Pacemaker
-
దేశంలో తొలిసారి: కుక్కకు పేస్‌మేకర్
న్యూఢిల్లీ: భారత్‌లో తొలిసారి ఓ కుక్కకు పేస్‌మేకర్ విజయవంతంగా అమర్చారు. కాకర్ స్పేనియల్ జాతికి చెందిన కుక్క ఖుషి (7.5 ఏళ్లు)కి ఢిల్లీలోని మాక్స్ వెటర్నరీ ఆస్పత్రిలో ఈ ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్‌కు ముందు కుక్క గుండె వేగం నిమిషానికి 20కి పడిపోయిందని, కుక్కల సాధారణ గుండె వేగం నిమిషానికి 60–120 సార్లు ఉంటుందని వైద్యులు తెలిపారు. గతేడాది డిసెంబర్ 15న దాదాపు గంటన్నర పాటు ఈ ఆపరేషన్ జరిగినట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ శునకం పరిస్థితి సాధారణంగా ఉందని దాని యజమాని మను మీడియాకు తెలిపారు. -
పేస్‌మేకర్ ఎందుకు పెడతారు?
మా నాన్నగారి వయసు 59 ఏళ్లు. గతేడాది రిటైర్ అయ్యారు. ఇన్నేళ్లూ ఉద్యోగనిర్వహణలో బిజీగా ఉన్నప్పటికీ చాలా క్రమశిక్షణతో ప్రతిరోజూ నడవడం, వ్యాయామం వంటివి చేస్తూ ఉత్సాహంగా పనిచేశారు. కానీ ఆర్నెల్లుగా తరచూ అలసట, ఆయాసం వస్తుండటంతో డాక్టర్‌ను సంప్రదించాం. పరీక్షల్లో గుండె స్పందనలు తగ్గుతున్నట్లు రిపోర్టు వచ్చింది. సిటీకి తీసుకెళ్లి పేస్‌మేకర్ అమర్చడమే శాశ్వత పరిష్కారమని డాక్టర్ చెప్పారు. పేస్‌మేకర్ అంటే ఏమిటి? దాని గురించి వివరంగా చెప్పండి. గుండె తగినంత వేగంగా కొట్టుకునేందుకు వీలు కల్పిస్తూ ఉండే పరికరమే పేస్‌మేకర్. దీన్ని రోగి శరీరంలో అమర్చాల్సి ఉంటుంది. గుండె స్పందనల్లో విపరీతంగా తేడాలు ఉన్నప్పుడు వాటిని అదుపు చేయడానికి దీనిని వాడతారు. గుండెవ్యాధుల కారణంగా సమస్యలెదుర్కొంటున్నవారికి ఇది కొత్తజీవితాన్ని అందిస్తుంది. మన గుండె పూర్తిగా కండరాలతో నిర్మితమైన అవయవం. అది నిరంతరాయంగా స్పందిస్తూ ఉండాలి. అయితే కొన్ని రకాల వ్యాధుల కారణంగా గుండె దెబ్బతిన్నప్పుడు గుండెస్పందనల్లో తేడాలు వచ్చి గుండె కొట్టుకునే వేగం తగ్గితే అది ప్రాణాంతకంగా పరిణమించవచ్చు. అలాంటి పరిస్థితుల్లో పేస్‌మేకర్ ప్రాణాలను కాపాడుతుంది. ఎందుకు అవసరం? విశ్రాంతి లేకుండా శరీరభాగాలన్నింటికీ రక్తాన్ని సరఫరా చేసే గుండె కుడి, ఎడమ భాగాలలో రెండేసి గదులు ఉంటాయి. వీటిలో పైభాగంలో ఉన్న గదులను ఏట్రియా అనీ, కింద ఉన్న గదులను వెంట్రికిల్స్ అని అంటారు. శరీర భాగాల నుంచి గుండెకు వచ్చిన రక్తం గుండె కుడి ఏట్రియంలోకి చేరుతుంది. తర్వాత దానికిందనే ఉన్న కుడి వెంట్రికిల్లోకి వస్తుంది. అక్కడి నుంచి రక్తం ఊపిరితిత్తుల్లోకి పంప్ అవుతుంది. శ్వాసకోశాలలో ఆ రక్తం ఆక్సిజన్‌తో శుద్ధి అవుతుంది. ఇప్పుడు శుద్ధమైన రక్తం గుండెలోని ఎడమ ఏట్రియంలోకి వెళ్తుంది. అక్కడినుంచి ఎడమ వెంట్రికిల్లోకి చేరుకొంటుంది. ఎడమ వెంట్రికిల్ శుద్ధరక్తాన్ని శరీర భాగాలన్నింటికీ పంప్ చేస్తుంది. ఈ ప్రక్రియ సజావుగా జరిగేందుకుగాను గుండె సంకోచవ్యాకోచాలు చోటు చేసుకోవాలి. నిర్దిష్ట సమయానికి అందే విద్యుత్ ప్రేరణలతోనే ప్రతిసారీ ఈ ప్రక్రియ జరుగుతుంది. ఈ విద్యుత్ ప్రేరణ కుడి ఏట్రియంలోని ‘సైనస్నోడ్’ దగ్గర మొదలవుతుంది. దాంతో ఏట్రియా సంకోచించి రక్తాన్ని వెంట్రికిల్స్లోకి పంప్ చేస్తాయి. ‘సైనస్ నోడ్’ నుంచి విద్యుత్ తరంగాలు... ప్రవాహకాలుగా పనిచేసే ప్రత్యేక కండరాల ద్వారా గుండెలోనే ఉన్న ఏట్రియో–వెంట్రిక్యులార్ నోడ్ (ఏవీఎన్)కు చేరతాయి. ఇక్కడి నుంచి విద్యుత్తు వెంట్రికిల్స్కు ప్రవహించి అవి సంకోచించేట్లు చేస్తుంది. దాంతో వాటిలోని రక్తం ముందుకు పంప్ అవుతుంటుంది. ఈ విధంగా విద్యుత్ తరంగాల చక్రభ్రమణంలా సాగే ఈ ప్రక్రియ మొత్తాన్ని ఒకసారి గుండె స్పందనగా పరిగణిస్తారు. ఈ విద్యుత్ ప్రవాహంలో ఎలాంటి ఆటంకం ఏర్పడినా అది గుండె స్పందనల్లో లోటుపాట్లకు కారణమవుతుంది. ఇలా గుండె స్పందనల్లో మార్పులు వస్తే దాన్ని అరిథ్మియా అంటారు. గుండె విద్యుత్ వ్యవస్థలో సమస్యలన్నవి సైనస్ నోడ్, ఏవీ నోడ్ లేదా విద్యుత్ ప్రసారం చేసే కండరాలలో లోపాల వల్ల ఏర్పడతాయి. గుండెపోటు, గుండెకవాటాల సమస్యల వల్ల కూడా ఈ పరిస్థితి ఏర్పడవచ్చు. గుండెస్పందన సాధారణంగా ఉన్నప్పుడు శరీర భాగాలన్నింటికీ రక్తం సజావుగా సరఫరా అవుతూ ఉంటుంది. కానీ అది అతివేగంగా గానీ లేదా చాలా నెమ్మదిగా గానీ కొట్టుకుంటూ ఉంటే శరీర భాగాలకు రక్తసరఫరా తగ్గిపోతుంది. దీంతో మైకం కమ్మినట్లుగా ఉండటం, ఛాతీలో నొప్పి, శ్వాస తీసుకోవడం కష్టంగా ఉండటం, స్పృహతప్పడం కనిపిస్తాయి. ఇందుకు కారణమయ్యే అరిథ్మియాలకు సాధారణంగా మందులతోనే చికిత్స చేస్తారు. అయితే మందులకు లొంగకుండా గుండె స్పందనలు భారీగా తగ్గిన కేసుల్లో పేస్‌మేకర్‌ను సిఫార్సు చేస్తారు. పేస్ మేకర్ అంటే? ఇదొక చిన్న ఎలక్ట్రానిక్ పరికరం. ఇది అరిథ్మియా వ్యాధిగ్రస్తుల శరీరంలో ఇమిడిపోయి, ఆరోగ్యకరమైన వ్యక్తుల్లోలాగే గుండె స్పందనలు ఉండేలా నియంత్రిస్తుంటుంది. బ్యాటరీపై ఆధారపడి పనిచేసే ఈ చిన్న పరికరం గుండెకు కావాల్సిన విద్యుత్ ప్రేరణలను ఇస్తుంటుంది. దాంతో గుండె తగినన్ని సార్లు కొట్టుకుంటుంది. పేస్‌మేకర్‌లో పల్స్ జనరేటర్, ఇన్సులేటెడ్ లెడ్స్ అనే రెండు భాగాలు ఉంటాయి. వీటిలో పల్స్ జనరేటర్ ఓ చిన్న లోహపు డబ్బాలా ఉంటుంది. దీనిలో అతి చిన్న ఎలక్ట్రానిక్ చిప్; దాదాపు 5 – 7 ఏళ్ల పాటు పనిచేయగల బ్యాటరీ ఉంటాయి. ఇవి రెండూ కలిసి ఓ చిన్న కంప్యూటర్‌లా పనిచేస్తాయి. ఇది గుండె స్పందన వేగాన్ని గమనించి తగినన్ని సార్లు కొట్టుకునేందుకు అవసరమైన విద్యుత్ ప్రేరణలను పంపిస్తుంది. లెడ్స్ అనే కొన్ని సన్నని కేబుల్స్ పల్స్ జనరేటర్ నుంచి బయలుదేరి గుండెలోని కండరాల వరకు ప్రయాణిస్తాయి. ఇవి గుండె ఎంత వేగంగా స్పందిస్తుందో పల్స్మేకర్కు తెలియజేస్తాయి. దానికి అనుగుణంగా పల్స్ జనరేటర్ నుంచి అవసరమైనన్ని విద్యుత్ ప్రేరణలను గుండె కండరాలకు చేరవేస్తాయి. కొన్ని ముందస్తు పరీక్షలు అవసరం... పేస్‌మేకర్ అమర్చడానికి ముందుగా పేషెంట్‌కు కొన్ని పరీక్షలు చేయించాలి. పేస్‌మేకర్ అమర్చడానికి రోగి అనుకూలుడా, కాదా అని నిర్ధారణ చేసుకునేందుకు డాక్టర్లు ఈ పరీక్షలను సిఫార్సు