Passport case
-
HYD: పాస్‌పోర్టు కేసు దర్యాప్తు.. 15కి చేరిన అరెస్ట్‌ల సంఖ్య
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సంచలనం సృష్టించిన పాస్‌పోర్టుల కుంభకోణం కేసులో తెలంగాణ సీఐడీ దర్యాప్తు వేగంగా సాగుతోంది. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి అనర్హులకు పాస్ పోర్టులు జారీ చేసిన వ్యవహారంలో మరో ముగ్గురిని సీఐడీ అరెస్ట్ చేసింది. ఆదిలాబాద్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రంలో పని చేసే ప్రణబ్, ఎస్బీ ఏఎస్ఐ లక్ష్మణ్‌తో పాటు మరొకరు అరెస్టయ్యారు. మరో పాస్‌పోర్టు ఏజెంట్‌ను ముంబైలో సీఐడీ అదుపులోకి తీసుకుంది. ఇప్పటి వరకు శ్రీలంక వాసులకు 95 పాస్‌పోర్టులు జారీ అయినట్లుగా సీఐడీ గుర్తించింది. 95 మంది వివరాలను పాస్‌పోర్ట్ అధికారులతో పాటు ఇమీగ్రేషన్ అధికారులకు సీఐడీ సమాచారం ఇచ్చింది. ఈ కేసులో ఇప్పటివరకు 15 మందిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో అరెస్టయిన ఐదు మందిని కస్టడీకి తరలించి సీఐడీ విచారణ చేపట్టింది. ఇంకా అరెస్ట్‌లు పెరిగే అవకాశం ఉంది. ఇదీ చదవండి: సాంబశివరావుపై చీటింగ్ కేసు నమోదు -
రోజుకో మలుపు తిరుగుతున్న బోధన్ పాస్‌పోర్టుల కేసు
సాక్షి, హైదరాబాద్: బోధన్ పాస్‌పోర్టుల కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. దేశానికి అక్రమంగా వచ్చిన బంగ్లాదేశీయులు తప్పుడు చిరునామాలు, ధ్రువీకరణలతో పాస్‌పోర్టులు పొందడాన్ని కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థలు సీరియస్‌గా తీసుకుంటున్నాయి. స్థానికుల సహకారంతో... ఇప్పటిదాకా మొత్తం 72 పాస్‌పోర్టులను విదేశీయులు తప్పుడు ఆధార్, ఇతర ఐడీ కార్డులతో పొందారని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ కేసులో ప్రతీ పాస్‌పోర్టు క్లియరెన్స్‌కు స్పెషల్ బ్రాంచ్ (ఎస్బీ) పోలీసులు రూ.పది వేల నుంచి రూ.30 వేల వరకు వసూలు చేసినట్లు దర్యాప్తులో గుర్తించారు. అయితే, ఇంత తక్కువ మొత్తానికే పాస్‌పోర్టుల జారీకి సహకరిస్తారా? అన్న అనుమానాలు పోలీసుశాఖలో తలెత్తుతున్నాయి. కచ్చితంగా దీని వెనక పెద్ద రాజకీయ నేతలే ఉండి ఉంటారని, వారి అభయం, ఒత్తిడి కారణంగానే ఎస్బీ పోలీసులు ఈ పనికి పాల్పడి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ ఇలాంటి కేసులు బోధన్ ప్రాంతంలో పాస్‌పోర్టుల జారీలో అక్రమాలు కొత్త విషయమేమీ కాదు. గతంలోనూ ఇక్కడ కొందరు రాజకీయ నాయకులపై ఇలాంటి కేసులు నమోదవడం గమనార్హం. అందుకే ప్రస్తుతం వెలుగుచూస్తోన్న దొంగపాస్‌పోర్టుల వ్యవహారంలోనూ పోలీసులు ఏమైనా రాజకీయ లింకులున్నాయా అని ఆరా తీస్తున్నట్లు సమాచారం. 1993 ముంబై బాంబు పేలుళ్ల కేసులో దోషిగా తేలిన అబూసలేం పాస్‌పోర్ట్ కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి జారీ అయిన విషయం తెలిసిందే. అప్పట్లో ఆ వ్యవహారం అంతర్జాతీయంగా కలకలం రేపింది. నకిలీ పత్రాలు సమర్పించి కర్నూలు జిల్లా నుంచి దొంగపాస్పోర్టు సంపాదించిన కేసులో అబూసలేంకు న్యాయస్థానం ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. ఇక బోధన్ కేసు విషయానికి వస్తే సగానికి పైగా నిందితులు విదేశీయులు. వీరంతా దేశంలోకి అక్రమంగా ప్రవేశించారు. వీరందరిపై ఐపీసీ 420, 468, 471(ఫోర్జరీ), సెక్షన్ 14 ఫారినర్స్ యాక్ట్ 1946 (నకిలీ పత్రాలతో దొంగపాస్‌పోర్టులు పొందడం) ప్రకారం వీరికి ఏడేళ్ల కంటే అధికంగానే జైలు శిక్ష పడుతుందని సమాచారం. పాత నేరస్థులని తెలిసీ క్లియరెన్స్ ఈ కేసులో ఎస్బీ పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విచారణ చేసే సమయంలో కనీస నిబంధనలు పాటించకుండా.. పూర్తిగా దరఖాస్తుదారుల పక్షం వహించడం చూసి దర్యాప్తు అధికారులే విస్తుపోతున్నారు. ఎనిమిది పాస్‌పోర్టులు ఏకంగా ప్రార్థనామందిరం చిరునామాతో ఉండటం చూసి దర్యాప్తు అధికారులు విస్మయం చెందినట్లు తెలిసింది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. పోలీసులు పట్టుకున్న బంగ్లాదేశీయుల్లో కొందరికి భారత్‌లో నేరచరిత్ర ఉంది. సాధారణంగా ఎస్బీ పోలీసులు పాస్‌పోర్టు విచారణ సమయంలో దరఖాస్తుదారుల వేలిముద్రలు తీసుకుంటారు. వాటిని ‘పాపిలాన్’ అనే అత్యాధునిక సాఫ్ట్‌వేర్‌లో పోల్చి చూస్తారు. దేశవ్యాప్తంగా ఏమూలన నేరచరిత్ర ఉన్నా.. ఈ సాఫ్ట్‌వేర్‌లో కేవలం 10 సెకండ్లలో తెలిసిపోతుంది. అలాంటిది విదేశీయులు, పైగా పాత నేరస్థులు అని తెలిసినా... ఈ విషయాన్ని దాచిపెట్టి పాస్‌పోర్టులు పొందేందుకు సహకరించే సాహసం చేశారంటే.. తెరవెనక రాజకీయశక్తుల ఒత్తిడి తప్పక ఉండి ఉంటుందన్న అనుమానాలు రోజురోజుకు బలపడుతున్నాయి. చదవండి: అసలు సూత్రధారి గల్ఫ్ ఏజెంటే.. నిరూపిస్తే రాజీనామా చేస్తా: టీఆర్ఎస్ ఎమ్మెల్యే -
7 చిరునామాలతో 72 పాస్‌పోర్టులు!
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో పట్టుబడిన ముగ్గురు బంగ్లాదేశీయుల నుంచి స్వాధీనం చేసుకున్నవి నకిలీ పాస్‌పోర్టులు కావని, అసలైన పాస్‌పోర్టులనే వారు అక్రమ మార్గాల్లో పొందారని సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ మంగళవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. బోధన్ కేంద్రంగా మూడేళ్లపాటు సాగిన ఈ కుంభకోణంలో మొత్తం 72 మంది బంగ్లాదేశీయులు అడ్డదారిలో కేవలం 7 చిరునామాలతోనే పాస్‌పోర్టులు పొందినట్లు తేలిందన్నారు. వారిలో 19 మంది ఇప్పటికే విదేశాలకు పారిపోయారని వివరించారు. ఈ కేసులో ఇప్పటివరకు ఇద్దరు పోలీసులు సహా మొత్తం 8 మందిని అరెస్టు చేశామని, ముగ్గురు పరారీలో ఉన్నారని సజ్జనార్ వివరించారు. ఆ అనుభవమే పెట్టుబడిగా... సీపీ సజ్జనార్ తెలిపిన వివరాల ప్రకారం... బంగ్లాదేశ్‌కు చెందిన పరిమళ్ బెయిన్ 2013లో సముద్ర మార్గం ద్వారా భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించాడు. పశ్చిమ బెంగాల్‌లోని నదియా జిల్లాలో ఉంటున్న జోబా అనే వ్యక్తి దగ్గర ఆశ్రయం పొందాడు. అక్కడే అక్రమంగా గుర్తింపు పత్రాలు, పాన్ కార్డు పొందాడు. బోధన్‌లో ఆయుర్వేద వైద్యశాల నిర్వహిస్తున్న బెంగాల్‌వాసి సమీర్ రాయ్ వద్దకు 2015లో వచ్చిన పరిమళ్.. వైద్యం నేర్చుకొని 2016లో సొంతంగా క్లినిక్ ఏర్పాటు చేశాడు. బోధన్‌లో ఉంటూనే నకిలీ గుర్తింపు కార్డులు పొందిన అతను పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అప్పట్లో స్పెషల్ బ్రాంచ్ ఏఎస్సైగా ఉన్న పెరుక మల్లేశ్‌రావు నిర్లక్ష్యంగా వెరిఫికేషన్ చేయడంతో పరిమళ్‌కు పాస్‌పోర్టు జారీ అయింది. ఈ అనుభవంతోనే అక్రమంగా పాస్‌పోర్టులు పొందే దందాకు అతను శ్రీకారం చుట్టాడు. బతుకుదెరువు కోసం అడ్డదారుల్లో విదేశాలకు వెళ్లాలనుకొనే బంగ్లాదేశీయులకు తప్పుడు మార్గాల్లో పాస్‌పోర్టులు ఇప్పించే స్కాంకు పరిమళ్ తెరలేపాడు. తొలుత పుణేలోని ఓ కంపెనీలో పని చేసే తన సోదరుడు గోపాల్ బెయిన్‌కు ఏఎస్సై మల్లేశ్ సహకారంతో అక్రమంగా పాస్‌పోర్టు ఇప్పించాడు. ఆ తర్వాత 2019లో సమీర్, ఢిల్లీవాసి షానాజ్‌లతో జట్టుగా ఏర్పడ్డాడు. సమీర్ బంగ్లా జాతీయుల్ని అడ్డదారిలో సరిహద్దులు దాటించి భారత్‌కు తీసుకుకొచ్చే వ్యూహం అమలు చేయగా వారికి తప్పుడు చిరునామాలతో పాస్‌పోర్టులు ఇప్పించి విదేశాలకు వెళ్లడానికి టికెట్లను షానాజ్, సద్దాం హుస్సేన్ సమకూర్చేవారు. ఇరాక్‌లో పనిచేస్తున్న సమీర్ కుమారుడు మనోజ్ వీసాల ప్రాసెసింగ్‌కు పాల్పడేవాడు. ఈ దందాకు ప్రస్తుతం స్పెషల్ బ్రాంచ్ ఎస్సైగా ఉన్న మల్లేశ్‌రావు, ఏఎస్సై బి.అనిల్ కుమార్ సహకారం, అవినీతి ఉన్నాయి. ఇద్దరు పోలీసుల కీలకపాత్ర... ఈ గ్యాంగ్ సమకూర్చిన తప్పుడు చిరునామాలతో పాస్‌పోర్టులు పొంది దుబాయ్ వెళ్లేందుకు ప్రయత్నించిన బంగ్లాదేశీయులు నితాయ్ దాస్, మహ్మద్ రానా మయ్, మహ్మద్ హసిబుర్ రెహ్మాన్ గత నెలాఖరులో శంషాబాద్ విమానాశ్రయంలో పట్టుబడ్డారు. వారి విచారణలో వెలుగులోకి వచ్చిన వివరాలతో లోతుగా దర్యాప్తు చేసిన సైబరాబాద్ పోలీసులు కీలక విషయాలు సేకరించారు. బోధన్ కేంద్రంగా జరిగిన ఈ పాస్‌పోర్టుల కుంభకోణంలో నిందితులు కేవలం 5 ఫోన్ నంబర్లు, 7 చిరునామాలు వినియోగించారని గుర్తించారు. ఇలా జారీ అయిన 72 పాస్‌పోర్టుల్లో 42 వెరిఫికేషన్లను ఎస్సై మల్లేశ్, 30 వెరిఫికేషన్లను ఏఎస్సై అనిల్ చేశారు. అక్రమంగా పాస్‌పోర్టులు పొందిన 72 మంది బంగ్లాదేశీయుల్లో 12 మందికి బోధన్‌కు చెందిన మీ–సేవ కేంద్రం నిర్వాహకుడు మతీన్ అహ్మద్ మీర్జా అక్రమంగా ఆధార్ కార్డులు జారీ చేయించగా... మిగిలిన 60 మంది పశ్చిమ బెంగాల్లో వాటిని పొంది, ఇతడి ద్వారా చిరునామా మార్పు చేయించుకున్నారు. ఇలా పొందిన పాస్‌పోర్టులతో 19 మంది విదేశాలకు వెళ్లిపోగా... ముగ్గురు శంషాబాద్ విమానాశ్రయంలో పట్టుబడ్డారు. మిగిలిన 50 మంది ఆచూకీ కోసం ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ కేసులో ఇప్పటివరకు 11 మందిని నిందితులుగా గుర్తించిన పోలీసులు... సమీర్, మనోజ్, సద్దాం హుస్సేన్ మినహా మిలిగిన వారిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న వారి కోసం లుక్ ఔట్ సర్క్యులర్స్ జారీ చేస్తున్నారు. -
పాస్‌పోర్టు కేసులో పోలీసులు, విదేశీయుల అరెస్ట్
-
పాస్‌పోర్టు కేసులో పోలీసులు, విదేశీయుల అరెస్ట్
హైదరాబాద్: బోధన్ పాస్‌పోర్ట్ కేసులో విచారణ వేగవంతం చేసినట్లు పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు. ఈ కేసులో భాగంగా ఇప్పటివరకు 8 మందిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. వీరిలో ఇద్దరు పోలీస్ అధికారులు కూడా ఉన్నారు. నలుగురు బంగ్లాదేశీయులు, ఒకరు పశ్చిమబెంగాల్, ఒకరు ఏజెంట్, ఇద్దరు స్పెషల్ బ్రాంచ్ అధికారులను అరెస్ట్ చేసినట్లు వివరించారు. ఒకే చిరునామాస్‌పై 32 పాస్‌పోర్టులు జారీ అవడం కలకలం రేపింది. దీనిలో ఇప్పటివరకు 72 పాస్ట్‌పోర్టులు గుర్తించినట్లు వివరించారు. హైదరాబాద్‌లోని కార్యాలయంలో సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఒకే చిరునామాపై భారీ సంఖ్యలో పాస్‌పోర్టులు ఉండడంపై ఇప్పటికే ఇమ్మిగ్రేషన్, రీజనల్ పాస్‌పోర్టు అధికారులకు సమాచారం ఇచ్చినట్లు సజ్జనార్ తెలిపారు. ఎంతమంది దేశం దాటి వెళ్లారనేది విచారణ చేస్తున్నట్లు చెప్పారు. అధికారులు, స్థానికుల పాత్రపైనా కూడా విచారణ చేస్తున్నట్లు వివరించారు. త్వరలోనే మిగతా వారిని అదుపులోకి తీసుకుంటామని పోలీస్ అధికారులు చెబుతున్నారు. నకిలీ పత్రాలతో పాస్ పోర్ట్ పొందారని, ఎంతమంది దేశం దాటి వెళ్లారు, ఎంతమంది పాస్‌పోర్టులు పొందారనేది విచారణ చేస్తున్నట్లు సీపీ వెల్లడించారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు. కస్టడీకి తీసుకొని విచారిస్తామని పేర్కొన్నారు. పాస్‌పోర్ట్ పరిశీలనలో లోపాలపై దృష్టి పెట్టినట్లు చెప్పారు. దోషులు ఎవరైనా వదిలేది లేదని స్పష్టం చేశారు. చదవండి: అసలు సూత్రధారి గల్ఫ్ ఏజెంటే.. -
అసలు సూత్రధారి గల్ఫ్ ఏజెంటే..
