ఏకరువు పెడతాం..
నేటి నుంచి ప్రారంభం కానున్న శాసనసభ బడ్జెట్ సమావేశాలపై జిల్లా ప్రజలు కోటి ఆశలు పెట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో తొలి బడ్జెట్ సమావేశాలు కావడంతో వీటికి ఎనలేని ప్రాధాన్యత ఏర్పడింది. జిల్లాలోని ఆయా నియోజకవర్గాల శాసనసభ్యులు తమ గళాలు వినిపించేందుకు సిద్ధమవుతున్నారు. నియోజకవర్గ సమస్యలను ఏకరువు పెట్టాలనే యోచనలో ఉన్నారు. జిల్లావ్యాప్తంగా కరువు విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో రైతులు, ప్రజలను ఆదుకోవాలని కోరనున్నట్లు పేర్కొన్నారు.
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: నేటి నుంచి ప్రారంభం కానున్న శాసన సభ తొలిబడ్జెట్ సమావేశాలకు జిల్లాలోని పది నియోజకవర్గాల ఎమ్మెల్యేలు సిద్ధమయ్యారు. తమ నియోజకవర్గాల్లో నెలకొన్న సమస్యలను అసెంబ్లీ దృష్టికి తీసుకెళ్లేందుకు సమాయత్తం అయ్యారు. బడ్జెట్‌పై కోటి ఆశలతో ఉన్న జిల్లా ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలని కోరనున్నట్లు పేర్కొన్నారు. అసెంబ్లీలో జిల్లా శాసనసభ్యులు ప్రస్తావించ దలిచిన వివిధ అంశాలు..
వర్షాభావ పరిస్థితులు జిల్లాను అతలాకుతలం చేస్తుండగా.. విద్యుత్ కోతలతో బోర్లు, బావుల కింద ఉన్న పంటలు సైతం ఎండిపోయాయని అసెంబ్లీ దృష్టికి తేనున్నారు. పండించిన పంటలకు కూడా గిట్టుబాటు ధరలు లేవని సూచించనున్నారు. సీసీఐ కొనుగోళ్లు ప్రారంభించినా నామమాత్రంగా కొనసాగుతున్నాయని తెలపనున్నారు. వ్యవసాయ రుణాల మాఫీ, కొత్త రుణాల మంజూరు సంబంధిత అంశాలపై మాట్లాడనున్నారు.
జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులపై గత ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టాలని నిర్ణయించాయి. ప్రాజెక్టు పనులకు రూపకల్పన కూడా చేశాయి. వాటిృలో సగం ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు. దుమ్ముగూడెం (రాజీవ్‌సాగర్) ప్రాజెక్టు, ఇందిరాసాగర్, మోడికుంట, పాలెంవాగు ప్రాజెక్టులు ఇంకా ఆచరణకు నోచుకోని విషయాన్ని ప్రస్తావిస్తామంటున్నారు.
జిల్లాను రెండు, మూడునెలలుగా విషజ్వరాలు వెంటాడుతున్నాయి. దాదాపు 30మందికి పైగా మరణించారు. మన్యం పూర్తిగా మంచానపడింది. జిల్లా వైద్యారోగ్యశాఖకు ‘దోమ’కుట్టినట్లయినా లేదని ప్రస్తావించనున్నారు. మన్యాన్ని వణికిస్తున్న విషజ్వరాలు మైదానానికీ వ్యాప్తి చెందినా వైద్యారోగ్యశాఖ మాత్రం నిర్లక్ష్యం వీడలేదని తెలపనున్నారు.
జిల్లా పేరు ప్రఖ్యాతులను జాతీయస్థాయిలో ఇనుమడింపజేసిన గ్రానైట్ పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోయింది. వేలాది మంది ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి పొందే ఈ పరిశ్రమ విషయంలో ప్రభుత్వ ఉదాసీనతను ఎండగట్టుతామంటున్నారు.
ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్, కాంగ్రెస్, టీడీపీ, సీపీఎం శాసనసభ్యులు గళం విప్పనుండగా... అధికార పార్టీ టీఆర్ఎస్ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు సమావేశాలకు హాజరవుతున్నారు.
ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తాం: తాటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే అశ్వారావుపేట
ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా నిధులు కేటాయించాలి. జిల్లాలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులకు మోక్షం కలిగించాలి. లేనిపక్షంలో ప్రభుత్వాన్ని బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా నిలదీస్తాం. ప్రభుత్వం మాటలు చెప్పినంత వేగంగా పనులు చేయడంలేదు.
ముంపు మండలాల ఉద్యోగులను తెలంగాణకే కేటాయించేందుకు ప్రభుత్వం తగిన చొరవ చూపాలి. పేదవాడి గుండెల్లో దేవుడిగా ఉన్న వైఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి ఇప్పుడు జరగాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు.
ప్రాజెక్టు నిర్మాణంలో నిర్లక్ష్యాన్ని ఎండగడతాం: పాయం వెంకటేశ్వర్లు, పినపాక ఎమ్మెల్యే
జిల్లా సమగ్రాభివృద్ధికి ఉపయోగపడే దుమ్ముగూడెం రాజీవ్‌సాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో పాలకుల నిర్లక్ష్యాన్ని ఎండగడుతాం. పోడు భూములను సాగుచేసుకుంటున్న అమాయక గిరిజనులపై అటవీశాఖ అధికారులు అమానుషంగా వ్యవహరిస్తూ కేసులతో వేధిస్తున్నారు. పోడు గిరిజనులకు పట్టాలివ్వాలని డిమాండ్ చేస్తాం. గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని కోరతాం.
పేద ప్రజల బాధలే కాంగ్రెస్ అజెండా: భట్టి విక్రమార్క, మధిర ఎమ్మెల్యే
రాష్ట్ర ప్రజల అవసరాలు, వారి బాధలే శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ అజెండా. గత శాసనసభలో చేసిన రెండు కీలక తీర్మానాల్లో తెలంగాణ విభజన బిల్లు, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ అంశాలు కీలకం. తెలంగాణ సిద్ధించిన తర్వాత కూడా మూడో జోన్ నుంచి సాగర్ ఆయకట్టు మండలాలకు నీరు ఇవ్వటం దారుణం. రెండో జోన్ నుంచి రైతులకు సాగర్ జలాలు పంపిణీ చేయాలి. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను సక్రమంగా ఖర్చుచేయడం లేదు.
స్మార్ట్ సిటీ కోసం రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఎంతో తేల్చుకుంటాం: పువ్వాడ అజయ్‌కుమార్, ఖమ్మం ఎమ్మెల్యే (కాంగ్రెస్)
ఖమ్మం నగరాన్ని స్మార్ట్ సిటీగా మార్చడానికి కేంద్రం ఇచ్చే నిధులు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎంత మేరకు మ్యాచింగ్గ్రాంట్గా కేటాయిస్తుందో చెప్పాలని డిమాండ్ చేస్తాం. ఖమ్మం నగరాభివృద్ధి తన వ్యక్తిగత బాధ్యతగా చెప్పిన సీఎం కేసీఆర్ నగరాభివృద్ధి కోసం ఎంతమేరకు నిధులు కేటాయిస్తారో తేల్చిచెప్పాలి.
నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు సాధిస్తా: కోరం కనకయ్య, ఇల్లెందు ఎమ్మెల్యే (టీఆర్ఎస్)
గిరిజన నియోజకవర్గం కావడంతో దశాబ్దాలుగా ఇల్లెందు నియోజకవర్గంపై పాలకులు చిన్నచూపు చూశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం టీఆర్ఎస్లో చేరాను. ఈ ప్రాంత అభివృద్ధికి కావాల్సిన నిధులను సాధించి తీరుతా. బయ్యారంలో మైనింగ్ ఫ్యాక్టరీ నిర్మాణం చేయడానికి ప్రభుత్వ సహకారాన్ని కోరుతూ కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తా.
ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా కేటాయింపులుండాలి: సున్నం రాజయ్య, భద్రాచలం ఎమ్మెల్యే
తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా బడ్జెట్ కేటాయింపు ఉండాలి. విద్య, వైద్యం అందుబాటులోకి తెస్తామన్న ప్రభుత్వం దాని ఊసే ఎత్తడం లేదు. పోడు భూముల సమస్య జిల్లాలోని గిరిజనులను తీవ్ర ఇబ్బంది పెడుతోంది. భద్రాచలం నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న మోడికుంట ప్రాజెక్టు, పాలెంవాగు ప్రాజెక్టు, వద్దిపేట ఎత్తిపోతల పథకం తక్షణం పూర్తిచేయాలి. విషజ్వరాలతో అల్లాడుతున్న గిరిజనులను ప్రభుత్వం కన్నెత్తి చూడలేదు. దీనిపై ప్రభుత్వాన్ని నిలదీస్తాం.
ప్రాజెక్టులు పూర్తి చేయాలని కోరతాం: జలగం వెంకట్రావు, కొత్తగూడెం ఎమ్మెల్యే
జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాల్సిన ఆవశ్యకతను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా. కొత్తగూడెంలో పవర్ ప్రాజెక్టు నిర్మాణం వేగవంతం చేసేందుకు ప్రభుత్వ సహకారం కోరతా. తాగునీటి అవసరాల ప్రాధాన్యతను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా. పారిశ్రామికాభివృద్ధి చెందుతున్న కొత్తగూడెంకు అనేక హంగులు కల్పించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ వైద్య కళాశాల, మైనింగ్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా.
రుణాలమాఫీపై గందరగోళాన్ని ప్రభుత్వం తొలగించాలి: సండ్ర వెంక టవీరయ్య, సత్తుపల్లి ఎమ్మెల్యే (టీడీపీ)
రుణాల మాఫీకి సంబంధించిన గందరగోళాన్ని ప్రభుత్వం తక్షణం తొలగించాలి. 2009-11 మధ్య ఉన్న రుణాలను రీషెడ్యూల్ చేయాలని నిర్ణయించి ఖమ్మంను అప్పటి ప్రభుత్వం కరవు జిల్లాగా ప్రకటించింది. రీషెడ్యూల్కు రుణమాఫీ వర్తించదని ప్రభుత్వం మాటమార్చడం రైతులను మోసగించడమే. జిల్లాలో రూ.150 కోట్ల మేర రైతులకు రుణమాఫీ కాకుండా పోతోంది.
రాబోయేది ప్రజామోద బడ్జెట్: బాణోత్ మదన్‌లాల్, వైరా ఎమ్మెల్యే (టీఆర్ఎస్)
ముఖ్య మంత్రి కేసీఆర్ సారథ్యంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న బడ్జెట్ ప్రజామోదంగా ఉంటుందని భావిస్తున్నా. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో సాగు, తాగు నీటి సమస్యపరిష్కారానికి కృషి చేస్తాను. పలు సంక్షేమ అభివృద్ధి పథకాలు, సంక్షేమ రంగాల గురించి ప్రభుత్వానికి నివేదిస్తాను. దాదాపు 30 వేల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు , 10 మండలాల ప్రజలకు తాగు నీరు అందిస్తున్న వైరా రిజర్వాయర్‌ను సాగర్ జలాలతో నింపడానికి కృషి చేస్తాను. 7 టీఎంసీల నీటిని స్థిరీకరించడానికి కృషి చేస్తాను.
విద్యుత్ సమస్యపై నిలదీస్తాం: రాంరెడ్డి వెంకటరెడ్డి, పాలేరు ఎమ్మెల్యే
తీవ్ర వర్షాభావ పరిస్థతుల నేపథ్యంలో పంటలు ఎండిపోతున్నాయి. విద్యుత్ సమస్య రైతును వెంటాడుతోంది. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా రుణమాఫీ చేయాలి. వ్యవసాయానికి ఏడు గంటలు నిరంతరాయంగా విద్యుత్ ఇవ్వాలి. మూడు లక్షల పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలి. గతంలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ళకు కూడా ఈ నిధులు ఇస్తారా? లేక కొత్తగా నిర్మించే వాటికే మంజూరు చేస్తారా? అనే విషయాలపై అసెంబ్లీలో స్పష్టత ఇవ్వాలి.