వెలుగు చాటు చీకటి
దేడ్ కహానీ - పేజ్ 3
జీవితపు పరుగుపందెంలో గమ్యం చేరాలనే తాపత్రయమే తప్ప పక్కన గాని, చుట్టూరా గాని జరుగుతున్న పరిణామాలు, మార్పులు ఏంటో ఎలా తెలుస్తుంది?
* చూస్తే వెలుగే కనిపిస్తుంది.
* కానీ దాని వెనుక అంతా చీకటే.
* పేజ్ 3 చెప్పే వాస్తవాలేంటి?
మనుషుల జనన, మరణాల మధ్య సమాజంలో మారుతున్న అంశాలెన్నో.
జీవితపు పరుగుపందెంలో గమ్యం చేరాలనే తాపత్రయమే తప్ప పక్కన గాని, చుట్టూరా గాని జరుగుతున్న పరిణామాలు, మార్పులు ఏంటో ఎలా తెలుస్తుంది? కొంతమంది న్యూస్‌పేపర్ చదువుతారు. కొంతమంది నెట్లో అప్ టు డేట్ ఫాలో అవుతారు. ఇంకొంత మంది నాటకాలు, పుస్తకాల ద్వారా తెలుసుకుంటారు.
ఆధునిక యుగంలో సమాజంలో వస్తున్న మార్పుల్ని కళ్లకి కట్టినట్టు చూపించే బలమైన సాధనం మాత్రం సినిమాలే. అవే మన న్యూస్‌పేపర్లు, మన పుస్తకాలు, మన ఇంటర్నెట్, అన్నీను. వాటిని బాగా చూపించే దర్శకులు దొరికితే ఆ సినిమాలు బాగా ఆడతాయి. లేకపోతే ఎలా వచ్చి, వెళ్లాయో తెలీకుండా వెళ్లిపోతాయి. సమాజాన్ని ప్రతిబింబించే సినిమా బాగా ఆడితే, ఎక్కువమంది ప్రేక్షకులు ఐడెంటిఫై అయ్యారు కాబట్టి, సమాజం అలా ఉందని అర్థం. లేదా ఎక్కువమంది అలా కోరుకోవడం వల్ల సమాజం అలా అవ్వబోతోందని అర్థం. అది సినిమాకి, సమాజానికి ఏళ్ల తరబడి అంతర్లీనంగా ఉన్న సంబంధం. వెండితెర మనం చదవక్కర్లేని న్యూస్ పేపరు. పెద్దగా చూసే టీవీ చానెల్. బ్రౌజ్ చెయ్యక్కర్లేని ఇంటర్నెట్.
ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే 2005లో ‘పేజ్ 3’ అని ఒక సినిమా రిలీజయ్యింది. అది ఇలాంటి సినిమానే. దాని దర్శకుడు మధుర్ భండార్కర్. సమకాలీన సమాజాన్ని ప్రతిబింబించే సినిమాలు మాత్రమే తీసే దర్శకుడు. చాందినీ బార్, పేజ్ 3, ట్రాఫిక్ సిగ్నల్, ఫ్యాషన్, హీరోయిన్ తదితర అద్భుత చిత్రాలు తీసిన వెండితెర న్యూస్ పేపర్/చానల్‌కి ఎడిటర్. 2005, జనవరి 21వ తేదీన విడుదలైన పేజ్ 3, కమర్షియల్‌గా సూపర్‌హిట్ సినిమాల కోవలోకి వచ్చేంత వసూళ్లు రాబట్టకపోయినా... ప్రేక్షకుల్ని మాత్రం వంద శాతం రీచ్ అయ్యింది.
2005 సంవత్సరానికి స్వర్ణకమలాన్ని గెల్చుకున్న జాతీయ ఉత్తమ చిత్రం ‘పేజ్ 3’. బెస్ట్ స్క్రీన్‌ప్లేకి, బెస్ట్ ఎడిటింగ్‌కి రెండు రజత కమలాలు గెల్చుకున్న చిత్రం పేజ్ 3. నాలుగు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు గెల్చుకున్న చిత్రం కూడా. మాధవీశర్మ ముంబైకి బతుకు తెరువు కోసం వచ్చిన మధ్యతరగతి యువతి. దీపక్ సూరి అనే సంపాదకుడు తన పేపర్లో ఆమెకి జర్నలిస్ట్‌గా ఉద్యోగం ఇస్తాడు. ఆ పేపర్లో పేజ్ 3 సెలెబ్రిటీల న్యూస్ కవరేజ్ చేస్తుంది. సిటీలో ఉన్న గ్లామరస్ పీపుల్ తాలూకు నైట్ లైఫ్ కవర్ చేసి రాయడమే ఆమె జాబ్.
మాధవి రూమ్మేట్ పెర్ల్ ఒక ఎయిర్‌హోస్టెస్. డబ్బున్న వ్యక్తినెవరినైనా చూసి పెళ్లి చేసుకుని సెటిలైపోవాలని కలలు కంటూ ఉంటుంది. గాయత్రి అనే మరో పేద యువతి హీరోయిన్ కావాలని కలలు కంటుంది. ఆమె కూడా మాధవి రూమ్మేట్గా చేరుతుంది. డబ్బు, స్టార్డమ్ రెండింటినీ కవర్ చేయాల్సిన జర్నలిస్ట్‌కి వాటికోసమే ఆరాటపడే రెండు పాత్రల్ని స్నేహితురాళ్లుగా తీసుకోవడం దర్శకుడిలోని గొప్పదనం.
రోహిత్ అనే స్టార్ హీరో గాయత్రిని మోసం చేసి కడుపు చేయడం, ఆమెని అబార్షన్ చేయించుకోమని ఫోర్స్ చేయడంతో ఆమె ఆత్మహత్యకి ప్రయత్నించడం, ఆ ప్రయత్నంలో ఆమె కడుపులోని శిశువు కడుపులోనే చని పోవడం జరుగుతాయి. ఈ కథనాన్ని ప్రచురించి రోహిత్‌ని ఎండగడదామని ప్రయత్నించిన మాధవికి బాస్ నుంచి వ్యతిరేకత వస్తుంది. ఆ ఆర్టికల్స్‌ని చించేయడమే కాక, మాధవితో రోహిత్‌కి బలవంతంగా క్షమాపణలు కూడా చెప్పిస్తాడు బాస్. ఈలోగా పెర్ల్ ఒక ముసలి ధనవంతుడిని పెళ్లి చేసుకుని అమెరికా చెక్కేస్తుంది. మాధవి ప్రేమించిన స్నేహితుడు అభిజిత్ ‘గే’ అని తెలుస్తుంది. దాంతో చాలా బాధపడుతుంది. సెలెబ్రిటీ లైఫ్‌లో పైకి కనపడినంత సెలెబ్రేషన్ కాని, వైబ్రేషన్ కాని లోపల ఉండవని మాధవికి అర్థమౌతుంది.
పేజ్ 3 నుంచి క్రైమ్ న్యూస్‌కి తన ఉద్యోగం మార్పించుకుంటుంది మాధవి. ఆ వృత్తిలో వినాయక్ అనే ఒక ఏసీపీ పరిచయమవుతాడు. ఆయన సహకారంతో చైల్డ్ ట్రాఫికింగ్ సమస్యని వెలుగులోకి తెచ్చి పిల్లల్ని మాఫియా నుంచి కాపాడుతుంది. గాయత్రి ఒక దర్శకుడి కోరిక తీర్చి, అతని తర్వాతి సినిమాలో హీరోయిన్గా అవకాశం సంపాదిస్తుంది. ఇటు మాధవి ఏమో క్రైమ్ న్యూస్ కూడా తన పత్రికలో వేయించలేకపోతుంది. దాంతో ఆమె ఉద్యోగం పోతుంది.
ఒక జర్నలిస్ట్ కోణం లోంచి డబ్బు, పరపతి, తారాపథం వీటిని చూస్తే చీకటిగానూ, ఛండాలంగానూ మాత్రమే కనపడతాయి.
కానీ వాటిని సాధించాలనే ఆశయం ఉన్న పాత్రల్ని, ఆ ప్రయత్నంలో వాటి కష్టాల్ని చూస్తే మానవీయ కోణంలో ఇవి మంచిగా కనపడతాయి. రెంటినీ బ్యాలెన్స్ చేశాడు దర్శకుడు - ఈ కథకి తను ఎంచుకున్న పాత్రలు, వాటి తీరుతెన్నుల ద్వారా. పోస్టర్ చూస్తే ఒక సాధారణమైన, యువతని ఆకర్షించడానికే తీసిన సినిమాలా కనిపిస్తుంది కానీ సినిమా చూస్తే మేధావి వంతమైన సినిమాలా కనిపిస్తుంది. ‘నైట్ లైఫ్’ అనే వెస్టర్న్ కల్చర్ భారతీయ సమాజం నలభై ఏళ్ల క్రితం నిద్ర పోతుండగా ప్రవేశించి వేళ్లూనుకుని, మర్రిచెట్టైపోయింది.
ఇప్పుడు అన్ని ప్రధాన నగరాల్లోనూ డబ్బున్న వారి పిల్లలు, రాజకీయ నాయకులు, సెలెబ్రిటీలు, అందరూ ఈ నైట్ లైఫ్ అలవాటుదారులే. దాన్ని కథావస్తువుగా తీసుకోవడమే దర్శకుడి నైపుణ్యం. ప్రముఖ బెంగాలీ నటి, దర్శకురాలు అపర్ణాసేన్ కూతురు కొంకణాసేన్ శర్మ పేజ్ 3 చిత్ర కథానాయిక. ఈమె 2002లో నటించిన ‘మిస్టర్ అండ్ మిసెస్ అయ్యర్’ అనే బాలీవుడ్ ఆంగ్ల చిత్రం (తల్లి అపర్ణాసేన్ రచయిత్రి, దర్శకురాలు ఈ చిత్రానికి) కొంకణాసేన్కు జాతీయ ఉత్తమ నటి అవార్డు తెచ్చిపెట్టింది. పేజ్ 3తో పాటు అది కూడా చూసి తీరవలసిన చిత్రం. సహజమైన సినిమాలు ఇష్టపడే ప్రేక్షకుల కోసమే ఈ చిత్రాలు. వచ్చే వారం మరో మంచి సినిమాతో కలుద్దాం.
-వి.ఎన్.ఆదిత్య, సినీ దర్శకుడు