మా నాన్నగారి వయసు 59 ఏళ్లు. గతేడాది రిటైర్ అయ్యారు. ఇన్నేళ్లూ ఉద్యోగనిర్వహణలో బిజీగా ఉన్నప్పటికీ చాలా క్రమశిక్షణతో ప్రతిరోజూ నడవడం, వ్యాయామం వంటివి చేస్తూ ఉత్సాహంగా పనిచేశారు. కానీ ఆర్నెల్లుగా తరచూ అలసట, ఆయాసం వస్తుండటంతో డాక్టర్‌ను సంప్రదించాం. పరీక్షల్లో గుండె స్పందనలు తగ్గుతున్నట్లు రిపోర్టు వచ్చింది. సిటీకి తీసుకెళ్లి పేస్‌మేకర్ అమర్చడమే శాశ్వత పరిష్కారమని డాక్టర్ చెప్పారు. పేస్‌మేకర్ అంటే ఏమిటి? దాని గురించి వివరంగా చెప్పండి.
గుండె తగినంత వేగంగా కొట్టుకునేందుకు వీలు కల్పిస్తూ ఉండే పరికరమే పేస్‌మేకర్. దీన్ని రోగి శరీరంలో అమర్చాల్సి ఉంటుంది. గుండె స్పందనల్లో విపరీతంగా తేడాలు ఉన్నప్పుడు వాటిని అదుపు చేయడానికి దీనిని వాడతారు. గుండెవ్యాధుల కారణంగా సమస్యలెదుర్కొంటున్నవారికి ఇది కొత్తజీవితాన్ని అందిస్తుంది. మన గుండె పూర్తిగా కండరాలతో నిర్మితమైన అవయవం. అది నిరంతరాయంగా స్పందిస్తూ ఉండాలి. అయితే కొన్ని రకాల వ్యాధుల కారణంగా గుండె దెబ్బతిన్నప్పుడు గుండెస్పందనల్లో తేడాలు వచ్చి గుండె కొట్టుకునే వేగం తగ్గితే అది ప్రాణాంతకంగా పరిణమించవచ్చు. అలాంటి పరిస్థితుల్లో పేస్‌మేకర్ ప్రాణాలను కాపాడుతుంది.
ఎందుకు అవసరం?
విశ్రాంతి లేకుండా శరీరభాగాలన్నింటికీ రక్తాన్ని సరఫరా చేసే గుండె కుడి, ఎడమ భాగాలలో రెండేసి గదులు ఉంటాయి. వీటిలో పైభాగంలో ఉన్న గదులను ఏట్రియా అనీ, కింద ఉన్న గదులను వెంట్రికిల్స్ అని అంటారు. శరీర భాగాల నుంచి గుండెకు వచ్చిన రక్తం గుండె కుడి ఏట్రియంలోకి చేరుతుంది. తర్వాత దానికిందనే ఉన్న కుడి వెంట్రికిల్‌లోకి వస్తుంది. అక్కడి నుంచి రక్తం ఊపిరితిత్తుల్లోకి పంప్ అవుతుంది. శ్వాసకోశాలలో ఆ రక్తం ఆక్సిజన్‌తో శుద్ధి అవుతుంది. ఇప్పుడు శుద్ధమైన రక్తం గుండెలోని ఎడమ ఏట్రియంలోకి వెళ్తుంది. అక్కడినుంచి ఎడమ వెంట్రికిల్‌లోకి చేరుకొంటుంది. ఎడమ వెంట్రికిల్ శుద్ధరక్తాన్ని శరీర భాగాలన్నింటికీ పంప్ చేస్తుంది. ఈ ప్రక్రియ సజావుగా జరిగేందుకుగాను గుండె సంకోచవ్యాకోచాలు చోటు చేసుకోవాలి. నిర్దిష్ట సమయానికి అందే విద్యుత్ ప్రేరణలతోనే ప్రతిసారీ ఈ ప్రక్రియ జరుగుతుంది.
