సాక్షి, హైదరాబాద్: బంగ్లాదేశీయులకు పాస్‌పోర్టు కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తొలుత రెండు, తర్వాత 32 పాస్‌పోర్టులు అనుకున్నప్పటికీ ఈ విషయంలో కూపీ లాగిన కొద్దీ అక్రమంగా జారీ అయిన పాస్‌పోర్టుల సంఖ్య పెరుగుతూనే ఉందని సమాచారం.. ఈ పాస్‌పోర్టులతో ఎవరైనా ఇప్పటికే దేశం దాటారా? అన్న విషయంపై పోలీసులు సీరియస్‌గా దృష్టి సారించారు. ఇమిగ్రేషన్ అధికారులతో కలసి బోధన్‌లో ఒకే ఇంటి నంబరు నుంచి జారీ అయిన పాస్‌పోర్టుల నంబర్లతో విచారణ చేస్తున్నారు. మొత్తం వ్యవహారానికి సూత్రధారి స్థానిక గల్ఫ్ ఏజెంటేనని పోలీసులు గుర్తించినట్లు సమాచారం.
స్థానిక మీసేవ కేంద్రం నిర్వాహకుడి సాయంతో నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి వాటితో విదేశీయులతో పాస్‌పోర్టుకు దరఖాస్తులు చేయించినట్లు సమాచారం. తనకున్న పరిచయాలతోనే ఒకే చిరునామా నుంచి 32 మందికిపైగా విదేశీయులకు అక్రమ పద్ధతిలో పాస్‌పోర్టులు వచ్చేలా చేశాడు. ఇప్పుడు ఈ సంఖ్య మరింత అధికంగా ఉందన్న ప్రచారం ఊపందుకోవడంతో ఇంకా ఎన్ని పాస్‌పోర్టులు ఒకే ఇంటి నంబరు నుంచి వచ్చాయన్న దానిపై చిక్కుముడి వీడాల్సి ఉంది.
మరింత లోతుగా దర్యాప్తు..!
ఈ మొత్తం వ్యవహారంలో లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులు, ఇమ్మిగ్రేషన్ అధికారులకు అనేక కొత్త విషయాలు తెలిశాయి. తొలుత కేవలం రెండు పాస్‌పోర్టులే అనుకున్నా పోలీసులు మరింత కూపీలాగారు. మొత్తంగా 32కిపైగా పాస్‌పోర్టులు రెంజల్ కాలనీలోని ఒకే చిరునామా నుంచి జారీ అయ్యాయని తెలిసి అధికారులు అవాక్కయ్యారు. ఇప్పుడు ఆ సంఖ్య మరింత పెరిగిందన్న ప్రచారం స్పెషల్ బ్రాంచ్ పోలీసుల విచారణలో అనేక లోపాలను ఎత్తిచూపుతోంది. ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన స్పెషల్ బ్రాంచ్ ఎస్సై, ఏఎస్సైలను ఇప్పటికే సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. విదేశీయులకు పాస్‌పోర్టుల వ్యవహారంలో ఈ ఇద్దరు పోలీసులేనా..? ఇంకా ఇతర పోలీసు అధికారులెవరైనా సహకరించారా? ఒకే ఇంటిపై పదుల సంఖ్యలో పాస్‌పోర్టు దరఖాస్తులు వస్తున్నా ఎందుకు అనుమానించలేదు? దీని వెనక ఇంకా ఎవరైనా హస్తముందా? అన్న విషయాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment