త్వరలో పాస్‌పోర్టు దివస్ వేడుకలు
మర్రిపాలెం(విశాఖ ఉత్తర) : పాస్‌పోర్టు చట్టం అమల్లోకి వచ్చి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా త్వరలో పాస్ పోర్టు దివస్ వేడుకల నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నారు. జూన్ 24, 1967 నుంచి పాస్‌పోర్టు చట్టం దేశంలో అమలవుతోంది. వేడుకల్లో భాగంగా కొత్తగా పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసుకునే వారికి కేంద్ర ప్రభుత్వం రాయితీలు ప్రకటించింది. ప్రస్తుతం పాస్‌పోర్టు సేవల ఫీజుగా రూ.1,500 వసూలు చేస్తున్నారు. 60 ఏళ్లు దాటిన వారికి ఈ ఫీజులో 10 శాతం తగ్గింపు.. అంటే రూ.1,350 ఫీజు చెల్లిస్తే సరిపోతుంది. ఎనిమిదేళ్ల లోపు చిన్నారులకు ఫీజు రూ.900గా నిర్ణయించారు. ఈ ఫీజుల తగ్గింపు అమలయ్యే తేదీలను త్వరలో ఖరారు చేస్తామని విశాఖపట్నం ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయ అధికారి ఎన్.ఎల్.పి.చౌదరి తెలిపారు.
ఈ నెల 22, 23 తేదీల్లో కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ నేతృత్వంలో దేశ వ్యాప్తంగా ఉన్న పాస్‌పోర్టు అధికారులతో సమావేశం జరిగిందన్నారు. రేషన్ కార్డును దరఖాస్తుదారుడి గుర్తింపు పత్రంగా ఆమోదిస్తామని, అయితే ఈ కార్డు చిరునామా గుర్తింపునకు వర్తించదన్నారు. పాస్‌పోర్టు మంజూరు ప్రక్రియలో భాగంగా పోలీసు విచారణ రాష్ట్రంలో వేగవంతంగా జరుగుతోందని కేంద్ర ప్రభుత్వం ప్రశంసించిందన్నారు. పాస్‌పోర్టు సేవలను మరింత చేరువ చేయడం కోసం కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాల హెడ్ పోస్టాఫీసుల్లో ప్రత్యేక సేవా కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో మరో ఏడు చోట్ల పోస్టాఫీసు పాస్‌పోర్టు సేవా కేంద్రాలకు అనుమతిచ్చిందని తెలిపారు.