owls
-
అవిగో.. అరుదైన పక్షులు! నల్ల బాజా, గోధుమ రంగు గుడ్ల గూబ, ఎలుక గద్ద పక్షి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పలు అరుదైన పక్షి జాతుల్ని బర్డ్ వాచర్స్ గుర్తించారు. గోధుమ రంగు అడవి గుడ్ల గూబ(బ్రౌన్ వుడ్ ఓల్), ఎలుక గద్ద(కామన్ బజార్డ్), నల్ల బాజా(బ్లాక్ బాజా) వంటి అరుదైన పక్షులు కనిపించాయి. తిరుపతి ఐఐఎస్ఈఆర్ విద్యార్థులు సుదీర్ఘకాలం తర్వాత నల్ల బాజాను గుర్తించగా, రాజమండ్రిలో బర్డ్ వాచర్ మోహన్ శ్రీకర్ గోధుమ రంగు అడవి గుడ్ల గూబను రికార్డు చేశారు. విజయవాడలో ఎలుక గద్ద పక్షి రాష్ట్రంలో రెండోసారి రికార్డయింది. రాష్ట్ర వ్యాప్తంగా 8 రకాల గుడ్ల గూబలు రికార్డయ్యాయి. ఫిబ్రవరి 17 నుంచి 20వ తేదీ వరకు 4 రోజులపాటు ఐఐఎస్ఈఆర్ ఆధ్వర్యంలో వరుసగా నాలుగో సంవత్సరం రాష్ట్రంలో గ్రేట్ బ్యాక్ యార్డ్ బర్డ్ కౌంట్‌గా పిలిచే ప్రపంచ పక్షుల గణన నిర్వహించారు. గణనలో దేశం వ్యాప్తంగా 1,067 జాతుల పక్షులు నమోదవగా, మన రాష్ట్రం 313 జాతుల్ని నమోదు చేసి దేశంలో 12వ స్థానంలో నిలిచింది. బర్డ్ వాచర్లు పక్షులను గమనించి వాటి ఫొటోలను సిటిజన్ సైన్స్ పోర్టల్ ఈబర్డ్లో నమోదు చేశారు. గణనలో 84 మంది బర్డ్ వాచర్స్.. తిరుపతి ఐఐటీ, ఐఐఎస్ఈఆర్ తిరుపతి, తిరుపతి రీజనల్ సైన్స్ సెంటర్, ఏలూరు సీఆర్ఆర్ మహిళా కళాశాల, విశాఖపట్నం ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ సహా రాష్ట్రంలోని పలు క్యాంపస్‌లు ఈ గణనలో పాల్గొన్నాయి. 2013లో తొలిసారి రాష్ట్రంలో గ్రేట్ బ్యాక్ యార్డ్ బర్డ్ కౌంట్ జరగ్గా అప్పుడు 300కి పైగా జాతుల పక్షుల్ని నమోదు చేశారు. ఐఐఎస్ఈర్ తిరుపతి విద్యార్థులు, పరిశోధకులు ఈ గణనలో తిరుపతి పరిసరాల్లో 120 జాతుల పక్షుల్ని నమోదు చేయడం విశేషం. విజయవాడ నేచర్ క్లబ్లో ఉన్న పలువురు వైద్యులు, పారిశ్రామికవేత్తలు, విద్యార్థులు, కొందరు సిటిజన్లు ఒక గ్రూపుగా ఏర్పడి విజయవాడ పరిసరాల్లో 60 రకాల పక్షులను నమోదు చేశారు. ఒంగోలుకు చెందిన ఇద్దరు వైద్యులు ప్రకాశం జిల్లా ప్రాంతంలో 100 జాతులకు పైగా పక్షుల్ని రికార్డు చేశారు. రాజమండ్రి బర్డ్ నేచర్ ఫోటోగ్రఫీ గ్రూపు సభ్యులుగా ఉన్న డాక్టర్లు, ప్రభుత్వ ఉద్యోగులు తూర్పు గోదావరి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ జిల్లాల నుంచి 200 జాతుల పక్షులను రికార్డు చేశారు. విశాఖపట్నంలో స్థానిక ఎన్జీఓలు డబుల్య్సీటీఆర్ఈ, ఈసీసీటీలు అటవీ శాఖతో కలిసి బర్డ్ వాక్‌లు నిర్వహించి 180 జాతుల పక్షులను నమోదు చేశారు. అనంతపురంలో 160 రకాల పక్షులు, కొల్లేరు పక్షుల అభయారణ్యంలో 90 రకాల పక్షులు నమోదయ్యాయి. మొత్తం 84 మంది బర్డ్ వాచర్స్ ఈ గణనలో పాల్గొన్నారు. పక్షి శాస్త్రవేత్తలు, పరిశోధకులకంటె ఎక్కువగా సాధారణ ప్రజలు ఈ గణనలో పాల్గొనడం విశేషం. 