
చెట్టు నీడ
పరిమితంగా బతకడం అంటే జీవితంలో ఎదగలేకపోవడం కాదు. ఎలా బతికితే అర్థవంతమో తెలుసుకోవడం!
‘అపాకలిప్టో’ సినిమాలో తన జాతి జనానికి ఒక కురువృద్ధుడు ఈ కథ చెబుతాడు.ఒక రోజు ఒక అడవిలో ఒక మనిషి దిగులుగా కూర్చునివున్నాడు. జంతువులన్నీ వచ్చాయి. ఏం కావాలని ఓదార్చడం మొదలుపెట్టాయి.‘నాకు మంచి కంటిచూపు కావాలి’ చెప్పాడు మనిషి.‘నాది తీసుకో’ అంది రాబందు.‘నాకు చాలా బలం కావాలి.’ ‘నా శక్తి ఇస్తాను’ చెప్పింది చిరుత.‘ఈ భూమి రహస్యాలన్నీ తెలుసుకోవాలనుంది.’‘అవన్నీ నేను చూపిస్తా’ హామీ ఇచ్చింది సర్పం.అట్లా ప్రతి జంతువూ ఏదో ఒక గుణాన్ని వరంగా ఇచ్చాక, ఆ మనిషి వెళ్లిపోయాడు.‘మనిషికి ఇప్పుడు చాలా తెలుసు. పైగా ఎన్నో పనులు చేయగలడు. కానీ ఎందుకో అతడిని తలుచుకుంటే నాకు భయంగా వుంది’ అన్నది గుడ్లగూబ.
‘అతడికి కావాల్సినవన్నీ ఉన్నాయికదా; ఇక అతడి దుఃఖం సమాప్తమవుతుంది’ బదులిచ్చింది జింక.‘కాదు’ స్థిరంగా చెప్పింది గుడ్లగూబ. ‘ఆ మనిషి ముఖానికి రెండు రంధ్రాలున్నాయి, ఎప్పటికీ తీరని ఆకలి అంత లోతుగా. అవే అతడికి ప్రతిదీ కావాలనిపిస్తాయి, అన్నింటికీ దుఃఖం కలిగిస్తాయి. అతడికి అన్నీ కావాలి, కావాలి. ఇంక నా దగ్గర ఇవ్వడానికి ఏమీ మిగలలేదని ప్రపంచం ఏదో రోజు చెప్పేదాకా!’మనిషి మితంగా బతకాల్సిన అవసరాన్నీ, ఏది కోరతగిందీ ఎంత కోరతగిందీ అని అలవర్చుకోవాల్సిన విచక్షణనూ వెల్లడించే కథ ఇది. చూపు పోయినంత మేరా మనసు పోగూడదని చెప్పిన పెద్దల మాట. పరిమితంగా బతకడం అంటే జీవితంలో ఎదగలేకపోవడం కాదు. ఎలా బతికితే అర్థవంతమో తెలుసుకోవడం!