చేస్తారు. అందులో భాగంగా ఎకోకార్డియోగ్రామ్ ద్వారా గుండె కండరాల మందాన్ని గుర్తించాలి. శరీరంపై కొన్ని సెన్సర్లను అమర్చడం ద్వారా గుండె నుంచి వెలువడే విద్యుత్ సంకేతాలను గమనించే ఎలక్ట్రోకార్డియోగ్రామ్ పరీక్ష, వ్యాయామం చేసేటప్పుడు గుండె కొట్టుకోవడంలో మార్పులను గుర్తించే స్ట్రెస్ టెస్ట్ వంటి పరీక్షలు చేశాక... ఆ వ్యక్తి పేస్‌మేకర్ అమర్చడానికి అర్హుడా, కాదా నిర్ధారణ చేస్తారు. పేస్‌మేకర్ అమర్చడానికి అనుకూలుడైన వ్యక్తికి అది అమర్చడానికి ముందురోజు రాత్రి తర్వాత ఘన, ద్రవ ఆహారాలు ఏమీ తీసుకోవద్దని చెబుతారు. అయితే డాక్టర్లు సిఫార్సు చేసిన మందులను మాత్రం వాడాల్సి ఉంటుంది. ఆ తర్వాత చిన్న శస్త్రవైద్య ప్రక్రియ ద్వారా ఛాతీ కుడిభాగానో లేదా ఎడమ భాగానో కాలర్బోన్కి దిగువన 2 – 3 అంగుళాల కింద గాటుపెట్టి అక్కడ దీన్ని అమర్చుతారు. పేస్‌మేకర్ అమర్చుకున్నవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పేస్‌మేకర్ అమర్చుకున్నవారు దాని నుంచి గరిష్ట ప్రయోజనం పొందేందుకు జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రతి ఏడాదీ రెండుసార్లు డాక్టర్‌ను కలిసి, దాని పనితీరు రోగి అవసరాలకు తగ్గట్లుగా ఉందో లేదో అని తెలుసుకోవాలి. డాక్టర్ తన దగ్గర ఉన్న కంప్యూటర్ మౌస్ లాంటి చిన్న పరికరం సహాయంతో రేడియో సిగ్నల్స్ ద్వారా పేస్‌మేకర్ సరిగా పనిచేస్తున్నదీ లేనిదీ పరిశీలించి, అవసరమైన మార్పులు (ట్యూనింగ్) చేస్తారు. పేస్‌మేకర్ ఉన్న వ్యక్తి క్రమం తప్పకుండా తన నాడి (పల్స్)ని పరిశీలించుకుంటూ ఉండాలి. చాలా నెమ్మదిగా ఉన్నా లేదా అతివేగంగా ఉన్నా వెంటనే డాక్టర్‌ను కలవాలి. మైకం కమ్మినట్లు అనిపించినా, ఛాతీలో నొప్పిలేదా శ్వాస తీసుకోవడంలో కష్టంగా ఉన్నా వెంటనే డాక్టర్ దృష్టికి తీసుకెళ్లాలి. పేస్‌మేకర్‌లో మార్పులు చేయాల్సిన అవసరాన్ని ఆ లక్షణాలు సూచిస్తుండవచ్చు. డా‘‘ వరదరాజశేఖర్, సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ – ఎలక్రోఫిజియాలజిస్ట్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
ఏడు రోజుల శిశువుకు పేస్‌మేకర్
లబ్బీపేట (విజయవాడ తూర్పు): విజయవాడలోని ఆంధ్రా హాస్పిటల్స్‌లో అరుదైన ఆపరేషన్ జరి గింది. భీమవరానికి చెందిన ఏడు రోజుల శిశువుకు పేస్‌మేకర్‌ను విజయవంతంగా అమర్చారు. దీంతోపాటు సత్తెనపల్లికి చెందిన ఆరేళ్ల బాలుడికి గుండె సర్జరీ అనంతరం ఎక్మో చికిత్స అందించి పునర్జన్మ ప్రసాదించారు. పదిహేను రోజుల పాటు నిర్వహించిన ప్రత్యేక క్యాంపులో భాగంగా యూకేకు చెందిన హీలింగ్ లిటిల్ హార్ట్స్ వైద్యబృందం రాష్ట్రంలోనే తొలిసారిగా ఈ అరుదైన శస్త్రచికిత్సలు ఉచితంగా నిర్వహించింది. ఈ సందర్భంగా ఆంధ్రా హాస్పిటల్స్ ఎండీ డాక్టర్ పీవీ రమణమూర్తి ఇంగ్లండ్ వైద్యులతో కలసి ఆంధ్రా హార్ట్ అండ్ బ్రెయిన్ ఇనిస్టిట్యూట్‌లో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గుండె లోపాలున్న చిన్నారులకు సర్జరీలు చేయాలంటే రూ.2 లక్షల నుంచి రూ.2.50 