆదర్శప్రాయుడు. గొట్టె రమేశ్ , పాటల రచయిత చంద్రబోస్‌తో రెండు పాటలు రాశా.. తెలుగు సినిమాని ఖండాంతరాలు దాటించి ఒక తెలుగువాడి సత్తా చాటి భారతదేశ గొప్పదనాన్ని, తెలుగు అనే భాష తెలియని ఇతర దేశాలకు తెలుగు వెలుగులు నింపిన గీత రచయిత చంద్రబోస్ నా ప్రాంతంవాడని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది. చంద్రబోస్‌తో కలిసి అనువంశికత సినిమాలో రెండు పాటలు రాశాను. చాలా ఆనందంగా ఉంది. – రామకృష్ణ కందకట్ల, గీత రచయిత, సంగీత దర్శకులు (వరంగల్) మా ప్రాంతవాసి కావడం సంతోషకరం ఆర్ఆర్ఆర్ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు రావడం హర్షణీయం. పాటను రాసిన ప్రముఖ సినీ గేయ రచయిత చంద్రబోస్ మా ప్రాంతవాసి కావడం సంతోషంగా ఉంది. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకొచి్చన చంద్రబోస్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు. – గండ్ర వెంకటరమణారెడ్డి,భూపాలపల్లి ఎమ్మెల్యే చల్లగరిగలో సంబురాలు చిట్యాల: చంద్రబోస్ రచించిన ట్రిపుల్ ఆర్ సినిమాలోని ‘నాటు..నాటు’ పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ అవార్డు దక్కించుకున్న సందర్భంగా చిట్యాల మండల కేంద్రంలో గ్రామీణ కళాకారుల సంఘం ఆధ్వర్యంలో కేక్‌కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు. ఆయన స్వగ్రామం చల్లగరిగలో బాణసంచా కాల్చి స్వీట్లు పంచిపెట్టారు. ఆయా కార్యక్రమాల్లో దావు వీరారెడ్డి, అప్పాల వెంకటరమణ, మేరుగు సమ్మయ్య, జాలీగపు రవీందర్, బండి సత్యం, కళాకారులు చింతల రమేశ్, దాసారపు నరేశ్, మ్యాదరి సునీల్, రాజు నాయక్, జన్నే యుగేందర్, రజినీకాంత్, పుల్ల ప్రతాప్, రత్నాకర్ పాల్గొన్నారు. గర్వంగా ఉంది.. ప్రాంతీయ సినిమా విశ్వ వేదికపై నిలబడడం చాలా గొప్ప విషయం. పల్లె పలుకులతో ప్రాణం పోసుకున్న పాట ప్రపంచాన్ని మెప్పించింది. ఇప్పుడు ఏ నోట చూసినా నాటు నాటు పాటే. తెలుగు సినిమా ఎందులోనూ తీసిపోదు అని మరోసారి నిరూపితమైంది. చంద్రబోస్, కీరవాణి, ఇతర టీమ్‌కు అభినందనలు. – ఉదయ్ గుర్రాల, సినీ డైరెక్టర్ హాలీవుడ్‌కు పునాది ‘నాటు నాటు’ పాటలో మట్టివాసన ఉంది. పల్లె ప్రతీకలతో సాహిత్యాన్ని చంద్రబోస్ గొప్పగా రాశారు. చంద్రబోస్ వరంగల్ వాసి కావడం మనందరికీ గర్వకారణం. ఆస్కార్ అవార్డు రావడంతో హాలీవుడ్‌కు పునాది వేసినట్లయ్యింది. ఇకపై ప్రపంచమంతా మన సినిమాలు చూడనుంది. ఆస్కార్ అవార్డు రావడం ఎంతో సంతోషకరమైన విషయం. – డాక్టర్ ప్రభాకర్ జైనీ, సినీ దర్శకుడు -
బిజినెస్‌మెన్‌తో ప్రముఖ నిర్మాత నిశ్చితార్థం.. ఫొటోలు వైరల్
