Passport Act
-
విదేశాలకు ఎగిరి పోకుండా ఆంక్షలు
న్యూఢిల్లీ : బ్యాంకులకు వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి, విదేశాలకు పారిపోతున్న వారికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. రూ.50 కోట్లు, ఆపై రుణాలు తీసుకుని, విదేశాలకు వెళ్తున్న ఉద్దేశ్యపూర్వక రుణ ఎగవేతదారులకు చెక్ పెట్టేలా చర్యలు తీసుకోంది. ఇక మీదట ముందస్తు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లకుండా ఉండేలా కఠిన వైఖరి అనుసరించాలని కేంద్రం భావిస్తోంది. దీని కోసం పైనాన్సియల్ సర్వీసెస్ సెక్రటరీ రాజీవ్ కుమార్ నేతృత్వంలో ఓ కమిటీ వేసింది. ఈ కమిటీ పలు సూచనలను కేంద్రం ముందు ఉంచింది. వాటిలో ఒకటి దేశీయ పాస్‌పోర్టు చట్టం సెక్షన్ 10లో సవరణ. ఈ చట్టం పాస్‌పోర్ట్‌ల రద్దుకు సంబంధించింది. అంతేకాక రూ.50 కోట్లు, ఆపై రుణాలు తీసుకునే వారి పాస్‌పోర్టు వివరాలను కూడా తప్పనిసరిగా బ్యాంక్‌లు సేకరించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఒకవేళ వీరు ఉద్దేశ్యపూర్వకంగా రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోవాలనుకుంటే, ఎయిర్‌పోర్టుల వద్దనే వారికి చెక్ పెట్టనున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలో ఆర్బీఐ ప్రతినిధులు, హోం, విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రతినిధులు, ఈడీ, సీబీఐ ప్రతినిధులు ఉన్నారు. పీఎన్బీలో రూ.14వేల కోట్ల కుంభకోణానికి పాల్పడిన నీరవ్ మోదీతో పాటు, విజయ్‌మాల్యా, మరికొంత మంది ప్రమోటర్లు బ్యాంకులకు వేల కోట్లు ఎగవేసి, విదేశాలకు పారిపోయిన సంగతి తెలిసిందే. వారిపై చర్యలు తీసుకునేందుకు, వారు అసలు భారత్‌కు రావడం లేదు. దీంతో ముందస్తు జాగ్రత్తలుగా రూ.50 కోట్ల కంటే ఎక్కువ రుణాలు కలిగి ఉన్న ఎన్పీఏ అకౌంట్లు ఏమేమీ ఉన్నాయో విచారణ చేయాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ, ప్రభుత్వ రంగ బ్యాంక్‌లను ఆదేశించింది. కాగా గత కొన్ని రోజుల క్రితమే రూ.100 కోట్ల కన్నా ఎక్కువ విలువైన ఆర్థిక నేరాలకు పాల్పడేవారి ఆస్తులను, వారి బినామీ ఆస్తులను జప్తు చేయడానికి కేంద్రం ఆర్థిక నేరగాళ్ల బిల్లు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. -
త్వరలో పాస్‌పోర్టు దివస్ వేడుకలు
మర్రిపాలెం(విశాఖ ఉత్తర) : పాస్‌పోర్టు చట్టం అమల్లోకి వచ్చి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా త్వరలో పాస్ పోర్టు దివస్ వేడుకల నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నారు. జూన్ 24, 1967 నుంచి పాస్‌పోర్టు చట్టం దేశంలో అమలవుతోంది. వేడుకల్లో భాగంగా కొత్తగా పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసుకునే వారికి కేంద్ర ప్రభుత్వం రాయితీలు ప్రకటించింది. ప్రస్తుతం పాస్‌పోర్టు సేవల ఫీజుగా రూ.1,500 వసూలు చేస్తున్నారు. 