లక్షల వరకూ ఖర్చవుతుందని చెప్పారు. ఇంగ్లం డ్కు చెందిన హీలింగ్ లిటిల్ హార్ట్ చారిటీస్ సహకా రంతో అక్కడి వైద్య బృందంతో ప్రతి మూడు నెలలకోసారి ప్రత్యేక శిబిరం నిర్వహించి చిన్నారు లకు ఉచితంగా గుండె సర్జరీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆరోగ్యశ్రీ పథకంలో హైదరాబాద్‌లో పిల్లలకు గుండె సర్జరీలు చేయించుకునే వీలులేక పోవడంతో ఇక క్రమంగా సర్జరీలు నిర్వహించాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ఆగస్టు 27 నుంచి ఈ నెల 8 వరకూ నిర్వహించిన క్యాంప్‌లో 19 మందికి ఉచితంగా గుండె సర్జరీలు చేశామన్నారు. ఇలా ఇప్పటివరకూ ఇంగ్లండ్ వైద్యులచే 135 మంది చిన్నారులకు శస్త్రచికిత్సలు చేయగా, తమ వైద్యులు 55 మంది చిన్నారులకు నిర్వహించారని, మొత్తం 190 మందికి శస్త్ర చికిత్సలు నిర్వహించినట్లు వివరించారు. సమా వేశంలో ఆంధ్రా హాస్పిటల్స్ పీడియాట్రిక్ చీఫ్ డాక్టర్ పాతూరి వెంకటరామారావు, ఇంగ్లండ్‌కు చెందిన పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ డాక్టర్ కుడుముల రామారావు, íపీడియాట్రిక్ కార్డియాక్ సర్జన్ డాక్టర్ సిమోనా, ఇంటెన్సివ్ నిపుణుడు డాక్టర్ రెయినీస్, నైనా, గైల్ రాజోస్, మిర్జానా, ట్రేసీ, ఫియోనావుడ్లతో పాటు కార్డియాలజిస్ట్ డాక్టర్ శ్రీమన్నారాయణ, కార్డియాక్ సర్జన్ డాక్టర్ దిలీప్ తదితరులు పాల్గొన్నారు. -
అతిచిన్న పేస్‌మేకర్..
హూస్టన్ : ప్రపంచంలోనే అతిచిన్న పేస్‌మేకర్‌ను తక్కువ హృదయ స్పందన రేటుతో బాధపడుతున్న అమెరికాలోని ఓ రోగికి విజయవంతంగా అమర్చినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ పేస్‌మేకర్ పరిమాణం విటమిన్ ట్యాబ్లెట్ కంటే చిన్నగా..ప్రస్తుతం వినియోగంలో ఉన్న పేస్‌మేకర్ సైజులో పదో వంతు మాత్రమే ఉంటుంది. మైక్రా ట్రాన్స్ కాథెటర్ పేసింగ్ సిస్టం (టీపీఎస్)గా వ్యవహరించే ఈ నూతన అతిచిన్న పేస్‌మేకర్‌కు అదనపు వైర్లు అవసరం లేదని, అలాగే రోగి క్రియల ఆధారంగా తన పనితీరును తనే సర్దుబాటు చేసుకుంటుందని వైద్యులు తెలిపారు. -
‘పేస్‌మేకర్’ ఆల్ఫ్రెడ్ ఇకలేరు
లాస్ఏంజెలస్: ప్రముఖ వ్యాపారవేత్త, దాత, ఆవిష్కర్త ఆల్ఫ్రెడ్ ఈ మన్(90) అనారోగ్యంతో గురువారం మృతి చెందారు. వైమానిక సేవలు, ఫార్మా, ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్, బయో మెడికల్ పరిశోధనలతో పాటు అనేక రంగాల్లో తన వ్యాపారాన్ని విస్తరించారు. కాలిఫోర్నియా కేంద్రంగా పనిచేస్తున్న వలెన్సియా కంపెనీకి 2001 నుంచి ఈ నెల ఆరంభం వరకు ఆయన చైర్మన్‌గా పనిచేశారు. మాన్ ఆధ్వర్యంలోనే మొట్టమొదటి రీచార్జ్‌బుల్ పేస్‌మేకర్, పీల్చే ఇన్సులిన్ అభివృద్ధి పరిచారు. అమెరికా సైన్యం, అంతరిక్ష పరిశోధ నల కోసం తన కంపెనీల్లో సోలార్ సెల్స్, సెమీ కండక్టర్లను ఉత్పత్తి చేయడంతో పాటు అనేక విధాలుగా సాంకేతిక సహాయాన్ని అందించారు. హృద్రోగులకు పేస్మేకర్లు, మధుమేహ రోగులకోసం ఇన్సులిన్ ఉత్పత్తి చేయడం ద్వారా వేల కోట్లు సంపాదించారు. -
మీ గుండెకు భరోసా!
ప్రస్తుతం మన జీవితంలో చాలామంది భయపడేది గుండెజబ్బుల గురించే. ఆందోళన చెందేది ‘గుండెపోటు’ వస్తుందేమో అన్న అపోహ కొద్దే. కానీ... ఇటీవల గుండెపై జరుగుతున్న పరిశోధనలూ, కార్డియాలజీ రంగంలో చోటు చేసుకుంటున్న ఆధునిక సాంకేతిక అభివృద్ధీ ఇకపై అలాంటి భయాలకూ, ఆందోళనలకూ ఆస్కారం లేవంటున్నాయి. గుండె లయ తప్పినా దాన్ని సరిచేయవచ్చు. గుండెపోటు రాబోతున్నా... లోపలే ఉన్న పరికరంతో ఒక షాక్‌లాంటి జోల్ట్ ఇచ్చి రాకుండానే నివారించవచ్చు. అంతెందుకు... సమీప భవిష్యత్తులో గుండె మార్పిడి చేయాల్సిన అవసరం వచ్చి... గుండె దొరకకపోయినా ‘కృత్రిమగుండె’ను అమర్చి జీవితం ఎప్పటిలాగే హాయిగా సాగేలా చేయవచ్చు. ఇలాంటి కృత్రిమ గుండె అందుబాటులోకి వచ్చాక తొలిదశలో ఖరీదేమో. కానీ... మొదట్లో ఓపెన్‌హార్ట్ సర్జరీలకు 50,000 డాలర్ల ఖర్చు కాస్తా... ఇటీవల 2000 డాలర్లకు (దాదాపు లక్షకు) పడిపోయినట్లుగానే... పోనుపోనూ ఈ కృత్రిమ గుండెలూ చవకవుతాయి. ఎన్నో ప్రాణాలను రక్షిస్తాయి. ఈ నెల 29న వరల్డ్ హార్ట్ డే సందర్భంగా... ఇలాంటి ఎన్నో కొత్త విషయాలు చెప్పి గుండెజబ్బుల పట్ల ఆందోళన పడేవారిలో భరోసా నింపడం కోసమే ఈ ప్రత్యేక కథనం. పేస్ మేకర్‌తో గుండె లయ క్రమబద్ధం! గుండె ఒక క్రమబద్ధమైన లయతో కొట్టుకుంటుందన్న విషయం తెలిసిందే. ఇలా ఒక ‘రిథమ్’తో కొట్టుకునే గుండె ఉన్నట్టుండి లయ తప్పడాన్ని ‘అరిథ్మియా’ అంటారు. ఇలాంటి అరిథ్మియా అనే కండిషన్‌కు పేస్‌మేకర్‌తో చికిత్స చేస్తారు. గుండె రిథమ్ ఎలా నిర్వహితమవుతుంటుంది? గుండె శరీరానికి అంతటికీ రక్తాన్ని సరఫరా చేసే ఓ మోటారు లాంటిది. మరి మోటారు నడవాలంటే కరెంటు అవసరం కదా! అన్ని అవయవాలకూ రక్తాన్ని అందజేసే ఈ గుండెమోటారు నడవటానికి అవసరమైన కరెంటు మన గుండె పైన కుడిగదిలో ఉండే ఒక కండర సమూహంతో నిర్మితమైన అవయవం నుంచి సప్లై అవుతుంటుంది. దీన్నే ‘సైనో ఏట్రియల్ నోడ్’ అంటారు. దీనికి కాస్త కిందుగా కుడి గుండె కిందిగదికి చాలా పైనే మరో కండర నిర్మితమైన నోడ్ కూడా ఉంటుంది. దాన్నే ‘ఏట్రియో వెంట్రిక్యులార్ నోడ్’ అంటారు. సైనో ఏట్రియల్ నోడ్ నుంచి ఉద్భవించిన కరెంటు తరంగం సైనో వెంట్రిక్యులార్ నోడ్‌కు చేరుతాయి. ఇలా చేయడం ద్వారా ‘మయోకార్డియమ్’ అనే ప్రత్యేక కండరంతో నిర్మితమైన గుండెను స్పందించేలా చేస్తాయి. ఇక్కడ ఓ అద్భుతం జరుగుతుంది. గుండెను స్పందింపజేసేందుకు కరెంటు తరంగాలు (ఎలక్ట్రిక్ ఇంపల్స్) పుట్టే సైనోఎట్రియల్ నోడ్ గుండె పైగదుల్లో ఉంటుంది. అదే ఏట్రియోవెంట్రిక్యులార్ నోడ్ కూడా పై గది వద్దే ఉన్నా కాస్త కిందుగా ఉంటుంది. ఈ రెండింటి మధ్య కరెంటు ప్రవాహ వేగాన్ని తగ్గించే కణజాలం