ఈ విద్యుత్ ప్రేరణ కుడి ఏట్రియంలోని ‘సైనస్‌నోడ్’ దగ్గర మొదలవుతుంది. దాంతో ఏట్రియా సంకోచించి రక్తాన్ని వెంట్రికిల్స్‌లోకి పంప్ చేస్తాయి. ‘సైనస్ నోడ్’ నుంచి విద్యుత్ తరంగాలు... ప్రవాహకాలుగా పనిచేసే ప్రత్యేక కండరాల ద్వారా గుండెలోనే ఉన్న ఏట్రియో–వెంట్రిక్యులార్ నోడ్ (ఏవీఎన్)కు చేరతాయి. ఇక్కడి నుంచి విద్యుత్తు వెంట్రికిల్స్‌కు ప్రవహించి అవి సంకోచించేట్లు చేస్తుంది. దాంతో వాటిలోని రక్తం ముందుకు పంప్ అవుతుంటుంది. ఈ విధంగా విద్యుత్ తరంగాల చక్రభ్రమణంలా సాగే ఈ ప్రక్రియ మొత్తాన్ని ఒకసారి గుండె స్పందనగా పరిగణిస్తారు. ఈ విద్యుత్ ప్రవాహంలో ఎలాంటి ఆటంకం ఏర్పడినా అది గుండె స్పందనల్లో లోటుపాట్లకు కారణమవుతుంది. ఇలా గుండె స్పందనల్లో మార్పులు వస్తే దాన్ని అరిథ్మియా అంటారు.
గుండె విద్యుత్ వ్యవస్థలో సమస్యలన్నవి సైనస్ నోడ్, ఏవీ నోడ్ లేదా విద్యుత్ ప్రసారం చేసే కండరాలలో లోపాల వల్ల ఏర్పడతాయి. గుండెపోటు, గుండెకవాటాల సమస్యల వల్ల కూడా ఈ పరిస్థితి ఏర్పడవచ్చు. గుండెస్పందన సాధారణంగా ఉన్నప్పుడు శరీర భాగాలన్నింటికీ రక్తం సజావుగా సరఫరా అవుతూ ఉంటుంది. కానీ అది అతివేగంగా గానీ లేదా చాలా నెమ్మదిగా గానీ కొట్టుకుంటూ ఉంటే శరీర భాగాలకు రక్తసరఫరా తగ్గిపోతుంది. దీంతో మైకం కమ్మినట్లుగా ఉండటం, ఛాతీలో నొప్పి, శ్వాస తీసుకోవడం కష్టంగా ఉండటం, స్పృహతప్పడం కనిపిస్తాయి. ఇందుకు కారణమయ్యే అరిథ్మియాలకు సాధారణంగా మందులతోనే చికిత్స చేస్తారు. అయితే మందులకు లొంగకుండా గుండె స్పందనలు భారీగా తగ్గిన కేసుల్లో పేస్‌మేకర్‌ను సిఫార్సు చేస్తారు.
పేస్ మేకర్ అంటే?
ఇదొక చిన్న ఎలక్ట్రానిక్ పరికరం. ఇది అరిథ్మియా వ్యాధిగ్రస్తుల శరీరంలో ఇమిడిపోయి, ఆరోగ్యకరమైన వ్యక్తుల్లోలాగే గుండె స్పందనలు ఉండేలా నియంత్రిస్తుంటుంది. బ్యాటరీపై ఆధారపడి పనిచేసే ఈ చిన్న పరికరం గుండెకు కావాల్సిన విద్యుత్ ప్రేరణలను ఇస్తుంటుంది. దాంతో గుండె తగినన్ని సార్లు కొట్టుకుంటుంది. పేస్‌మేకర్‌లో పల్స్ జనరేటర్, ఇన్సులేటెడ్ లెడ్స్ అనే రెండు భాగాలు ఉంటాయి. వీటిలో పల్స్ జనరేటర్ ఓ చిన్న లోహపు డబ్బాలా ఉంటుంది.
దీనిలో అతి చిన్న ఎలక్ట్రానిక్ చిప్; దాదాపు 5 – 7 ఏళ్ల పాటు పనిచేయగల బ్యాటరీ ఉంటాయి. ఇవి రెండూ కలిసి ఓ చిన్న కంప్యూటర్‌లా పనిచేస్తాయి. ఇది గుండె స్పందన వేగాన్ని గమనించి తగినన్ని సార్లు కొట్టుకునేందుకు అవసరమైన విద్యుత్ ప్రేరణలను పంపిస్తుంది. లెడ్స్ అనే కొన్ని సన్నని కేబుల్స్ పల్స్ జనరేటర్ నుంచి బయలుదేరి గుండెలోని కండరాల వరకు ప్రయాణిస్తాయి. ఇవి గుండె ఎంత వేగంగా స్పందిస్తుందో పల్స్‌మేకర్‌కు తెలియజేస్తాయి. దానికి అనుగుణంగా పల్స్ జనరేటర్ నుంచి అవసరమైనన్ని విద్యుత్ ప్రేరణలను గుండె కండరాలకు చేరవేస్తాయి.