60 ఏళ్లు దాటిన వారికి ఈ ఫీజులో 10 శాతం తగ్గింపు.. అంటే రూ.1,350 ఫీజు చెల్లిస్తే సరిపోతుంది. ఎనిమిదేళ్ల లోపు చిన్నారులకు ఫీజు రూ.900గా నిర్ణయించారు. ఈ ఫీజుల తగ్గింపు అమలయ్యే తేదీలను త్వరలో ఖరారు చేస్తామని విశాఖపట్నం ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయ అధికారి ఎన్.ఎల్.పి.చౌదరి తెలిపారు. ఈ నెల 22, 23 తేదీల్లో కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ నేతృత్వంలో దేశ వ్యాప్తంగా ఉన్న పాస్‌పోర్టు అధికారులతో సమావేశం జరిగిందన్నారు. రేషన్ కార్డును దరఖాస్తుదారుడి గుర్తింపు పత్రంగా ఆమోదిస్తామని, అయితే ఈ కార్డు చిరునామా గుర్తింపునకు వర్తించదన్నారు. పాస్‌పోర్టు మంజూరు ప్రక్రియలో భాగంగా పోలీసు విచారణ రాష్ట్రంలో వేగవంతంగా జరుగుతోందని కేంద్ర ప్రభుత్వం ప్రశంసించిందన్నారు. పాస్‌పోర్టు సేవలను మరింత చేరువ చేయడం కోసం కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాల హెడ్ పోస్టాఫీసుల్లో ప్రత్యేక సేవా కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో మరో ఏడు చోట్ల పోస్టాఫీసు పాస్‌పోర్టు సేవా కేంద్రాలకు అనుమతిచ్చిందని తెలిపారు. -
దర్యాప్తు అధికారిని ఆదేశించలేం...
- చార్జిషీట్ దాఖలైన తరువాత కేంద్రం అనుమతి తీసుకోవాలని చెప్పలేం - పాస్‌పోర్టు చట్టం కింద నమోదైన కేసులో హైకోర్టు సాక్షి, హైదరాబాద్: పాస్‌పోర్ట్ చట్టం కింద నమోదైన కేసులో దాఖలైన చార్జిషీట్‌ను సంబంధిత కోర్టు పరిగణనలోకి తీసుకున్న తరువాత, నిందితులను విచారించేందుకు కేంద్రం లేదా సంబంధిత అధికారుల అనుమతి తీసుకోవాలని దర్యాప్తు అధికారిని ఆదేశించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. చార్జిషీట్‌ను వాపసు చేసి, తిరిగి తగిన అనుమతి తీసుకున్న తరువాతనే దాఖలు చేయాలని దర్యాప్తు అధికారికి చెప్పడం సంబంధిత కోర్టు పరిధిలోని వ్యవహారమంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావు ఇటీవల తీర్పు వెలువరించారు. తప్పుడు పుట్టిన తేదీ వివరాలతో వివాహం చేసుకుని, పాస్‌పోర్ట్ పొంది తనను మోసం చేశారంటూ హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి తన భార్య, అత్తలపై పోలీసు లకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పాస్‌పోర్ట్ చట్టంతో పాటు ఐపీసీ కింద కేసు నమో దు చేశారు. కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. పాస్‌పోర్ట్ చట్ట నిబంధనల కింద విచారణ జరపాలంటే కేంద్ర ప్రభుత్వం లేదా సంబంధిత అధికారుల నుంచి అనుమతి తీసుకొని, తరువాత చార్జిషీట్ దాఖలు చేయాలి. అయితే అనుమతి తీసుకునేందుకు పోలీసులు నిరాకరించడంతో సదరు వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి... చార్జిషీట్‌ను కోర్టు వాపసు చేసిన తరువాత దర్యాప్తు అధికారి ఏం చేస్తారన్నది తాము చెప్పలేమని, అందువల్ల ఈ వ్యాజ్యంలో ఎటువంటి ఉత్తర్వులూ ఇవ్వలేమని తెలిపారు. పిటిషన్‌ను కొట్టేస్తూ తీర్పునిచ్చారు.