ఒక అడ్డుపొరలా (ఫైబ్రస్ కనెక్టివ్ టిష్యూ సెప్టమ్) ఉంటుందన్నమాట. దీనివల్ల మొదట పై గదులు పూర్తిగా స్పందిస్తాయి. ఈ లోపు కొంత కరెంటు ప్రవాహం తగ్గి కింది గదులూ స్పందిస్తాయి. గుండె స్పందనల లయలో మార్పులెలా వస్తాయి? ఇలా లయబద్ధంగా స్పందించాల్సిన గుండె కొట్టుకోవడంలో మార్పులు వచ్చే అవకాశాలూ ఉంటాయి. దాన్నే ‘డిస్ఫంక్షన్ ఆఫ్ కండక్షన్ సిస్టమ్’ అంటారు. అది ఏయే సందర్భాల్లో జరుగుతుందంటే... సైనో ఏట్రియల్ నోడ్ వద్ద కరెంట్ సిగ్నల్ యథావిధిగానే మొదలైనా తన గమ్య స్థానం చేరేలోపు ఆ కరెంట్ ఇంపల్స్ బలహీనపడుతుంది. దాంతో క్రమబద్ధంగా సాగాల్సిన గుండె స్పందనలు కాస్తా బలహీనంగా సాగడమో లేక అడ్డదిడ్డంగా (ఇర్రెగ్యులర్ హార్ట్‌బీట్) సాగడమో జరుగుతుంది. ఈ కండిషన్‌ను బ్రాడీకార్డియా అంటారు. ఒక్కోసారి ఏట్రియోవెంట్రిక్యులార్ వద్ద కరెంటు ఆగిపోతుంది. దాంతో గుండె కింది గదులు అసలు స్పందించవు. ఇది పాక్షిక లేదా పూర్తి హార్ట్ ఫెయిల్యూర్ కండిషన్‌కు దారితీయవచ్చు. ఒక్కోసారి అటు సైనో ఏట్రియల్ నోడ్ వద్ద, ఇటు ఏట్రియో వెంట్రిక్యులార్ నోడ్ వద్ద... ఈ రెండింటిలోనూ లోపాలు ఏర్పడవచ్చు. అప్పుడు పరిష్కారం ఏమిటి? పై కారణాలలో దేనివల్లనైనా గుండె స్పందనలు లయబద్ధంగా సాగకుండా, వాటి ఇష్టం వచ్చినట్లుగా చోటుచేసుకుంటుంటే, ఆ పరిస్థితిని నివారించి గుండె మళ్లీ క్రమబద్ధమైన స్పందనలతో కొట్టుకునేలా చూడటానికి ఒక కృత్రిమ ఉపకరణం వాడతారు. దాని పేరు ‘పేస్ మేకర్’. పేస్‌మేకర్ చరిత్ర ఇది... మొట్టమొదటిసారి కృత్రిమ పేస్‌మేకర్‌ను తయారు చేసిన ఘనత కెనెడియన్ ఇంజనీర్ అయిన జాన్ హాప్స్కు దక్కుతుంది. ఆయన 1950 లలో రూపొందించిన ఈ ఉపకరణాన్ని అప్పట్లో శరీరం బయటే అమర్చి దాన్ని ప్లగ్‌లో పెట్టేవారు.అంటే ప్లగ్ పెట్టే వైరు ఎంత పొడవుందో, రోగి అంతవరకే కదలగలుగుతాడన్నమాట. అదీ అప్పటి పరిమితి. కానీ1958 నాటికి ఏడాది నుంచి ఏడాదిన్నరకు సరిపోను బ్యాటరీ బ్యాకింగ్‌తో శరీరంలో అమర్చడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి పేస్‌మేకర్ ఉపయోగాలు విస్తృతమవ్వడం ప్రారంభమైంది. పేస్మేకర్లోని భాగాలివి... పల్స్ జనరేటర్ : ఇది కరెంటు సిగ్నల్స్‌ను ఉత్పన్నం చేసే ఉపకరణం. ఇప్పుటి పేస్మేకర్లలో ఇది అరంగుళం మందంతో ఒకటిన్నర అంగుళాల చుట్టుకొలతతో ఉంటుంది. ఇవి లిథియమ్ బ్యాటరీలతో నడుస్తూ 5 నుంచి 10 ఏళ్ల పాటు పనిచేస్తాయి. బ్యాటరీ బలహీనమయ్యే సమయంలో కొన్ని నెలల ముందు నుంచే అది హెచ్చరికలు చేస్తూ ఉంటుంది. లీడ్స్ : ఇవి పల్స్ జనరేటర్ నుంచి ఉత్పన్నమైన విద్యుత్ తరంగాలను గుండెకూ, మళ్లీ గుండె నుంచి జనరేటర్కూ మోసుకుని వెళ్లే వైర్లు. కరెంటు