
కరివేపాకు తీసిపారేయకండి
ఉప్మాలో కరివేపాకులా అంటూ ఉంటారు కానీ, కరివేపాకు లేకుంటే ఉప్మా చెయ్యడమే మానేస్తారు గృహిణులు. పులుసు, కూర, చారు, పులిహోర, సాంబారు, పచ్చడి... వీటిలో ఏ ఒక్కదానిలోనూ కరివేపాకు లేనిదే రుచి పుట్టదు, సువాసన రాదు. సుగంధ ద్రవ్యాలలో దీని తర్వాతి స్థానమే దేనిదైనా సరే! ఒకప్పుడు పల్లెటూళ్లలో ఇంచుమించు ప్రతి ఇంటి పెరట్లోనూ కరివేపాకు చెట్టు ఉండేది. అన్నట్టు కరేపాకులో ఎన్నో ఔషధ విలువలున్నాయి. ఆయుర్వేదంలో అయితే దీని ఆకులు, కాయలు, పండ్లు, గింజలు, బెరడు, వేరు... అన్నింటినీ ఉపయోగిస్తారు. ఇటీవలకాలంలో సౌందర్యసాధనంగానూ దీనిని ఉపయోగిస్తున్నారు.
స్థూలకాయంతో బాధపడేవారు రోజూ ఓ టేబుల్ స్పూన్ కరేపాకు పొడిని లేదా ముద్దను మజ్జిగతో పాటూ తీసుకుంటూ ఉంటే స్థూలకాయమే కాదు... దానిమూలంగా వచ్చే మధుమేహం కూడా తగ్గుతుందట. ఇండియా, శ్రీలంకలలో విరివిగా కనిపించే కరివేప... తూర్పు ఆసియా, దక్షిణాసియా, ఆస్ట్రేలియా ఖండాలలోని అడవులలో విపరీతంగా కనిపిస్తుంది. అన్నట్టు ఆంగ్లంలో దీన్ని కర్రీ లీవ్స్ అంటారని అందరికీ తెలుసు కానీ, స్వీట్ నీమ్ లీవ్స్ అనీ, చైనీస్ బాక్స్ ట్రీ అని కూడా అంటారు. అలాగే తెలుగులో దీన్ని పూల వెలగ అని కూడా అంటారట.
తిండి గోల