దర్యాప్తు అధికారిని ఆదేశించలేం...
- చార్జిషీట్ దాఖలైన తరువాత కేంద్రం అనుమతి తీసుకోవాలని చెప్పలేం
- పాస్‌పోర్టు చట్టం కింద నమోదైన కేసులో హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: పాస్‌పోర్ట్ చట్టం కింద నమోదైన కేసులో దాఖలైన చార్జిషీట్‌ను సంబంధిత కోర్టు పరిగణనలోకి తీసుకున్న తరువాత, నిందితులను విచారించేందుకు కేంద్రం లేదా సంబంధిత అధికారుల అనుమతి తీసుకోవాలని దర్యాప్తు అధికారిని ఆదేశించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. చార్జిషీట్‌ను వాపసు చేసి, తిరిగి తగిన అనుమతి తీసుకున్న తరువాతనే దాఖలు చేయాలని దర్యాప్తు అధికారికి చెప్పడం సంబంధిత కోర్టు పరిధిలోని వ్యవహారమంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావు ఇటీవల తీర్పు వెలువరించారు. తప్పుడు పుట్టిన తేదీ వివరాలతో వివాహం చేసుకుని, పాస్‌పోర్ట్ పొంది తనను మోసం చేశారంటూ హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి తన భార్య, అత్తలపై పోలీసు లకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు పాస్‌పోర్ట్ చట్టంతో పాటు ఐపీసీ కింద కేసు నమో దు చేశారు. కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. పాస్‌పోర్ట్ చట్ట నిబంధనల కింద విచారణ జరపాలంటే కేంద్ర ప్రభుత్వం లేదా సంబంధిత అధికారుల నుంచి అనుమతి తీసుకొని, తరువాత చార్జిషీట్ దాఖలు చేయాలి. అయితే అనుమతి తీసుకునేందుకు పోలీసులు నిరాకరించడంతో సదరు వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి... చార్జిషీట్‌ను కోర్టు వాపసు చేసిన తరువాత దర్యాప్తు అధికారి ఏం చేస్తారన్నది తాము చెప్పలేమని, అందువల్ల ఈ వ్యాజ్యంలో ఎటువంటి ఉత్తర్వులూ ఇవ్వలేమని తెలిపారు. పిటిషన్‌ను కొట్టేస్తూ తీర్పునిచ్చారు.