బయటకు రాకుండా ఈ వైర్ల చుట్టూ ఇన్సులేషన్ (కరెంట్ నిరోధక పదార్థం) ఉంటుంది. అందుబాటులో ఎలాంటి పేస్‌మేకర్స్ ఉన్నాయి? ఫిక్స్డ్ పేస్‌మేకర్ : ఈ తరహా పేస్మేకర్లు నిర్ణీత కరెంటు స్పందనలను వెలువరిస్తుంటాయి. అంటే గుండె కొట్టుకోడానికి అక్కడ ఉత్పన్నమవుతున్న కరెంటు ఎంత అన్నదానితో నిమిత్తం లేకుండా ఇది నిర్ణీతంగా ఒక వ్యక్తి అవసరాల మేరకు తయారు చేస్తారు. రోగికి ఎంత కరెంటు ఇంపల్స్ కావాలో నిర్ణయించి ఆ మేరకు సిగ్నళ్లు విడుదలయ్యేలా ఫిజీషియన్ దీన్ని ప్రోగ్రామ్ చేసి అమర్చుతారు. రేట్ రెస్పాన్సివ్ : మన గుండె పనితీరు ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే. ఉదాహరణకు మనం ఏదైనా కఠినమైన పని చేస్తున్నామనుకోండి. అంటే పరుగెత్తడమో, మెట్లెక్కడమో లాంటివి. అప్పుడు ఆటోమేటిగ్గా దానికి అనుగుణంగా మన గుండె వేగం పెరుగుతుంది. అలాగే మనం నిలకడగా ఉన్నప్పుడు దాని వేగం తగ్గి క్రమబద్ధంగా ఉంటుంది. మన శరీరంలోని ఈ మార్పులను పసిగట్టి వేగంగా స్పందించాల్సిన అవసరమున్నప్పుడు దానికి అనుగుణంగానూ, ఆ పరిస్థితి లేనప్పుడు మళ్లీ మామూలుగానూ దానంతట అదే అయ్యేలా రూపొందించిన పేస్‌మేకర్ ఇది. ఇవేగాక... సింగిల్ ఛేంబర్ పేస్‌మేకర్ ఫర్ సైనోఏట్రియల్ నోడ్ డిస్ఫంక్షన్; సింగిల్ ఛేంబర్ పేస్‌మేకర్ ఫర్ ఏట్రియోవెంట్రిక్యులార్ నోడ్ డిస్ఫంక్షన్; డ్యుయల్ ఛేంబర్ పేస్‌మేకర్ ఫర్ సనోఏట్రియల్ నోడ్ అండ్ ఏట్రియోవెంట్రిక్యులార్ నోడ్ డిస్ఫంక్షన్ అనే రకాలూ ఉన్నాయి. శరీరంలో ఎలా అమరుస్తారు? మన శరీరంలోని కాలర్ బోన్ కింద రెండు నుంచి మూడంగుళాల మేర గాటు పెట్టి పేస్‌మేకర్ అమర్చుతారు. అక్కడ పేస్‌మేకర్ కోసం చర్మంలోనే ఓ చిన్న సంచిలాంటిది ఏర్పాటు చేసి పేస్‌మేకర్‌ను పెడతారు. ఆ తర్వాత ఫ్లూరోస్కోపీ అనే ప్రక్రియ ద్వారా గుండెకు అందాల్సిన స్పందనల కోసం సబ్‌క్లేవియన్ వెయిన్ అనే రక్తనాళం లోకీ, బ్రాకియోపెఫాలిక్ వెయిన్ అనే రక్తనాళంలోకీ, సూప్రా వెనకేవా అనే రక్తనాళంలోకి పైన ఇన్సులేషన్ కవర్ ఉన్న వైర్లను పంపి, గుండెలోని ఏ భాగంలో స్పందనలు అవసరమో అక్కడికి కరెంటు సిగ్నళ్లు అందేలా చూస్తారు. ఇలా పేస్‌మేకర్ అమర్చడం కోసం ఒకటి నుంచి మూడు రోజుల పాటు ఆసుపత్రిలో ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎస్ఐసీడీ : కొందరిలో గుండె లయ తప్పిన సమయంలో దాని తీవ్రత ఎంతగా ఉంటుందంటే... అకస్మాత్తుగా గుండె తన ఇష్టం వచ్చినట్లుగా స్పందిస్తుంటుంది. గుండె వేగం అపరిమితంగా పెరిగిపోతుంది. ఒక అంచనా ప్రకారం ఏడాదికి ఇలాంటి పరిస్థితి 1800 మందికి వస్తే అందులో కేవలం 12 శాతం మాత్రమే బతికి బట్టకడతారు. ఇలా