అందుబాటులోకి ఫ్రీవే
సాక్షి, ముంబై: దశాబ్దాలుగా వే ధిస్తున్న ట్రాఫిక్ జామ్ సమస్య నుంచి దక్షిణ ముంబైవాసులకు విముక్తి లభించనుంది. ఇకపై దక్షిణ ముంబై నుంచి ఘాట్కోపర్కు వెళ్లాలంటే కేవలం అరగంట చాలు. ఎందుకంటే పశ్చిమ శివారులోని ఖేర్వాడి ప్రాం తంలో నిర్మించిన ఫ్లైఓవర్, పాంజర్పోల్-ఘాట్కోపర్ లింకు రోడ్డులను సోమవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ప్రారంభించనున్నారు. ఖేర్వాడి ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడంవల్ల దహిసర్ నుంచి నేరుగా వర్లీ వరకు ఎలాంటి అంతరాయం లేకుండా రాకపోకలు సాగించవచ్చు. పాంజర్పోల్-ఘాట్కోపర్ లింకు రోడ్డు వంతెన వల్ల దక్షిణ ముంబై నుంచి తూర్పు శివారు ప్రాంతం వరకు కేవలం అర గంటలోపే చేరుకోవచ్చు. ఈ వంతెన కారణంగా ప్రముఖులతోపాటు సాధారణ ప్రజల విలువైన సమయం ఎంతో ఆదా కానుంది. ఖేర్వాడి ఫ్లైఓవర్ 580 మీటర్ల పొడవుంది. ఈ వంతెనను వినియోగించే వాహన చోదకులకు ఖేర్వాడి జంక్షన్ వద్ద ఎదురయ్యే భారీ ట్రాఫిక్ జామ్ సమస్య నుంచి విముక్తి లభించనుందని ఎమ్మెమ్మార్డీయే వర్గాలు పేర్కొన్నాయి.
ఈస్టర్న్ ఫ్రీవే మార్గంపై నిర్మించిన పాంజర్పోల్-ఘాట్కోపర్ లింకు వంతెన 2.80 కి.మీ. పొడవుంది. కొద్ది రోజులుగా ఇక్కడ పనులు జరుగుతున్నాయి. ఎట్టకేలకు పనులు పూర్తిచేసుకుని ప్రారంభానికి సిద్ధమైంది. దక్షిణ ముంబై-పాంజర్పోల్ వరకు ఇది వరకే 13.60 కి.మీ. పొడవైన వంతెన వినియోగంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పు డు 2.80 కి.మీ. వంతెన కూడా సిద్ధం కావడంతో మొత్తం 16.40 కి.మీ. పొడవైన వంతెన వినియోగంలోకి రానుంది. అత్యంత పొడవైన ఈ వంతెన అం దుబాటులోకి రావడంవల్ల దక్షిణ ముంబై నుంచి నేరుగా తూర్పు శివారు ప్రాంతం వరకు ఎలాంటి అడ్డులేకుండా కేవలం అరగంట లోపు చేరుకోవచ్చని అధికార వర్గాలు తెలిపాయి. కాగా ఖేర్వాడి వంతెనను సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు, పాంజర్పోల్-ఘాట్కోపర్ లింకు రోడ్డును మూడున్నర గంటలకు సీఎం చవాన్ ప్రారంభిస్తారని ఎమ్మెమ్మార్డీయే వర్గాలు తెలిపాయి.