సాక్షి, హైదరాబాద్: బంగ్లాదేశీయులకు పాస్‌పోర్టు కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తొలుత రెండు, తర్వాత 32 పాస్‌పోర్టులు అనుకున్నప్పటికీ ఈ విషయంలో కూపీ లాగిన కొద్దీ అక్రమంగా జారీ అయిన పాస్‌పోర్టుల సంఖ్య పెరుగుతూనే ఉందని సమాచారం.. ఈ పాస్‌పోర్టులతో ఎవరైనా ఇప్పటికే దేశం దాటారా? అన్న విషయంపై పోలీసులు సీరియస్‌గా దృష్టి సారించారు. ఇమిగ్రేషన్ అధికారులతో కలసి బోధన్‌లో ఒకే ఇంటి నంబరు నుంచి జారీ అయిన పాస్‌పోర్టుల నంబర్లతో విచారణ చేస్తున్నారు. మొత్తం వ్యవహారానికి సూత్రధారి స్థానిక గల్ఫ్ ఏజెంటేనని పోలీసులు గుర్తించినట్లు సమాచారం. స్థానిక మీసేవ కేంద్రం నిర్వాహకుడి సాయంతో నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి వాటితో విదేశీయులతో పాస్‌పోర్టుకు దరఖాస్తులు చేయించినట్లు సమాచారం. తనకున్న పరిచయాలతోనే ఒకే చిరునామా నుంచి 32 మందికిపైగా విదేశీయులకు అక్రమ పద్ధతిలో పాస్‌పోర్టులు వచ్చేలా చేశాడు. ఇప్పుడు ఈ సంఖ్య మరింత అధికంగా ఉందన్న ప్రచారం ఊపందుకోవడంతో ఇంకా ఎన్ని పాస్‌పోర్టులు ఒకే ఇంటి నంబరు నుంచి వచ్చాయన్న దానిపై చిక్కుముడి వీడాల్సి ఉంది. మరింత లోతుగా దర్యాప్తు..! ఈ మొత్తం వ్యవహారంలో లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులు, ఇమ్మిగ్రేషన్ అధికారులకు అనేక కొత్త విషయాలు తెలిశాయి. తొలుత కేవలం రెండు పాస్‌పోర్టులే అనుకున్నా పోలీసులు మరింత కూపీలాగారు. మొత్తంగా 32కిపైగా పాస్‌పోర్టులు రెంజల్ కాలనీలోని ఒకే చిరునామా నుంచి జారీ అయ్యాయని తెలిసి అధికారులు అవాక్కయ్యారు. ఇప్పుడు ఆ సంఖ్య మరింత పెరిగిందన్న ప్రచారం స్పెషల్ బ్రాంచ్ పోలీసుల విచారణలో అనేక లోపాలను ఎత్తిచూపుతోంది. ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన స్పెషల్ బ్రాంచ్ ఎస్సై, ఏఎస్సైలను ఇప్పటికే సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. విదేశీయులకు పాస్‌పోర్టుల వ్యవహారంలో ఈ ఇద్దరు పోలీసులేనా..? ఇంకా ఇతర పోలీసు అధికారులెవరైనా సహకరించారా? ఒకే ఇంటిపై పదుల సంఖ్యలో పాస్‌పోర్టు దరఖాస్తులు వస్తున్నా ఎందుకు అనుమానించలేదు? దీని వెనక ఇంకా ఎవరైనా హస్తముందా? అన్న విషయాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. -
అమెరికా న్యాయస్థానం ఉత్తర్వులున్నా..ఇక్కడి కోర్టులు విచారించొచ్చు