అకస్మాత్తుగా గుండె లయతప్పినప్పుడు శరీరంలో అమర్చిన ఐసీడీ లాంటి ఉపకరణమే రాబోయే విపత్తును పసిగట్టి గుండెకు ఇవ్వాల్సిన షాక్‌ను అప్పటికప్పుడు ఇచ్చేస్తుంది. అంటే ఆసుపత్రికి వచ్చాక ఇస్త్రీపెట్టెలాంటి పరికరాలతో ఇచ్చే షాక్‌ను శరీరంలో అమర్చితే ఇది ముందుగానే ఇచ్చేస్తుంది. అలా అరిథ్మియాతో వచ్చే గుండెజబ్బు నుంచి రక్షిస్తుంది. భవిష్యత్ పేస్మేకర్లు : ప్రస్తుతం ఉపయోగించే పేస్మేకర్ల వల్ల శరీరంలో దాన్ని అమర్చడానికి గాటు పెట్టాల్సి రావడంతో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ భవిష్యత్తులో ఇలాంటి అవసరమే లేకుండా, వైర్లు కూడా లేకుండానే పేస్మేకర్లు రూపొందనున్నాయి. లీడ్లెస్ పేస్‌మేకర్స్ సంప్రదాయ పేస్మేకర్ల స్థానంలో త్వరలో అందుబాటులోకి రానున్న ఉపకరణాలివి. వీటిని శరీరంలోకి ప్రవేశపెట్టకుండా కేవలం తొడ కింది భాగంలో అమర్చి ఫీమోరల్ వెయిన్ అనే రక్తనాళానికి దీని సిగ్నళ్లు అందేలా చూస్తారు. ఈ లీడ్లెస్ పేస్‌మేకర్ 9 నుంచి 13 ఏళ్ల పాటు నిరంతరాయంగా పనిచేస్తూ గుండె స్పందనల అవకతవకలను సరిచూస్తూ పేషెంట్ ప్రాణాల్ని రక్షిస్తుంటుంది. సంప్రదాయ పేస్‌మేకర్‌ను అమర్చడానికి 1 నుంచి 3 రోజులు అవసరం కాగా... ఈ కొత్తరకం పేస్మేకర్స్ను అమర్చడానికి కేవలం అరగంట చాలు. దీన్ని తొలగించడం, మళ్లీ అమర్చడం ఎంత సులభం అంటే... ఒక బ్యాటరీని దాని స్లాట్‌లో పెట్టడం, తీయడం అంత సులువు. దీన్నే ‘ద ఫ్యూచర్ ఆఫ్ పేస్మేకింగ్’ అంటూ అభివర్ణిస్తున్నారు జర్మనీకి చెందిన బాడ్నాహీమ్లోని కెర్చాఫ్క్లినిక్ కు చెందిన డాక్టర్ జొహానెస్ స్పెర్జ్వెల్. -
పేస్‌మేకర్‌కు కొత్త ఫేస్
ఆవిష్కరణ గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారికి పేస్‌మేకర్ ఓ వరం. ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా ఏడు లక్షలకంటే ఎక్కువమంది గుండె లయబద్ధంగా కొట్టుకోవడానికి పేస్‌మేకర్ మీద ఆధారపడి జీవిస్తున్నారు. కానీ పేస్మేకర్ని అమర్చుకోవడం ఒక ఎత్తు. అయితే, ఏడెనిమిదేళ్ల తర్వాత దానిని రీప్లేస్ చేసుకోవడం చాలా ఖర్చుతో కూడిన ప్రక్రియ అనే చెప్పాలి. ఈ శ్రమ ఇకపై ఉండదు అంటున్నారు మిషిగాన్ యూనివర్శిటీ పరిశోధకులు. డాక్టర్ అమిన్ కరామి బృందం గుండె కొట్టుకునేటప్పుడు విడుదలయ్యే విద్యుచ్ఛక్తి ఆధారంగా పేస్‌మేకర్ ఎప్పటికప్పుడు చార్జ్ అవుతూ ఉండేటట్లు కొత్తరకం పేస్‌మేకర్‌ను రూపొందించింది. చెవి దగ్గర అమర్చే చిన్న రేడియో ఈ పనిని నిర్వహిస్తుంది. ప్రయోగదశలో విజయవంతమైన ఈ పేస్‌మేకర్‌ను ఒకసారి అమర్చుకుంటే ఇక దానంతట అదే పనిచేస్తూ ఉంటుంది. ఇది మార్కెట్లోకి రావడానికి కనీసం మూడు- నాలుగేళ్లు పట్టవచ్చు.