parnapalli
-
దక్షిణ కాశీ.. కోనమల్లేశ్వర క్షేత్రం
అనంపురము – వైఎస్సార్ జిల్లాల సరిహద్దులో వెలసిన కోనమల్లేశ్వర క్షేత్రం దక్షిణ కాశీగా వెలుగొందుతోంది. కొలిచిన భక్తులకు కొంగు బంగారం ఇచ్చే ఇలవేల్పుగా ఇక్కడ పరమ శివుడు విరాజిల్లుతున్నాడు. వైఎస్సార్ జిల్లా లింగాల మండలం పార్నపల్లికి మూడు కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది. పూర్వం భృగు మహర్షి ఈ ప్రాంతంలో శివలింగాన్ని ప్రతిష్టించుకుని ప్రత్యేక పూజలు చేస్తూ, ఇక్కడ తపస్సు చేస్తుండేవాడని, కాలక్రమంలో జయమేజయుడు అనే చక్రవర్తి ఆలయాన్ని నిర్మించాడని ప్రతీతి. సీతారామలక్ష్మణులు వనవాస కాలంలో ఆలయ పరిసరాల్లో సంచరించినందున భక్తులు ఆలయ పరిసరాల్లోకి చేరగానే సీతాదేవి వర్ణం పసుపు రంగుగా మారడం విశేషం. ఇక్కడ ఐదు శివ లింగాలు ఉండటం, నంది విగ్రహం నోట్లో నుంచి కోనేటిలోకి నీరు రావడం ప్రత్యేకత. ఆలయంలో ప్రతి సోమవారం అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని పూజలు చేస్తారు. భక్తులు ముందుగా కోనేటిలో స్నానాలు చేసి దేవుని దర్శనం చేసుకుంటారు. కార్తీక మాసంలో మహిళలు ప్రత్యేక పూజలు చేసి కార్తీక దీపాలను వెలిగిస్తారు. కార్తీక మాసం నాల్గవ సోమవారం ఆలయంలో గొప్ప జాతర నిర్వహిస్తారు. ఇక్కడ వివాహ, శుభకార్యాలు నిర్వహించేందుకు భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ వంట గదులు, భోజనశాల నిర్మించారు. ఈ జాతరకు అటు వైఎస్సార్ జిల్లా, ఇటు అనంతపురము జిల్లాల నుంచి వేలాది మంది భక్తులు పాల్గొంటారు. - తాడిమర్రి (ధర్మవరం) -
1200 పుస్తకాల్లో వైఎస్ చరిత్ర నిక్షిప్తం
ఆత్మకూరు రూరల్ వైఎస్ రాజశేఖరెడ్డి పేరులో ఉండే వైఎస్ అనే రెండు అక్షరాలు ఏమని సూచిస్తాయంటే చాలా మంది అది యెడుగూరి .. సందింటి .. అని చెప్ప గలుగుతారు. రాజారెడ్డి తండ్రి వెంకటరెడ్డి ఆయన తండ్రి పుల్లారెడ్డిల ఇంటి పేరు యెడుగూరి మాత్రమే అని రామ్మోహన్ రెడ్డి చెప్పగలుగుతాడు. ఎందుకంటే పులివెందుల మండలం పార్నపల్లె గ్రామానికి చెందిన ఈయన వైఎస్ రాజశేఖరరెడ్డికి అభిమాని. వైఎస్ఆర్ జీవితంలో చదువు, వివాహం, రాజకీయ ప్రస్తానం.. పాదయాత్రలు ఒకటేమిటి సమస్త చరిత్రనంతా ఆయన 1200 పుస్తకాల్లో నిక్షిప్తం చేశారు. వివిధ పత్రికల్లో 1977 నుంచి అచ్చయిన వైఎస్ఆర్ కార్యక్రమాల క్లిప్పింగ్లన్నీ వరసగా చేర్చి అవసరమైన చోట నోట్స్ రాశారు. వైఎస్ఆర్ ఏడో వర్ధంతి సందర్భంగా శనివారం వైఎస్ఆర్ స్మతివనానికి వచ్చి రాజశేఖరరెడ్డికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం తాను అనంతపురంలో నివసిస్తున్నానని చెప్పారు. స్మృతివనంలో వైఎస్ఆర్ జీవితంలోని ముఖ్యఘట్టాల చిత్రాలను, ఆయన చరిత్రను ప్రదర్శనగా ఉంచాలన్నారు. వైఎస్ రాజారెడ్డి తండ్రి వెంకటరెడ్డి పులివెందుల మండలంలోని బలపనూరు గ్రామంలో ఒక సందులో చివర ఇంట్లో నివసించడం వల్లే ఇంటి పేరులో ‘సందింటి ’అని వచ్చి చేరిందని ఆయన చెప్పారు. వైఎస్సార్ జీవితంలో తారసపడ్డ చాలా మంది వ్యక్తులను..వారి వారసులను కలిసి వారి అభిప్రాయాలను కూడా రికార్డు చేసినట్లు చెప్పారు.