ఎన్నారై కేసులో స్పష్టం చేసిన హైకోర్టు సాక్షి, హైదరాబాద్: ఎన్నారై దంపతులకు చెందిన పిల్లల సంరక్షణపై అమెరికా కోర్టులు ఇచ్చే ఉత్తర్వుల అమల్లో తీవ్ర జాప్యం జరిగినప్పుడు ఆ వివాదానికి సంబంధించిన కేసులను విచారించే పరిధి భారత్‌లోని కోర్టులకు ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. ఎన్నారై అరవింద్ గోపాలకృష్ణ కేసులో జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్, జస్టిస్ ఎం.సీతారామ్మూర్తిలతో కూడిన ధర్మాసనం తాజాగా ఈ మేరకు తీర్పు వెలువరించింది. తన భార్య తనకు చెప్పకుండా అమెరికా నుంచి పిల్లలను భారత్‌కు తీసుకొచ్చిందని, దీనిపై అమెరికా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పట్టించుకోలేదని, అందువల్ల పిల్లలను తనకు అప్పగించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ గోపాలకృష్ణ వేసిన పిటిషన్‌ను కొట్టేసింది. ఇదీ నేపథ్యం..: అరవింద్ గోపాలకృష్ణ, సునీతరాణికి 2002లో వివాహమైంది. అమెరికాకు వెళ్లిన తర్వాత వీరికి 2005లో కాష్వీ, 2011లో క్రిష్ జన్మించారు. మనస్పర్థలతో 2013లో సునీత పిల్లలతో సహా హైదరాబాద్‌కు తిరిగి వ చ్చారు. దీనిపై అరవింద్ అదే ఏడాది అమెరికా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2014లో అక్కడి కోర్టు పిల్లలను కస్టడీకి తీసుకోవాలని ఆదేశాలిచ్చింది. సునీతకు ఆ కోర్టు ఉత్తర్వులు గురించి తెలియదు. తన పిల్లలను కోర్టు ముందు హాజరుపరిచి, వారిని తన సంరక్షణకు అప్పగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ అరవింద్ గత ఏడాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అమెరికా కోర్టు ఉత్తర్వులున్నందున వాటిని అమలు చేయాలని కోరారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన ధర్మాసనం.. అమెరికా కోర్టు 2014లో ఉత్తర్వులు జారీ చేస్తే దాని అమలు కోసం చర్యలు తీసుకోవడంలో అరవింద్ తీవ్ర జాప్యం చేశారని తేల్చింది. అమెరికా కోర్టు ఉత్తర్వులున్నా.. ఆ వివాదానికి సంబంధించి వ్యాజ్యాన్ని విచారించే అధికారం ఇక్కడి కోర్టులకు ఉంటుందని స్పష్టం చేసింది. అంతేకాక క్వాష్వీ, క్రిష్‌లు హైదరాబాద్‌కు వచ్చి ఇక్కడి వాతావరణానికి అలవాటుపడ్డారని, ఇక్కడే చక్కగా చదువుకుంటున్నారని తెలిపింది. వారితో మాట్లాడినప్పుడు వారు కూడా ఇదే విషయాన్ని చెప్పారని, అమెరికా వెళ్లేందుకు వారు సుముఖత వ్యక్తం చేయడం లేదని వివరించింది. అందువల్ల వారు తల్లి సంరక్షణలో ఉండటం మేలని పేర్కొంది. వారిని కలుసుకునే హక్కులు కావాలంటే సంబంధిత కోర్టును ఆశ్రయించి ఉత్తర్వులు పొందవచ్చునని అరవింద్‌కు స్పష్టం చేసింది. -
