విద్యార్థులు ఒత్తిడి చేస్తే ఎగ్జామినర్‌ను మారుస్తారా?
ఎన్టీఆర్ వర్సిటీ వీసీ, ఓయూ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ తీరుపై హైకోర్టు విస్మయం
సాక్షి, హైదరాబాద్: కొందరు విద్యార్థుల ఒత్తిడికి లొంగి ఇంటర్నల్ ఎగ్జామినర్‌ను మార్చిన ఉస్మానియా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్, ఎన్టీఆర్ వైద్య వర్సిటీ వీసీ తీరును హైకోర్టు తప్పుబట్టింది. ఇంటర్నల్ ఎగ్జామినర్‌ను మారుస్తూ ఎన్టీఆర్ వర్సిటీ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సమర్థించింది. ఆ ఉత్తర్వుల్లో ఏ రకంగా జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. ఎన్టీఆర్ వర్సిటీ వీసీ, ఓయూ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌కు సింగిల్ జడ్జి విధించిన రూ.5 వేల చొప్పున జరిమానాను రద్దు చేస్తూ న్యాయమూర్తులు జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి, జస్టిస్ జి.శ్యాంప్రసాద్‌ల ధర్మాసనం తీర్పునిచ్చింది.
ఎంఎస్ (జనరల్ సర్జరీ) పరీక్షలకు ఇంటర్నల్ ఎగ్జామినర్‌గా మొదట దీన్‌దయాళ్ భంగ్ను నియమిస్తూ ఎన్టీఆర్ వైద్య వర్సిటీ వీసీ ఉత్తర్వులిచ్చారు. అయితే భంగ్ను మార్చాల ని కొందరు విద్యార్థులు ఒత్తిడి చేయడంతో.. ఎగ్జామినర్‌ను మార్చాలని వీసీకి ఉస్మానియా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ లేఖ రాశారు. దీంతో భంగ్ను తొలగించి మరొకరిని వీసీ నియమించారు. దీన్ని సవాలు చేస్తూ భంగ్ హైకోర్టును ఆశ్రయించగా.. విచారించిన సింగిల్ జడ్జి, వీసీ చర్యను తప్పుపట్టారు. వీసీ, ప్రిన్సిపాల్‌కు రూ.5 వేల చొప్పున జరిమానా విధిస్తూ.. పరీక్ష మళ్లీ నిర్వహించాలని ఆదేశించారు. ఈ తీర్పును సవాలు చేస్తూ వీసీ, ప్రిన్సిపాల్, కొందరు విద్యార్థులు వేర్వేరుగా అప్పీళ్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన జస్టిస్ నాగార్జునరెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం వీసీ, ప్రిన్సిపాల్ తీరును తప్పుపట్టింది. విద్యార్థుల ఒత్తిళ్లకు లొంగితే కాలేజీలు, వర్సిటీల్లో క్రమశిక్షణ ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించింది.