సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహ్మాన్ బృందం నిర్వహించిన ‘మరక్కుమా..నెంజం’ సంగీత వేడుక రచ్చకెక్కింది. 20 వేల సీట్లు ఉన్న చోట 40 వేలకు పైగా టికెట్లను నిర్వాహకులు విక్రయించడం తీవ్ర వివాదానికి దారి తీసింది. తమ అభిమాన సంగీత దర్శకుడు, గాయకుడి స్వరాన్ని ప్రత్యక్షంగా వినేందుకు వచ్చిన అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నిర్వాహకులు సరైన ఏర్పాట్లు చేయక పోవడంతో ఆ మార్గంలో సీఎం స్టాలిన్ కాన్వాయ్ సైతం ట్రాఫిక్‌లో చిక్కుకుపోయింది. ఈ ఘటనపై విచారణకు డీజీపీ శంకర్ జివ్వాల్ ఆదేశాలు జారీ చేశారు. తాంబరం కమిషనర్ అమల్ రాజ్ నేతృత్వంలోని బృందం విచారణ చేపట్టింది.
సాక్షి, చైన్నె: సంగీత మాంత్రికుడు, ఆస్కార్ విజేత ఏఆర్ రెహ్మాన్ సంగీతం అంటే పడిచచ్చి పోయే అభిమానులు దేశ విదేశాల్లో భారీ సంఖ్యలో ఉన్నారు. ఆయన నేతృత్వంలో మ్యూజికల్ నైట్స్, సంగీత వేడుక ఎక్కడైనా జరుగుతుందంటే చాలు జిల్లాలు, రాష్ట్రాలు దాటి వచ్చి మరీ వీక్షించే అభిమానులు ఉన్నారు. ఆ దిశగా గత నెల ఓ ప్రైవేటు సంస్థ నేతృత్వంలో చైన్నె శివార్లలోని పనయూరులో ఏర్పాట్లు చేశారు. చివరి క్షణంలో వర్షం పడడంతో మరో తేదీకి వేడుకను మార్చారు. ఆ మేరకు సంగీతోత్సవం ఆదివారం అర్ధరాత్రి వరకు సాగింది.
టికెట్ల రూపంలో రచ్చ..
20 వేల మంది కూర్చుని చూసేందుకు పనయూరులో ఏర్పాట్లు ఉన్నాయి. అయితే నిర్వాహకులు మాత్రం 40 వేలకు పైగా టికెట్లను విక్రయించారు. వివిధ కేటగిరీలలో ఒక్కో టికెట్టు ధర రూ. 10 వేలు, రూ. 25 వేలకు పైగా పలికాయి. సరైన సలహాలు ఇచ్చే వారు లేక పోవడంతో అభిమానులకు కష్టాలు తప్పలేదు. అలాగే పార్కింగ్ ఏర్పాట్లు సరిగ్గా లేక పోవడంతో వచ్చిన అభిమానులు రోడ్డు పక్కగా వాహనాలను ఆపేశారు. సంగీతోత్సవ వేదిక నిండి పోవడంతో లోనికి వేలాది మంది వెళ్ల లేకపోయారు. తమ వద్ద టికెట్లు ఉన్నా, అనుమతించక పోవడంతో అభిమానులు ఆందోళనకు దిగారు. నిర్వహకుల నుంచి సరైన సమాధానం రాక పోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ వద్ద ఉన్న టికెట్లును చించి పడేసి ఏఆర్ రెహ్మాన్ స్పందించాలంటూ నినాదాలు చేశారు.
ట్రాఫిక్‌లో సీఎం కాన్వాయ్..
సీఎం స్టాలిన్ కాన్వాయ్ పనయూరు మార్గంలో ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కింది. మామండూరులో జరిగిన ఓ వివాహ వేడుకకు హాజరై రాత్రి తిరుగు పయనంలో సీఎం స్టాలిన్ కాన్వాయ్ ట్రాఫిక్‌లో ఇరుక్కుంది. ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు అధికారులు ఉరుకులు పరుగులు తీశారు. చివరికి అర్ధరాత్రి వేళ పోలీసు బాసులు పరుగులు తీయాల్సి వచ్చింది. ట్రాఫిక్ కష్టాలతో పాటు సంగీతోత్సవంలో అభిమానులకు ఎదురైన అనుభవనాలు, అధిక టికెట్ల విక్రయాల వ్యవహారం చివరకు సోమవరం ఉదయం పోలీసుల దృష్టికి చేరింది. అలాగే, సామాజిక మాధ్యమాల్లో నిర్వాహకులు, ఏఆర్‌కు వ్యతిరేకంగా విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో డీజీపీ శంకర్ జివ్వాల్ విచారణకు ఆదేశించారు. ఈ మేరకు తాంబరం పోలీసు కమిషనర్ అమల్‌రాజ్ నేతృత్వంలోని బృందాన్ని రంగంలోకి దించారు.
ఈ బృందంలోని సభ్యులు నిర్వహకులను వివిధ అంశాలపై ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో అభిమానులకు నిర్వాహకులు క్షమాపణ చెప్పారు. ఇక, సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహ్మాన్ స్పందిస్తూ, టికెట్లు ఉన్నా, తన కార్యక్రమాన్ని వీక్షించ లేక పోయిన అభిమానులు, ఆ ఫొటోలను తన మెయిల్‌కు పంపించాలని, తన బృందంలోని వారు అభిమానులను సంప్రదిస్తారని పేర్కొంటూ ఓ ప్రకటన విడుదల చేశారు. అలాగే తాను ఎవరో చేసే తప్పులకు తాను బలిపశువు అవుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment