
పల్లీ... రుచి మనది కాదా?!
తిండి గోల
పొడి చేసి పచ్చడి నూరినా, బెల్లం కలిపి అచ్చులో పోసినా, నూనెలో దోరగా వేయించినా... పల్లీలు... అదే వేరుశనగ గింజల రుచే వేరు. వంటకాల్లో పసందైన దినుసుగా భారతీయుల చేత ప్రశంసలు అందుకున్న పల్లీ పుట్టినిల్లు మన దేశం కాదంటే ఆశ్చర్యపోవాల్సిందే! కాని ఇది నిజం. సుమారు 7,600 ఏళ్ల కిందటే పెరూలో పల్లీ పురుడు పోసుకుందని పురాతత్వశాస్త్ర నిపుణులు కనిపెట్టినట్టు చరిత్ర చెబుతోంది. అయితే దీనిమీదా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.
లెగ్యూమ్ జాతికి చెందిన పల్లీలు బ్రెజిల్‌లో పుట్టి ప్రపంచమంతటా వ్యాపించాయి అని మరో కథనమూ ఉంది. ఏది ఏమైనా పల్లీలు లేకుండా మనకు రోజు గడవదంటే మాత్రం ఒప్పుకొని తీరాల్సిన మాట. అంతగా పల్లీలను మన జీవనంలో కలిపేసుకున్నాం. ఆంగ్లంలో పీనట్, గ్రౌండ్‌నట్ అని పేరున్న పల్లీల ఉత్పిత్తిలో చైనా అగ్రస్థానంలో ఉండగా, మన దేశం రెండవస్థానంతో సరిపెట్టుకుంది.