‘పాస్‌పోర్ట్’ కేసు సూత్రధారి అరెస్టు
సాక్షి, హైదరాబాద్: బంగ్లాదేశీయుల్ని అక్రమ పాస్‌పోర్ట్‌ల ద్వారా దేశం దాటిస్తున్న ముఠా సూత్రధారి ఎట్టకేలకు పట్టుబడ్డాడు. ఈ గ్యాంగ్ సభ్యులను నగర పోలీసులు గత ఏడాది ఆగస్టులో అరెస్టు చేయగా... ప్రధాన నిందితుడిగా ఉన్న షౌకత్ అలీని ఢిల్లీ స్పెషల్ సెల్ అధికారులు శుక్రవారం అక్కడ పట్టుకున్నారు. ఇతడిని ప్రిజనర్స్ ట్రాన్సిట్ (పీటీ) వారెంట్‌పై హైదరాబాద్ తీసుకువచ్చేందుకు పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. దిల్‌సుఖ్‌నగర్‌లో 2013 ఫిబ్రవరి 21 జరిగిన బాంబు పేలుళ్ల కేసులో నిందితుడిగా ఉన్న జియా ఉర్ రెహ్మాన్ అలియాస్ వఖాస్‌ను ఈ ఘాతుకం తరవాత దేశం దాటించిన హుజీ ఉగ్రవాది మహ్మద్ నసీర్‌ను నగర టాస్క్‌ఫోర్స్ పోలీసులు గత ఏడాది ఆగస్టు 14న అరెస్టు చేశారు. అక్రమంగా వలసవచ్చి హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న మయన్మార్, బంగ్లాదేశ్ జాతీయులకు ఆశ్రయం కల్పించడం, నకిలీ ధ్రువీకరణ పత్రాలతో పాస్‌పోర్టులు, వీసాలు ఇప్పించడం ద్వారా విదేశాలకు పంపిస్తున్న ఆరోపణలపై ఇతడితో పాటు ఆరుగురిని పట్టుకున్నారు. విచారణ నేపథ్యంలో ఉగ్రవాద సంస్థ హర్కత్ ఉల్ జిహాద్ అల్ ఇస్లామీ (హుజీ)తో ఇతడికి ఉన్న సంబంధాలు, మనుషుల అక్రమ రవాణా తదితర అంశాలు వెలుగులోకి వచ్చాయి. అప్పట్లో ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన నూర్ ఉల్ హక్ విచారణతోనే ఈ అక్రమ పాస్పోర్ట్స్ వ్యవహారం మొత్తం బయటపడింది. మయన్మార్‌కు చెందిన ఇతడు ఢిల్లీలో స్థిరపడి అక్కడ నుంచే దేశవ్యాప్తంగా నెట్వర్క్ నడిపించాడని తేలింది. ఇతడిని సైతం హైదరాబాద్ పోలీసు లు పీటీ వారెంట్‌పై తీసుకువచ్చి అరెస్టు చేసి విచారించారు. ఈ నెట్వర్క్ మొత్తానికి ఢిల్లీలో స్థిరపడిన బంగ్లాదేశ్ జాతీయుడు షౌకత్ అలీ కీలకమని బయటపడింది. అప్పటి నుంచి షౌకత్ కోసం ఢిల్లీతో పాటు హైదరాబాద్ పో లీసులు గాలిస్తున్నారు. దక్షిణ ఢిల్లీలోని సరాయ్ కాలే ఖాన్ ప్రాంతంలో షౌకత్ ఉన్నాడన్న సమాచారం అందుకున్న ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు శుక్రవారం వలపన్ని అరెస్టు చేశారు. ఇతడికి హైదరాబాద్‌తో పాటు బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్, సౌదీ అరేబియాల్లోనే నెట్వర్క్ ఉన్నట్లు నిర్థారించారు. షౌకత్ అరెస్టు విషయం తెలుసుకున్న నిఘా విభాగం అధికారులు, పీటీ వారెంట్‌పై అతడిని నగరానికి తెచ్చేందుకు హుటాహుటిన ఢిల్లీ బయలుదేరి వెళ్లారు.