Palli
-
అమ్మో! మొనగాడే!
మీకు పల్లీలంటే ఇష్టమేనా? ఊరికే ఇష్టమని తల ఊపడం కాదు... నిమిషానికి ఎన్ని పల్లీలు ఒలవగలరో చెప్పండి. పల్లీలంటే వీజీనే ఒలవడం. అదే వాల్నట్సయితే..? పల్లీలకంటే ఎక్కువరుచిగా ఉంటాయి కాబట్టి, ఇంకాసిని ఎక్కువే లాగించగలరు. ఆగండాగండి... వొలిచి పెట్టిన వాల్నట్స్ కాదు... వొలుచుకుని తినాల్సొస్తే..? ఎన్ని వలుస్తారు? ఈ వొలుపుడు సంగతిఇప్పుడెందుకు అంటారా? అక్కడికే వస్తున్నాం... వాల్నట్స్ అంటే తెలుసు కదా... అదేనండీ, ఆక్రోటు కాయలు. వేరుసెనక్కాయల మాదిరిగా కాదు... వాటి పై పెంకు బాగా గట్టిగా ఉంటుంది.పగల గొట్టడం మామూలు విషయం కాదు. అలాంటిది ఒక్క నిమిషంలో 212 వాల్‌నట్స్‌ను పగలగొట్టి గిన్నిస్‌బుక్ రికార్డు సృష్టించాడు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పి. ప్రభాకర్ రెడ్డి అనే 35సంవత్సరాల మార్షల్ ఆర్ట్స్ మొనగాడు. ఇతను బారులుగా పోసిన వాల్‌నట్స్‌ను పటాపటా పగలగొట్టేసి అంతకుముందు పాకిస్తాన్‌కు చెందిన మహమ్మద్ రషీద్ అనే వ్యక్తి సృష్టించినరికార్డును బద్దలుగొట్టాడు. అన్నట్టు మన ప్రభాకర్ రెడ్డి ఇలా వాల్‌నట్స్‌ను పగలగొట్టడం 2010 నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాడట. ఇతను వాల్‌నట్స్‌పై వీర విహారం చేసిన వీడియోను ఇప్పటికి కొన్ని లక్షలమంది ఆసక్తిగా చూశారట. బాగుంది కదూ! -
పల్లీ... రుచి మనది కాదా?!
తిండి గోల పొడి చేసి పచ్చడి నూరినా, బెల్లం కలిపి అచ్చులో పోసినా, నూనెలో దోరగా వేయించినా... పల్లీలు... అదే వేరుశనగ గింజల రుచే వేరు. వంటకాల్లో పసందైన దినుసుగా భారతీయుల చేత ప్రశంసలు అందుకున్న పల్లీ పుట్టినిల్లు మన దేశం కాదంటే ఆశ్చర్యపోవాల్సిందే! కాని ఇది నిజం. సుమారు 7,600 ఏళ్ల కిందటే పెరూలో పల్లీ పురుడు పోసుకుందని పురాతత్వశాస్త్ర నిపుణులు కనిపెట్టినట్టు చరిత్ర చెబుతోంది. అయితే దీనిమీదా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. లెగ్యూమ్ జాతికి చెందిన పల్లీలు బ్రెజిల్లో పుట్టి ప్రపంచమంతటా వ్యాపించాయి అని మరో కథనమూ ఉంది. ఏది ఏమైనా పల్లీలు లేకుండా మనకు రోజు గడవదంటే మాత్రం ఒప్పుకొని తీరాల్సిన మాట. అంతగా పల్లీలను మన జీవనంలో కలిపేసుకున్నాం. ఆంగ్లంలో పీనట్, గ్రౌండ్నట్ అని పేరున్న పల్లీల ఉత్పిత్తిలో చైనా అగ్రస్థానంలో ఉండగా, మన దేశం రెండవస్థానంతో సరిపెట్టుకుంది.