హ్యారీ పోటర్ గుడ్లగూబలపై క్రేజీ
జకార్తా: హ్యారీ పోటర్ సినిమాలు, పుస్తకాల ప్రభావం వల్ల ఇండోనేసియాలో గుడ్లగూబలను పెంచుకునే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. ఫలితంగా అడవుల్లో తిరిగి వీటిని పట్టి తెచ్చి ప్రజలకు అక్రమంగా విక్రయిస్తున్నారు. ఇండోనేసియా ప్రజలకు పక్షులను ప్రేమగా పెంచుకోవడం మొదటి నుంచి అలవాటు. అయినప్పటికీ గుడ్లగూబలను మాత్రం ఎవరూ పెంచుకునేవారు. 1980 దశకంలో వీటి పెంపకం కొద్దిగా మొదలై, 1990 దశకంలో కాస్త విస్తరించి 2000 దశకంలో గణనీయంగా అభివద్ధి చెందింది. గుడ్లగూబల విక్రయ మార్కెట్ గత మూడేళ్ల కాలంలో మరింత పెరిగి ఇప్పుడు ఏడాదికి 12 వేల ఓటస్ జాతికి చెందిన స్కోప్స్ గుడ్లగూబలను విక్రయించే స్థాయికి చేరుకుంది. ఇతర జాతుల గుడ్లగూబల విక్రయాలు మరో మూడువేల వరకు ఉంటాయి.
ప్రపంచవ్యాప్తంగా 45 గుడ్లగూబల జాతులున్నాయి. వాటిలో ఓటస్ జాతికి చెందిన స్కోప్స్ గుడ్లగూబలు ఓ జాతి. ఈ జాతి గుడ్లగూబనే హ్యారీ పోటర్ సినిమాలో ఉంటుంది. దాన్ని ‘పిగ్‌విడ్జియాన్’ అని పిలుస్తారు. ఈ సినిమాలకు గుడ్లగూబల పెంపకానికి ప్రత్యక్ష సంబంధం కనిపించకపోయినా ప్రభావం ఉన్న విషయం మాత్రం స్పష్టం అవుతోంది.
1987లో ప్రారంభమైన వీటి పెంపకం 2016 నాటికి దేశంలో బాగా విస్తరించగా, 1997 నుంచి 2007 సంవత్సరాల మధ్య హ్యారీ పోటర్ పుస్తకాలు వెలువడ్డాయి. ఈ పుస్తకాలు 2000 దశకంలోనే ఇండోనేసియాలోకి అనువాదం అవడం, ప్రజల ఆదరణ పొందడం గమనార్హం. ఇంటర్నెట్, సోషల్ మీడియా విస్తరణ కూడా దేశంలో గుడ్లగూబల పెంపకాన్ని ఒక విధంగా ప్రోత్సహించింది. ఈ మార్కెట్ ఇప్పటికీ దేశంలో చట్టవిరుద్ధమే. దీన్ని అరికట్టేందుకు ప్రభుత్వం కూడా తగిన చర్యలు తీసుకోవడం లేదు.