65 శాతం పక్షులు నమోదయ్యాయి రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 490 జాతుల పక్షులు రికార్డవగా.. ఈ గణనలో వాటిలో 65 శాతం పక్షులు నమోదయ్యాయి. ఎక్కువ మందిని ప్రకృతికి అనుసంధానం చేయడం, పక్షులను చూడాలనే అభిరుచితో ఉన్న వారిని ప్రోత్సహించే లక్ష్యంతో ఈ గణన ఏటా నిర్వహిస్తున్నారు. ఈ ఫలితాలు ప్రాథమికంగా ఇచ్చినవే. కాగా, బర్డ్ కౌంట్ ఇండియా త్వరలో తుది ఫలితాలను వెల్లడిస్తుంది. – బండి రాజశేఖర్, ఐఐఎస్ఈఆర్ సిటిజన్ సైంటిస్ట్ ప్రకాశం జిల్లాలో పక్షుల సమాచారాన్ని అన్వేషిస్తున్నాం.. నా సహోద్యోగి డాక్టర్ శ్రావణ్‌కుమార్(బర్డ్ వాచర్)తో కలిసి ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాల్లో పక్షుల్ని రికార్డు చేశాను. పెళ్లూరు సమీపంలోని గడ్డి భూముల్లో కొంగలు, పెలికాన్లు, పెయింటెడ్, ఓపెన్ బిల్ స్కార్ట్లను ఎక్కువగా గమనించాము. దర్శి సమీపంలో ఈజిప్టియన్ వల్చర్, హనీ బజార్డ్, బ్లాక్ కైట్ పక్షుల్ని నమోదు చేశాం. ప్రకాశం జిల్లాలోని పక్షుల గురించి మరింత సమాచారాన్ని అన్వేషించడానికి ప్రయత్నిస్తున్నాం. – డాక్టర్ రామాంజినాయక్, బర్డ్ వాచర్, ఒంగోలు -
అపనమ్మకాలు..అపోహలతో గుడ్లగూబలు దూరం.. అసలు విషయం ఏంటంటే?
సాక్షి, అమరావతి: గుడ్లగూబలు మానవాళికి ఎంతో మేలు చేకూరుస్తున్నాయి. ఒక్క గాదె గుడ్లగూబ (బార్న్ ఔల్) తన జీవిత కాలంలో 11 వేల ఎలుకలను తింటుందని అంచనా. తద్వారా 13 టన్నుల ఆహార పంటలను కాపాడుతుందని ఒక పరిశోధనలో తేలింది. గుడ్లగూబలు ఎలుకలతోపాటు కీటకాలు, చిన్న పక్షులను వేటాడి తింటాయి. తద్వారా వాటితో మానవాళికి వ్యాధులు ప్రబలకుండా నివారిస్తాయి. ఇంత మేలు చేకూరుస్తున్న గుడ్లగూబలను అపోహలతో, అపనమ్మకాలతో మనుషులు దూరం చేసుకుంటున్నారు. అడవులు తగ్గిపోవడం, వేట వంటి కారణాలతో వీటి సంఖ్య తగ్గిపోతోందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇటీవల రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అరుదైన గుడ్లగూబలు దర్శనమిస్తున్నాయని అటవీ శాఖాధికారులు చెబుతున్నారు. అత్యంత అరుదైన చుక్కల పొట్ట గద్దాకారపు గుడ్లగూబ (స్పాట్ బెల్లీడ్ ఈగల్ ఔల్) కొద్ది రోజుల క్రితం నల్లమల అడవుల్లో కనిపించిందని అంటున్నారు. రాష్ట్రంలో ఈ జాతి గుడ్లగూబ కనిపించడం ఇదే తొలిసారి. అలాగే దట్టమైన అడవుల్లో మాత్రమే నివాసం ఏర్పరచుకునే గోధుమ రంగు అడవి గుడ్లగూబ (బ్రౌన్ వుడ్ ఔల్)లను పాపికొండలు, నల్లమల అడవుల్లో గుర్తించారు. శీతాకాలంలో రష్యా, యూరప్‌ల నుంచి మన దేశానికి వలస వచ్చే పొట్టి చెవుల గుడ్లగూబలు కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని గడ్డి మైదానాల్లో కనిపించాయి. అలాగే చిత్తూరు, వైఎస్సార్, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లోని గడ్డి మైదానాల్లో వీటి ఉనికి ఉన్నట్లు నిర్ధారించారు. రాష్ట్రంలో అత్యంత అరుదుగా కనిపించే గుడ్లగూబల జాబితాలో ఉన్న గడ్డి గుడ్లగూబ (ఈస్టర్న్ గ్రాస్ ఔల్) ఇటీవల కాలంలో ఎక్కడా కనిపించలేదు. సంరక్షణ అందరి బాధ్యత దట్టమైన అడవులు, కొండలు, గడ్డినేలలు కనుమరుగు కావడం, వేట వల్ల గుడ్లగూబలు, వాటి పరిధి నెమ్మదిగా తగ్గుతోంది. తెలుగు రాష్ట్రాల్లో గుడ్లగూబల సంరక్షణను చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు. వీటివల్ల మానవాళికి ఎంతో మేలు జరుగుతుంది. వాటిని సంరక్షించడం మనందరి బాధ్యత. – రాజశేఖర్ బండి, సిటిజన్ సైంటిస్ట్, ఐఐఎస్ఈఆర్, తిరుపతి మనదేశంలో 35 జాతులు కాగా ప్రపంచవ్యాప్తంగా 220కిపైగా, మన దేశంలో 35, మన రాష్ట్రంలో 12 రకాల గుడ్లగూబ జాతుల్ని గుర్తించారు. మనదేశంలో 16 రకాల గుడ్లగూబ జాతులను అక్రమ వ్యాపారానికి వినియోగిస్తున్నట్లు తేలింది. కొందరు చేతబడి, క్షుద్రపూజలు వంటి వాటికి వీటిని ఉపయోగిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో గుడ్లగూబలు ఎత్తయిన భవనాలు, అపార్టుమెంట్లలో గూడు కట్టుకుంటున్నాయి. వాటిని ప్రజలు అపశకునంగా భావిస్తూ గూళ్లను నాశనం చేస్తున్నారు. దీంతో గుడ్లగూబల ఉనికికి ప్రమాదం ఏర్పడింది. ఇతర పక్షులకు భిన్నంగా గుడ్లగూబలకు కళ్లు మనుషుల మాదిరిగా ముఖం ముందు ఉంటాయి. కానీ మనుషుల్లా కళ్లను కదిలించలేవు. అవి తలను 270 డిగ్రీల వరకు తిప్పి చూడగలుగుతాయి. ఈ సామర్థ్యంతోనే అవి రాత్రి వేళల్లో చురుగ్గా వేటాడతాయి. అవి మనుషుల మీద దాడిచేయవు. అపోహలు, అపనమ్మకాలు గుడ్లగూబలను మనుషుల నుంచి దూరం చేశాయి. -
రా‘బంధువులవుదాం’
సాక్షి, హైదరాబాద్: అంతరించిపోతున్న అరుదైన జాతి రాబందులను సంరక్షించేందుకు బెజ్జూరు రిజర్వ్ అటవీ ప్రాంతాన్ని వన్యప్రాణి సంరక్షణ కేంద్రంగా ప్రకటించాలని రాష్ట్ర అటవీ శాఖ ఇటీవల కేంద్ర పర్యావరణ, అటవీ శాఖకు ప్రతిపాదనలు పంపింది. జెజ్జూరుతో పాటు గూడెం, గిరెల్లి అటవీ బ్లాకులను కలిపి ‘జటాయు’ పేరుతో వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసింది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్‌నగర్ అటవీ డివిజన్ పరిధిలోని బెజ్జూరు రిజర్వ్ అటవీ ప్రాంతంలో గల పాలరాపుగుట్ట మీద రాబందుల ఉనికిని 2013లో గుర్తించారు. 200 మీటర్ల వైశాల్యంలో విస్తరించి ఉన్న పాలరాపుగుట్టపై 100 మీటర్ల ఎత్తులో రాబందులు ఆవాసం ఏర్పరచుకున్నట్లు గుర్తించారు. రాబందుల పునరుత్పత్తి, ఆవాసాలకు రక్షణ కల్పించేందుకు అదే సంవత్సరం నుంచి రాష్ట్ర అటవీ శాఖ ప్రత్యేక ప్రాజెక్టు చేపట్టింది. 