Producer Guneet Monga Gets Engaged With Sunny Kapoor: ప్రస్తుతం బాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది రణ్‌బీర్ కపూర్-అలియా భట్ల వివాహం. ఈ నెల 14న వీరు వివాహబంధంతో ఒక్కటి కానున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది. ఇదిలా ఉంటే బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ లేడీ ప్రొడ్యూసర్ గునీత్ మోంగా త్వరలో పెళ్లి పీటలు ఎక్కనుంది. తాజాగా ఆమె ఫ్యాషన్ వ్యాపారవేత్త సన్నీ కపూర్‌తో నిశ్చితార్థం చేసుకుంది. ఈ విషయాన్ని గునీత్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఢిల్లీలోని ఓ హెరిటేజ్ హోటల్లో జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను తన ఇన్‌స్టా గ్రామ్ హ్యాండిల్లో షేర్ చేసింది. చదవండి: వెబ్ సిరీస్‌లతో ఆకట్టుకున్న స్టార్ హీరోలు వీరే.. ఈ పోస్ట్‌కు 'కొన్నిసార్లు తప్పుడు రైలు కూడా మిమ్మల్ని సరైన స్టేషన్‌కు తీసుకువెళ్తుంది. ఆ విధంగానే నా జీవిత ప్రయాణంలో నా సహచరుడు సన్నీ నాకు దొరికాడు. తన నిశ్చితార్థం రోజున అమ్మ కట్టుకున్న చీరను నేను ధరించడంతో అమ్మనాన్నల ఆశీర్వాదం పొందినట్లుగా అనిపిస్తుంది.' అని ఎమోషనల్‌గా రాసుకొచ్చింది 38 ఏళ్ల మహిళా నిర్మాత గునీత్ మోంగా. కాగా సిఖ్యా ఎంటర్టైన్మెంట్ ద్వారా గునీత్.. 'గ్యాంగ్స్ ఆఫ్ వాసీపూర్' సిరీస్, 'షాహిద్', 'మసాన్', 'ది లంచ్ బాక్స్' సినిమాలకు ప్రొడ్యూసర్‌గా వ్యహరించింది. అలాగే గతేడాది నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చి విమర్శకు ప్రశంసలు పొందిన 'పాగ్లైట్'కు నిర్మాణంలో భాగం పంచుకుంది. 'పీరియడ్: ఎండ్ ఆఫ్ సెంటెన్స్' అనే డాక్యుమెంటరీకి ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్‌గా పనిచేసింది గునీత్. దీనికి 2019లో ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్‌గా అకాడమీ అవార్డును (ఆస్కార్) గెలుచుకుంది. View this post on Instagram A post shared by Guneet Monga (@guneetmonga) -
ప్రముఖ నటుడు కన్నుమూత.. క్యాన్సర్ కారణమా?
Oscar Winning Actor William Hurt Dies At 71: ప్రముఖ హాలీవుడ్ నటుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత విలియమ్ హర్ట్ కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కొడుకు ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు. మా నాన్న72వ పుట్టినరోజుకు వారం రోజుల ముందు మార్చి13న మరణించారు. ఆయన మృతి పట్ల మా కుటుంబం ఎంతో విచారంగా ఉంది. సహజ కారణాలతో ఆయన చనిపోయారు అని వివరించాడు. కాగా ది బిగ్ చిల్, ఎ హిస్టరీ ఆఫ్ వైలెన్స్ వంటి సినిమాల్లో నటించి పాపులర్ అయిన విలియమ్ హర్ట్‌కు 2018లో ప్రొస్టేట్ కేన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. అయితే ఆయన క్యాన్సర్ కారణంగానే చనిపోయారా లేక వృద్దాప్యపు సమస్యలతో మరణించారా అన్నదానిపై కుటుంబ సభ్యులు క్లారిటీ ఇవ్వలేదు. 1991లో‘అంటిల్ ది ఎండ్ ఆఫ్ ద వరల్డ్’ సినిమాలో ఆయన నటనకు గాను విమర్శకుల ప్రశంసలు పొందారు. 1985లో వచ్చిన ‘కిస్ ఆఫ్ ద స్పైడర్ వుమెన్’ సినిమాలో స్వలింగ సంపర్క ఖైదీ పాత్రకు గాను ఉత్తమ నటుడిగా ఆస్కార్ అవార్డును గెలుచుకున్నారు. -
