The taste
-
కరివేపాకు తీసిపారేయకండి
ఉప్మాలో కరివేపాకులా అంటూ ఉంటారు కానీ, కరివేపాకు లేకుంటే ఉప్మా చెయ్యడమే మానేస్తారు గృహిణులు. పులుసు, కూర, చారు, పులిహోర, సాంబారు, పచ్చడి... వీటిలో ఏ ఒక్కదానిలోనూ కరివేపాకు లేనిదే రుచి పుట్టదు, సువాసన రాదు. సుగంధ ద్రవ్యాలలో దీని తర్వాతి స్థానమే దేనిదైనా సరే! ఒకప్పుడు పల్లెటూళ్లలో ఇంచుమించు ప్రతి ఇంటి పెరట్లోనూ కరివేపాకు చెట్టు ఉండేది. అన్నట్టు కరేపాకులో ఎన్నో ఔషధ విలువలున్నాయి. ఆయుర్వేదంలో అయితే దీని ఆకులు, కాయలు, పండ్లు, గింజలు, బెరడు, వేరు... అన్నింటినీ ఉపయోగిస్తారు. ఇటీవలకాలంలో సౌందర్యసాధనంగానూ దీనిని ఉపయోగిస్తున్నారు. స్థూలకాయంతో బాధపడేవారు రోజూ ఓ టేబుల్ స్పూన్ కరేపాకు పొడిని లేదా ముద్దను మజ్జిగతో పాటూ తీసుకుంటూ ఉంటే స్థూలకాయమే కాదు... దానిమూలంగా వచ్చే మధుమేహం కూడా తగ్గుతుందట. ఇండియా, శ్రీలంకలలో విరివిగా కనిపించే కరివేప... తూర్పు ఆసియా, దక్షిణాసియా, ఆస్ట్రేలియా ఖండాలలోని అడవులలో విపరీతంగా కనిపిస్తుంది. అన్నట్టు ఆంగ్లంలో దీన్ని కర్రీ లీవ్స్ అంటారని అందరికీ తెలుసు కానీ, స్వీట్ నీమ్ లీవ్స్ అనీ, చైనీస్ బాక్స్ ట్రీ అని కూడా అంటారు. అలాగే తెలుగులో దీన్ని పూల వెలగ అని కూడా అంటారట. తిండి గోల -
పేదింటి పెరటి కాయ .. సొరకాయ...
తిండి గోల సొరకూయతో పులుసు పెడితే ఒక రుచి, సాంబారులో వేస్తే మరో రుచి, టొమాటో వేసి కూర వండితే ఆహా రుచి, వడియాలు పెడితే కరకరలాడుతూ అన్నంలోకి నంజుకుంటే అదో రుచి, స్వీట్లు చేస్తే మహా రుచి... తెలంగాణ రాష్ట్రంలో అనపకాయగా పేరున్న సొరకాయ మన దేశంలో వేదకాలం నుండి సాగుచేస్తున్న జాతి కూరగాయ. ఇంటి పెరట్లో పెట్టి వదిలేసినా, ఏ మాత్రం పోషణలేకపోయినా విరగగాస్తుంది. అన్ని నేలల్లోనూ ఏపుగా పెరిగే గుణం సొరకు ఉంది. దీని మూలాలు ఆఫ్రికాలో అని చెప్పినప్పటికీ క్రీ.పూ 11 వేల సంవత్సరాంతంలో మన దగ్గర సొరకాయ సాగు జరిగిందని పురాతత్వ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రొటీన్లు, పిండిపదార్థాలు, ఎ-సి విటమిన్లు, ఖనిజలవణాలు పుష్కలంగా ఉన్న సొరకాయ శరీర ఉష్ణాన్ని తగ్గిస్తుంది. ఎండిన సొరకాయ బుర్రలో నీళ్లు పోసి, ఉంచితే కాసేపటికే చల్లగా అవుతాయి. అందుకే పూర్వం రోజుల్లో పొలాలకు వెళ్లేవారు తాగడానికి నీళ్లు తీసుకెళ్లాలంటే వీటినే వాడేవారు. ఇక గుండ్రని సొరబుర్రలనైతే వీణలుగా కూడా ఉపయోగిస్తారు. -
లాలాజలంతోనే రుచి!
మెడి క్షనరీ ఏదైనా పదార్థాన్ని నాలుకపై పెట్టగానే టేస్ట్బడ్స్తో రుచి తెలిసిపోతుందని మీరు అనుకుంటున్నారా? అది ఒక అపోహ మాత్రమే. నిజానికి మనకు రుచి తెలిసేది లాలాజలం వల్లనే. ఒక పదార్థం లాలాజలంలో కరిగిన తర్వాతే, మన నాలుకపై ఉండే రుచిమొగ్గలు (టేస్ట్బడ్స్) వాటిని గ్రహించగలుగుతాయి. మనకు తెలియకుండానే ప్రతి రోజూ ఒక లీటర్ నుంచి 1.6 లీటర్ల వరకు లాలాజలం స్రవిస్తూ ఉంటుంది. వాంతి కావడానికి ముందుగా లాలాజలం ఎక్కువగా స్రవిస్తుంది. అంటే... లాలాజలం నుంచే జీర్ణప్రక్రియ మొదలవుతుంది కాబట్టి జీర్ణప్రక్రియను వేగవంతం చేసేందుకు అలా ఎక్కువగా లాలాజలం ఊరుతుంది. ఒకవేళ ఆ ప్రక్రియ సఫలం కానప్పుడు వాంతి (వామిటింగ్) అనే ప్రక్రియ ద్వారా జీర్ణం చేయలేని పదార్థాన్ని శరీరం బయటకు పంపేస్తుందన్నమాట. -
పల్లీ... రుచి మనది కాదా?!
తిండి గోల పొడి చేసి పచ్చడి నూరినా, బెల్లం కలిపి అచ్చులో పోసినా, నూనెలో దోరగా వేయించినా... పల్లీలు... అదే వేరుశనగ గింజల రుచే వేరు. వంటకాల్లో పసందైన దినుసుగా భారతీయుల చేత ప్రశంసలు అందుకున్న పల్లీ పుట్టినిల్లు మన దేశం కాదంటే ఆశ్చర్యపోవాల్సిందే! కాని ఇది నిజం. సుమారు 7,600 ఏళ్ల కిందటే పెరూలో పల్లీ పురుడు పోసుకుందని పురాతత్వశాస్త్ర నిపుణులు కనిపెట్టినట్టు చరిత్ర చెబుతోంది. అయితే దీనిమీదా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. లెగ్యూమ్ జాతికి చెందిన పల్లీలు బ్రెజిల్లో పుట్టి ప్రపంచమంతటా వ్యాపించాయి అని మరో కథనమూ ఉంది. ఏది ఏమైనా పల్లీలు లేకుండా మనకు రోజు గడవదంటే మాత్రం ఒప్పుకొని తీరాల్సిన మాట. అంతగా పల్లీలను మన జీవనంలో కలిపేసుకున్నాం. ఆంగ్లంలో పీనట్, గ్రౌండ్నట్ అని పేరున్న పల్లీల ఉత్పిత్తిలో చైనా అగ్రస్థానంలో ఉండగా, మన దేశం రెండవస్థానంతో సరిపెట్టుకుంది.