2013లో 10 రాబందులు మాత్రమే ఇక్కడ ఉండగా, 2016–17 నాటికి 30కి పెరిగాయి. ఏటా సగటున 6 నుంచి 8 రాబందుల పిల్లలు పుడుతున్నాయి. వీటి పరిరక్షణకు బెజ్జూరు రిజర్వ్ అటవీ ప్రాంతం, గిరెల్లి అటవీ బ్లాకులను కలిపి 397.99 చ.కి.మీ. మేర వన్యప్రాణి సంరక్షణ కేంద్రంగా ఏర్పాటు చేయడం అవసరమని కేంద్రానికి పంపిన ప్రతిపాదనల్లో రాష్ట్ర అటవీ శాఖ నివేదించింది. పులుల రక్షణకు కూడా.. మహారాష్ట్రలోని తాడోబా, ఛత్తీస్‌గఢ్‌లోని ఇం ద్రావతి పులుల సంరక్షణ కేంద్రాల నుంచి రాష్ట్రం లోని కవ్వాల్ పులుల సంరక్షణ కేంద్రానికి పులుల రాకపోకలకు బెజ్జూరు రిజర్వు అటవీ ప్రాంతం కారిడార్‌గా ఉపయోగపడుతోంది. 2016 తర్వాత కెమె రాలకు 7 పులులు చిక్కాయి. ఈ ప్రాంతంలో చిరు తలు, ఎలుగుబంట్లు, చౌసింగా, సాంబార్, నీల్గాయ్ జింకలు, దుప్పులూ నివాసముంటున్నాయి. వాస్తవానికి 2016 డిసెంబర్లో జరిగిన రాష్ట్ర వన్య ప్రాణుల బోర్డు సమావేశంలో కాగజ్‌నగర్ డివిజన్‌ను రాబందుల సంరక్షణ కేంద్రంగా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆ తర్వాత 2017 ఫిబ్రవరిలో నిర్వహించిన తదుపరి బోర్డు సమావేశంలో బెజ్జూరును వన్యప్రాణి సంరక్షణ కేంద్రంగా ఏర్పా టుచేస్తే అంతరించిపోతున్న పులులు, రాబందులు, ఇతర వన్యప్రాణులకు రక్షణ లభిస్తుందని తీర్మానించారు. ఈ ప్రాంతాన్ని కేంద్రం వన్యప్రాణి సంరక్షణ కేంద్రంగా ప్రకటిస్తే అందులోకి వ్యక్తుల ప్రవేశంపై నిషేధం అమల్లోకి రానుంది. కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు సైతం లభించనున్నాయి. ఆహారం కోసం గడ్చిరోలికి.. రాష్ట్రంలో పాలరాపుగుట్టపైనే రాబందులున్నా యి. దక్షిణ భారత్‌లో రాబందుల అతిపెద్ద నివాస ప్రాంతం ఇదే. భారత్, పాకిస్తాన్, నేపాల్‌లో ఈ జాతి రాబందులు అరుదుగా కనిపిస్తున్నాయి. పాలరాపుగుట్టపై ఉండే రాబందులకు పశువుల కళేబరాలను ఆహారంగా వేసినా తినకుండా గడ్చిరోలికి వెళ్తున్నాయని అటవీ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. -
చూపునకు ఉండవలసిన కళ్లెం
పరిమితంగా బతకడం అంటే జీవితంలో ఎదగలేకపోవడం కాదు. ఎలా బతికితే అర్థవంతమో తెలుసుకోవడం! ‘అపాకలిప్టో’ సినిమాలో తన జాతి జనానికి ఒక కురువృద్ధుడు ఈ కథ చెబుతాడు.ఒక రోజు ఒక అడవిలో ఒక మనిషి దిగులుగా కూర్చునివున్నాడు. జంతువులన్నీ వచ్చాయి. ఏం కావాలని ఓదార్చడం మొదలుపెట్టాయి.‘నాకు మంచి కంటిచూపు కావాలి’ చెప్పాడు మనిషి.‘నాది తీసుకో’ అంది రాబందు.‘నాకు చాలా బలం కావాలి.’ ‘నా శక్తి ఇస్తాను’ చెప్పింది చిరుత.‘ఈ భూమి రహస్యాలన్నీ తెలుసుకోవాలనుంది.’‘అవన్నీ నేను చూపిస్తా’ హామీ ఇచ్చింది సర్పం.అట్లా ప్రతి జంతువూ ఏదో ఒక గుణాన్ని వరంగా ఇచ్చాక, ఆ మనిషి వెళ్లిపోయాడు.