తొలి భారతీయ ఆస్కార్ విజేత కన్నుమూత
సాక్షి,ముంబై: భారతదేశానికి తొలి ఆస్కార్ అవార్డును అందించిన ప్రఖ్యాత కాస్ట్యూమ్ డిజైనర్ భాను అథియా (91) ఇక లేరు. దీర్ఘకాల అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె గురువారం తుదిశ్వాస తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆమె కుమార్తె రాధిక గుప్తా ధృవీకరించారు. ఎనిమిది సంవత్సరాల క్రితం, మెదడులో కణితి కారణంగా గత మూడేళ్లుగా, ఆమె మంచానికే పరిమితయ్యారని తెలిపారు. చివరకు గురువారం తెల్లవారు ఝామున నిద్రలోనే కన్నుమూసినట్టు ఆమె చెప్పారు. దక్షిణ ముంబైలోని చందన్వాడి శ్మశానవాటికలో తమ తల్లి అంత్యక్రియలను పూర్తి చేసినట్టు రాధిక ప్రకటించారు. 1982లో గాంధీ చిత్రానికి దుస్తుల రూపకల్పనలో ఆమె కృషికి గాను కాస్ట్యూమ్ డిజైనర్‌గా ఆస్కార్ అవార్డు అందుకున్నారు. తద్వారా ఆస్కార్ అకాడమీ అవార్డు గెలుచుకున్న తొలి భారతీయురాలిగా అథియా ఘనత దక్కించుకున్నారు. కొల్లాపూర్‌లో జన్మించిన అథియా ఈవ్స్ వీక్లీ సహా బొంబాయిలోని వివిధ మహిళా పత్రికలకు ఫ్రీలాన్స్ రచయితగావృత్తిని ప్రారంభించారు. పత్రిక ఎడిటర్ కోరిక మేరకు దుస్తులను డిజైన్ చేసిన భాను క్రమంగా తనలోని నైపుణ్యానికి పదును పెట్టి డిజైనర్‌గా రాణించారు. అలా ఆమె కెరీర్ గురుదత్ సూపర్ హిట్ మూవీ సీఐడీ (1956)లో ద్వారా కాస్ట్యూమ్ డిజైనర్‌గా కరియర్ ప్రారంభించారు. పాయసా (1957), చౌద్విన్ కా చాంద్ (1960) సాహిబ్ బీబీ ఔర్ గులాం (1962) తదితర గురుదత్ చిత్రాలకు పనిచేసి ఖ్యాతి గడించారు. ఆ తరువాత 1991లో, లగాన్ (2002) చిత్రానికి రెండు జాతీయ అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు. 50 సంవత్సరాల కెరీర్లో 100 చిత్రాలు, అనేక అవార్డులను అథియా అందుకున్నారు. తన మరణం తరువాత తన కుటుంబం ట్రోఫీని జాగ్రత్తగా చూసుకోలేదని భావించి తన అకాడమీ అవార్డును ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్‌కు తిరిగి ఇవ్వాలని నిర్ణయించారు.15 డిసెంబర్ 2012 న, ట్రోఫీని అకాడమీకి తిరిగి ఇచ్చారు. అంతేకాదు ది ఆర్ట్ ఆఫ్ కాస్ట్యూమ్ డిజైన్ అనే పుస్తకాన్ని కూడా ఆమె రాశారు. -
ఇది ఆస్కార్ శాపం అన్నారు
‘‘ఆస్కార్ గెలిచిన తర్వాత బాలీవుడ్ నన్ను దూరం పెట్టింది. ఎవ్వరూ అవకాశాలు ఇవ్వకపోవడంతో మానసికంగా చాలా ఇబ్బంది పడ్డాను’’ అన్నారు సౌండ్ డిజైనర్ రెసూల్ పూకుట్టి. ఇటీవలే సంగీత దర్శకుడు రెహమాన్ హిందీలో తనకు సినిమాలు రానీయకుండా ఓ గ్యాంగ్ పని చేస్తోందని పేర్కొన్న సంగతి తెలిసిందే. ‘‘నాకూ ఇలాంటి పరిస్థితే ఎదురైంది’’ అని తెలిపారు రెసూల్. ఈ విషయాన్ని ట్వీటర్ లో ప్రస్తావిస్తూ – ‘‘ఆస్కార్ విజయం తర్వాత బాలీవుడ్ వారు సినిమాలు ఇవ్వకపోయినా ప్రాంతీయ సినిమా నన్ను బాగా గౌరవించింది.. హిందీలో కొన్ని నిర్మాణ సంస్థలు ‘నా ముఖం మీదే నువ్వు మాకు అవసరం లేదు’ అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు అని హాలీవుడ్ కి వెళ్లిపోయి ఉండొచ్చు. కానీ వెళ్లలేదు, వెళ్లే ఆలోచన కూడా లేదు. నాకు ఆస్కార్ తెచ్చిపెట్టింది ఇండియన్ సినిమానే. అవకాశాలు రాని విషయం గురించి ఓ సందర్భంలో ఆస్కార్ అకాడమీ వాళ్లతో మాట్లాడితే ఆస్కార్ పొందినవారికి ఎదురయ్యే సమస్య ఇదే అని, ఇది ఆస్కార్ శాపమని చెప్పారు. అయినా ఆస్కార్ గెలిచి గాల్లో తేలుతూ ఉన్నప్పుడు మనల్ని ఎవరైనా రిజెక్ట్ చేయడాన్ని మించిన రియాలిటీ చెక్ ఉంటుందా? ఏది ఏమైనా నేను పని చేసిన ఇండస్ట్రీ అంటే నాకు గౌరవం. నన్ను నమ్మేవాళ్లు, నా పనిని గౌరవించేవాళ్లు కొంతమంది ఉన్నారు. వారు నన్ను గౌరవిస్తారు.. నమ్ముతారు’’ అని పలు ట్వీట్స్ లో రాసుకొచ్చారు రెసూల్ పూకుట్టి. -
హాలీవుడ్ నటి ఒలివియా కన్నుమూత
హాలీవుడ్ సీనియర్ నటి, 1960ల సూపర్ స్టార్, రెండు సార్లు ఆస్కార్ గెలిచిన ఒలివియా కన్నుమూశారు. ఆదివారం రాత్రి నిద్రలోనే తుది శ్వాస విడిచినట్టు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ఒలివియా వయసు 104. ఐదు దశాబ్దాల పాటు హాలీవుడ్ లో నటిగా కొనసాగారామె. సుమారు 49 సినిమాల్లో నటించారు. ‘టుఈచ్ హిజ్ ఓన్’ (1947), ‘ది హెయిరెస్’ (1950) సినిమాలకు ఆస్కార్ అవార్డు గెలుచుకున్నారామె. ‘కెప్టెన్ బ్లడ్, ది అడ్వెంచర్స్ ఆఫ్ రాబిన్ హుడ్, స్నేక్ పిట్’ వంటి పాపులర్ సినిమాల్లో కనిపించారు ఒలీవియా. హాలీవుడ్ గోల్డెన్ పీరియడ్ లో ఒలివియా తిరుగులేని సూపర్ స్టార్ అనిపించుకున్నారు. ఒలివియా మృతి పట్ల పలువురు హాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. -
‘టామ్ అండ్ జెర్రీ’ దర్శకుడి కన్నుమూత
ప్రేగ్: చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా అందరినీ దశాబ్దాలుగా అలరిస్తున్న కార్టూన్ సీరియల్ టామ్ అండ్ జెర్రీ దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత జీన్ డీచ్ మరణించారు. 95 ఏళ్ల వయసున్న ఆయన చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రేగ్ నగరంలోని తన అపార్టుమెంట్లో గురువారం రాత్రి హఠాత్తుగా కన్నుమూశారు. ఆయన పూర్తిపేరు యూజీన్ మెరిల్ డీచ్. టామ్ అండ్ జెర్రీ 13 ఎపిసోడ్లకు ఆయన దర్శకత్వం వహించారు. పొపెయి అనే సీరయల్ సైతం రూపొందించారు. జీన్ డీజ్ మొదట ఉత్తర అమెరికా వైమానిక దశంలో పనిచేశారు. అనంతరం పైలెట్ ట్రైనింగ్ పూర్తిచేశారు. తర్వాత ఆరోగ్యపరమైన సమస్యలతో సైన్యం నుంచి బయటకు వచ్చారు. 1959లో ప్రేగ్‌కు చేరుకున్నారు. చిత్రకళలో గట్టి పట్టున్న ఆయన కార్టూన్లు గీయడంపై దృష్టి పెట్టారు. డీచ్ దర్శకత్వం వహించిన మన్రో అనే చిత్రం 1960లో బెస్టు యానిమేటెడ్ షార్టుఫిలింగా ఆస్కార్ అవార్డు గెలుచుకుంది. జీన్ డీచ్‌కు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. వారంతా కార్టూనిస్టులే. -
కరీనా సరేనా?