కొన్ని ముందస్తు పరీక్షలు అవసరం...
పేస్‌మేకర్ అమర్చడానికి ముందుగా పేషెంట్‌కు కొన్ని పరీక్షలు చేయించాలి. పేస్‌మేకర్ అమర్చడానికి రోగి అనుకూలుడా, కాదా అని నిర్ధారణ చేసుకునేందుకు డాక్టర్లు ఈ పరీక్షలను సిఫార్సు చేస్తారు. అందులో భాగంగా ఎకోకార్డియోగ్రామ్ ద్వారా గుండె కండరాల మందాన్ని గుర్తించాలి. శరీరంపై కొన్ని సెన్సర్లను అమర్చడం ద్వారా గుండె నుంచి వెలువడే విద్యుత్ సంకేతాలను గమనించే ఎలక్ట్రోకార్డియోగ్రామ్ పరీక్ష, వ్యాయామం చేసేటప్పుడు గుండె కొట్టుకోవడంలో మార్పులను గుర్తించే స్ట్రెస్ టెస్ట్ వంటి పరీక్షలు చేశాక... ఆ వ్యక్తి పేస్‌మేకర్ అమర్చడానికి అర్హుడా, కాదా నిర్ధారణ చేస్తారు.
పేస్‌మేకర్ అమర్చడానికి అనుకూలుడైన వ్యక్తికి అది అమర్చడానికి ముందురోజు రాత్రి తర్వాత ఘన, ద్రవ ఆహారాలు ఏమీ తీసుకోవద్దని చెబుతారు. అయితే డాక్టర్లు సిఫార్సు చేసిన మందులను మాత్రం వాడాల్సి ఉంటుంది. ఆ తర్వాత చిన్న శస్త్రవైద్య ప్రక్రియ ద్వారా ఛాతీ కుడిభాగానో లేదా ఎడమ భాగానో కాలర్‌బోన్‌కి దిగువన 2 – 3 అంగుళాల కింద గాటుపెట్టి అక్కడ దీన్ని అమర్చుతారు.
పేస్‌మేకర్ అమర్చుకున్నవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
పేస్‌మేకర్ అమర్చుకున్నవారు దాని నుంచి గరిష్ట ప్రయోజనం పొందేందుకు జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రతి ఏడాదీ రెండుసార్లు డాక్టర్‌ను కలిసి, దాని పనితీరు రోగి అవసరాలకు తగ్గట్లుగా ఉందో లేదో అని తెలుసుకోవాలి. డాక్టర్ తన దగ్గర ఉన్న కంప్యూటర్ మౌస్ లాంటి చిన్న పరికరం సహాయంతో రేడియో సిగ్నల్స్ ద్వారా పేస్‌మేకర్ సరిగా పనిచేస్తున్నదీ లేనిదీ పరిశీలించి, అవసరమైన మార్పులు (ట్యూనింగ్) చేస్తారు.
పేస్‌మేకర్ ఉన్న వ్యక్తి క్రమం తప్పకుండా తన నాడి (పల్స్)ని పరిశీలించుకుంటూ ఉండాలి. చాలా నెమ్మదిగా ఉన్నా లేదా అతివేగంగా ఉన్నా వెంటనే డాక్టర్‌ను కలవాలి. మైకం కమ్మినట్లు అనిపించినా, ఛాతీలో నొప్పిలేదా శ్వాస తీసుకోవడంలో కష్టంగా ఉన్నా వెంటనే డాక్టర్ దృష్టికి తీసుకెళ్లాలి. పేస్‌మేకర్‌లో మార్పులు చేయాల్సిన అవసరాన్ని ఆ లక్షణాలు సూచిస్తుండవచ్చు.
డా‘‘ వరదరాజశేఖర్,
సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ – ఎలక్రోఫిజియాలజిస్ట్,
యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్
Comments
Please login to add a commentAdd a comment