‘మనిషికి ఇప్పుడు చాలా తెలుసు. పైగా ఎన్నో పనులు చేయగలడు. కానీ ఎందుకో అతడిని తలుచుకుంటే నాకు భయంగా వుంది’ అన్నది గుడ్లగూబ. ‘అతడికి కావాల్సినవన్నీ ఉన్నాయికదా; ఇక అతడి దుఃఖం సమాప్తమవుతుంది’ బదులిచ్చింది జింక.‘కాదు’ స్థిరంగా చెప్పింది గుడ్లగూబ. ‘ఆ మనిషి ముఖానికి రెండు రంధ్రాలున్నాయి, ఎప్పటికీ తీరని ఆకలి అంత లోతుగా. అవే అతడికి ప్రతిదీ కావాలనిపిస్తాయి, అన్నింటికీ దుఃఖం కలిగిస్తాయి. అతడికి అన్నీ కావాలి, కావాలి. ఇంక నా దగ్గర ఇవ్వడానికి ఏమీ మిగలలేదని ప్రపంచం ఏదో రోజు చెప్పేదాకా!’మనిషి మితంగా బతకాల్సిన అవసరాన్నీ, ఏది కోరతగిందీ ఎంత కోరతగిందీ అని అలవర్చుకోవాల్సిన విచక్షణనూ వెల్లడించే కథ ఇది. చూపు పోయినంత మేరా మనసు పోగూడదని చెప్పిన పెద్దల మాట. పరిమితంగా బతకడం అంటే జీవితంలో ఎదగలేకపోవడం కాదు. ఎలా బతికితే అర్థవంతమో తెలుసుకోవడం! -
హ్యారీ పోటర్ గుడ్లగూబలపై క్రేజీ
జకార్తా: హ్యారీ పోటర్ సినిమాలు, పుస్తకాల ప్రభావం వల్ల ఇండోనేసియాలో గుడ్లగూబలను పెంచుకునే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. ఫలితంగా అడవుల్లో తిరిగి వీటిని పట్టి తెచ్చి ప్రజలకు అక్రమంగా విక్రయిస్తున్నారు. ఇండోనేసియా ప్రజలకు పక్షులను ప్రేమగా పెంచుకోవడం మొదటి నుంచి అలవాటు. అయినప్పటికీ గుడ్లగూబలను మాత్రం ఎవరూ పెంచుకునేవారు. 1980 దశకంలో వీటి పెంపకం కొద్దిగా మొదలై, 1990 దశకంలో కాస్త విస్తరించి 2000 దశకంలో గణనీయంగా అభివద్ధి చెందింది. గుడ్లగూబల విక్రయ మార్కెట్ గత మూడేళ్ల కాలంలో మరింత పెరిగి ఇప్పుడు ఏడాదికి 12 వేల ఓటస్ జాతికి చెందిన స్కోప్స్ గుడ్లగూబలను విక్రయించే స్థాయికి చేరుకుంది. ఇతర జాతుల గుడ్లగూబల విక్రయాలు మరో మూడువేల వరకు ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా 45 గుడ్లగూబల జాతులున్నాయి. వాటిలో ఓటస్ జాతికి చెందిన స్కోప్స్ గుడ్లగూబలు ఓ జాతి. ఈ జాతి గుడ్లగూబనే హ్యారీ పోటర్ సినిమాలో ఉంటుంది. దాన్ని ‘పిగ్విడ్జియాన్’ అని పిలుస్తారు. ఈ సినిమాలకు గుడ్లగూబల పెంపకానికి ప్రత్యక్ష సంబంధం కనిపించకపోయినా ప్రభావం ఉన్న విషయం మాత్రం స్పష్టం అవుతోంది. 1987లో ప్రారంభమైన వీటి పెంపకం 2016 నాటికి దేశంలో బాగా విస్తరించగా, 1997 నుంచి 2007 సంవత్సరాల మధ్య హ్యారీ పోటర్ పుస్తకాలు వెలువడ్డాయి. ఈ పుస్తకాలు 2000 దశకంలోనే ఇండోనేసియాలోకి అనువాదం అవడం, ప్రజల ఆదరణ పొందడం గమనార్హం. ఇంటర్నెట్, సోషల్ మీడియా విస్తరణ కూడా దేశంలో గుడ్లగూబల పెంపకాన్ని ఒక విధంగా ప్రోత్సహించింది. ఈ మార్కెట్ ఇప్పటికీ దేశంలో చట్టవిరుద్ధమే. దీన్ని అరికట్టేందుకు ప్రభుత్వం కూడా తగిన చర్యలు తీసుకోవడం లేదు.