దాదాపు పదేళ్ల తర్వాత ఆమిర్ ఖాన్–కరీనా కపూర్ జంటగా నటించబోతున్నారా? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. ‘థగ్స్ ఆఫ్ హిందుస్తాన్’తో ప్రేక్షకులను నిరాశపరిచిన ఆమిర్ ఖాన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘లాల్‌సింగ్ చద్దా’. ఆస్కార్ విన్నింగ్ ఫిల్మ్ ‘ఫారెస్ట్ గంప్’కి ఇది హిందీ రీమేక్. ఈ సినిమాలో కథానాయికగా కరీనాను సంప్రదించారట. కరీనా ఓకే చెబితే దాదాపు పదేళ్ల తర్వాత ఆమిర్–కరీనా జోడీ కట్టినట్లే. 2009లో వచ్చిన హిట్ మూవీ ‘త్రీ ఇడియట్స్’ తర్వాత ఈ ఇద్దరూ జంటగా నటించలేదు. మరోవైపు ‘గుడ్‌న్యూస్’ సినిమా షూటింగ్‌ను కంప్లీట్ చేసిన కరీనా ప్రస్తుతం ఇర్ఫాన్ ఖాన్ ‘అంగ్రేజీ మీడియం’ (హిందీ మీడియం సీక్వెల్) సినిమాతో బిజీగా ఉన్నారు. అలాగే కరీనా ఓ టెలివిజన్ షోకు కమిటైన సంగతి తెలిసిందే. -
'ఆ హీరోని ఒప్పించడం అంత తేలిక కాదు'
లాస్ ఎంజెల్స్: ఆస్కార్ అవార్డు విజేత, ప్రముఖ హాలీవుడ్ నటుడు లియోనార్డో డికాప్రియోను ఒక చిత్రానికి ఒప్పించడం అంత తేలికైన పనికాదని ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు బజ్ లార్మన్ చెప్పారు. డికాప్రియాతో 1996లో రోమియో జూలియట్, 2013 ది గ్రేట్ గ్యాట్స్బై అనే రెండు చిత్రాలకు లార్మన్ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా సినిమాలు ఎంపిక చేసుకునే విషయంలో డికాప్రియో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తాడని అన్నారు. ఆయన ముఖ్యంగా ప్రకృతి ప్రేమికుడని, పర్యావరణానికి ఇబ్బంది కలిగించే అంశాలున్న కథలకు ఆయన ససేమిరా ఒప్పుకోడని, అది ఆయనకు మాత్రమే ఉన్న గొప్ప ఆలోచన అని కొనియాడారు. నిర్ణయాలను అంత తేలికగా తీసుకోడని ఆచితూచి అందరికీ మంచి జరుగుతుంది అనుకుంటేనే ఆ సినిమాకు ఒప్పుకుంటాడని, తన చిత్రం ద్వారా పర్యవరణానికి ఎలాంటి హానీ జరగదని భావిస్తేనే అంగీకరిస్తాడని తెలిపారు. అందుకే తనకు ఎన్నిసార్లయినా సినిమా తీసేందుకు సిద్ధంగా ఉంటానని, మా ఇద్దరి ఆలోచనలు కూడా దాదాపు సమీపంగానే ఉంటాయన్నారు. -
ఒక్క నిమిషంలో 4 లక్షల ట్వీట్లు
23 ఏళ్ల నిరీక్షణ తరువాత కల నిజం చేసుకున్న హాలీవుడ్ నటుడు లియోనార్డో డికాప్రియో, అదే రోజు మరో అరుదైన రికార్డ్ సృష్టించాడు. 'ద రివెనెంట్' చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా ఆస్కార్ అందుకున్న డికాప్రియోకి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. 88వ అకాడమీ అవార్డ్స్ ఫంక్షన్లో ఉత్తమ నటుడిగా డికాప్రియో అవార్డ్ అందుకున్న మరుక్షణం ఆయన ట్విట్టర్ పేజ్‌పై భారీ సంఖ్యలో విషెస్ పోస్ట్ అయ్యాయి. ఆదివారం రాత్రి (భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం)జరిగిన అవార్డ్ వేడుకల్లో ఉత్తమ నటుడిగా ఆస్కార్ అవార్డ్‌ను అందుకున్నాడు డికాప్రియో. అవార్డ్ ప్రదానం అయిన తొలి నిమిషంలోనే ఏకంగా 4 లక్షల 40 వేల శుభాకాంక్షల పోస్ట్‌లు వచ్చాయి. ఆ తరువాత ఉత్తమ చిత్రాన్ని ప్రకటించిన తరువాత కూడా ఇదే స్థాయిలో శుభాకాంక్షల ట్వీట్లు వచ్చాయి. -
హాకింగ్ సీరియల్!
హాలీవుడ్ సెలబ్రిటీల ప్రైవేట్ ఫొటో హాకింగ్ ‘సీరియల్’ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆస్కార్ విన్నర్ జెనిఫర్ లారెన్స్, వెనిసా హడ్జన్స్, అప్టన్ తదితరుల నగ్న ఫొటోల అప్లోడ్ ఉదంతం మరువక ముందే మరో సంచలనం రేగింది. సూపర్ స్టార్ జానీ డెప్ ఫియాన్సీ, అందాల తార అంబర్ హియర్డ్ పర్సనల్ ఫొటోలు, వీడియోలు యాభైకి పైగా హాకింగ్‌కు గురయ్యాయి. వీటిల్లో ఒకటి టాప్‌లెస్, మరికొన్ని డెప్తో సాన్నిహిత్యంగా ఉన్న ఫొటోలు ఉన్నట్టు ‘న్యూయార్క్ న్యూస్ డైలీ’ పేర్కొంది. -
చెన్నైలో ఎఆర్ రెహ్మాన్ సంగీత కళాశాల ప్రారంభం
చెన్నై: మ్యూజిక్ మాంత్రికుడు, ఆస్కార్ విజేత ఎ ఆర్ రెహ్మాన్ స్థాపించిన ‘‘కెఎమ్ మ్యూజిక్ కాలేజ్ అండ్ టెక్నాలజీ’’ ని ప్రముఖ పారిశ్రామికవేత్త రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ శుక్రవారం చెన్నైలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సంగీత కళాశాల ప్రారంభోత్సవానికి అంబానీతోపాటు ఆయన సతీమణి నీతూ అంబానీ కూడా పాల్గొన్నారు. రెహామాన్ స్థాపించిన ఈ మ్యూజిక్ కాలేజ్ క్యాంపస్ వైశాల్యం దాదాపు 27వేల సెక్టార్లు ఉంటుంది. ఈ క్యాంపస్‌లో వాద్యబృంద సంగీత కళాశాలను పేదపిల్లల కోసం సంగీతంలో శిక్షణ ఇస్తూ వారిందరికీ వసతి కల్పించేందుకు వీలుగా ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా రెహ్మాన్ మాట్లాడుతూ సంగీత కళాశాలలో శిక్షణ పొందేందుకు వీలుగా రికార్డింగ్ స్టూడియోలను విడివిడిగా నిర్మించి వాటిలో మ్యూజిక్ డ్రమ్స్, పియానో, తీగ వాయిద్యాలు వంటి పరికరాలను ఏర్పాటుచేసినట్టు తెలిపాడు. ఈ సంస్థ ఏర్పాటు చేసి సంగీత ప్రియులకు అందుబాటులో ఉంచాలన్నదే తమ లక్ష్యమని రెహ్మాన్ చెప్పాడు. కేవలం తాము స్థాపించిన ఈ సంగీత కళాశాలను సినిమా వినోదం కోసం కాదని సంగీతం పట్ల అభిరుచిని పెంచుకునేందుకు వీలుగా ఎంతోగానూ తోడ్పతుందని రెహ్మాన్ చెప్పాడు. కెఎమ్ మ్యూజిక్ కాలేజ్ ప్రారంభోత్సవానికి ముఖేష్, నీతూ అంబానీదంపతులు విచ్చేసిన సందర్భంగా అక్కడి విద్యార్ధులు ప్రత్యేక మ్యూజిక్ ప్రదర్శనతో అంబానీ దంపతులకూ ఘన స్వాగతం పలికారు. సంగీత శిక్షణలో ఫూల్‌టైమ్, ఫార్ట్‌టైమ్ కోర్సులు చేయాలనుకునేవారికి లండన్‌లో స్థాపించిన అనుబంధ సంస్థ మిడెల్‌సెక్స్ యూనివర్సిటీలో సంగీత శిక్షణను అందిస్తున్నారు.