7 చిరునామాలతో 72 పాస్‌పోర్టులు! | Passport Case: Total 8 Members Arrested says CP Sajjanar | Sakshi
Sakshi News home page

7 చిరునామాలతో 72 పాస్‌పోర్టులు!  

Published Tue, Feb 23 2021 6:03 PM | Last Updated on Wed, Feb 24 2021 11:58 AM

Passport Case: Total  8 Members Arrested says CP Sajjanar - Sakshi

విలేకరుల సమావేశంలో సైబరాబాద్‌ సీపీ సజ్జనార్

సాక్షి, హైదరాబాద్‌: శంషాబాద్‌ విమానాశ్రయంలో పట్టుబడిన ముగ్గురు బంగ్లాదేశీయుల నుంచి స్వాధీనం చేసుకున్నవి నకిలీ పాస్‌పోర్టులు కావని, అసలైన పాస్‌పోర్టులనే వారు అక్రమ మార్గాల్లో పొందారని సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ మంగళవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. బోధన్‌ కేంద్రంగా మూడేళ్లపాటు సాగిన ఈ కుంభకోణంలో మొత్తం 72 మంది బంగ్లాదేశీయులు అడ్డదారిలో కేవలం 7 చిరునామాలతోనే పాస్‌పోర్టులు పొందినట్లు తేలిందన్నారు. వారిలో 19 మంది ఇప్పటికే విదేశాలకు పారిపోయారని వివరించారు. ఈ కేసులో ఇప్పటివరకు ఇద్దరు పోలీసులు సహా మొత్తం 8 మందిని అరెస్టు చేశామని, ముగ్గురు పరారీలో ఉన్నారని సజ్జనార్‌ వివరించారు. 

ఆ అనుభవమే పెట్టుబడిగా... 
సీపీ సజ్జనార్‌ తెలిపిన వివరాల ప్రకారం... బంగ్లాదేశ్‌కు చెందిన పరిమళ్‌ బెయిన్‌ 2013లో సముద్ర మార్గం ద్వారా భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించాడు. పశ్చిమ బెంగాల్‌లోని నదియా జిల్లాలో ఉంటున్న జోబా అనే వ్యక్తి దగ్గర ఆశ్రయం పొందాడు. అక్కడే అక్రమంగా గుర్తింపు పత్రాలు, పాన్‌ కార్డు పొందాడు. బోధన్‌లో ఆయుర్వేద వైద్యశాల నిర్వహిస్తున్న బెంగాల్‌వాసి సమీర్‌ రాయ్‌ వద్దకు 2015లో వచ్చిన పరిమళ్‌.. వైద్యం నేర్చుకొని 2016లో సొంతంగా క్లినిక్‌ ఏర్పాటు చేశాడు. బోధన్‌లో ఉంటూనే నకిలీ గుర్తింపు కార్డులు పొందిన అతను పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అప్పట్లో స్పెషల్‌ బ్రాంచ్‌ ఏఎస్సైగా ఉన్న పెరుక మల్లేశ్‌రావు నిర్లక్ష్యంగా వెరిఫికేషన్‌ చేయడంతో పరిమళ్‌కు పాస్‌పోర్టు జారీ అయింది. ఈ అనుభవంతోనే అక్రమంగా పాస్‌పోర్టులు పొందే దందాకు అతను శ్రీకారం చుట్టాడు.

బతుకుదెరువు కోసం అడ్డదారుల్లో విదేశాలకు వెళ్లాలనుకొనే బంగ్లాదేశీయులకు తప్పుడు మార్గాల్లో పాస్‌పోర్టులు ఇప్పించే స్కాంకు పరిమళ్‌ తెరలేపాడు. తొలుత పుణేలోని ఓ కంపెనీలో పని చేసే తన సోదరుడు గోపాల్‌ బెయిన్‌కు ఏఎస్సై మల్లేశ్‌ సహకారంతో అక్రమంగా పాస్‌పోర్టు ఇప్పించాడు. ఆ తర్వాత 2019లో సమీర్, ఢిల్లీవాసి షానాజ్‌లతో జట్టుగా ఏర్పడ్డాడు. సమీర్‌ బంగ్లా జాతీయుల్ని అడ్డదారిలో సరిహద్దులు దాటించి భారత్‌కు తీసుకుకొచ్చే వ్యూహం అమలు చేయగా వారికి తప్పుడు చిరునామాలతో పాస్‌పోర్టులు ఇప్పించి విదేశాలకు వెళ్లడానికి టికెట్లను షానాజ్, సద్దాం హుస్సేన్‌ సమకూర్చేవారు. ఇరాక్‌లో పనిచేస్తున్న సమీర్‌ కుమారుడు మనోజ్‌ వీసాల ప్రాసెసింగ్‌కు పాల్పడేవాడు. ఈ దందాకు ప్రస్తుతం స్పెషల్‌ బ్రాంచ్‌ ఎస్సైగా ఉన్న మల్లేశ్‌రావు, ఏఎస్సై బి.అనిల్‌ కుమార్‌ సహకారం, అవినీతి ఉన్నాయి. 

ఇద్దరు పోలీసుల కీలకపాత్ర... 
ఈ గ్యాంగ్‌ సమకూర్చిన తప్పుడు చిరునామాలతో పాస్‌పోర్టులు పొంది దుబాయ్‌ వెళ్లేందుకు ప్రయత్నించిన బంగ్లాదేశీయులు నితాయ్‌ దాస్, మహ్మద్‌ రానా మయ్, మహ్మద్‌ హసిబుర్‌ రెహ్మాన్‌ గత నెలాఖరులో శంషాబాద్‌ విమానాశ్రయంలో పట్టుబడ్డారు. వారి విచారణలో వెలుగులోకి వచ్చిన వివరాలతో లోతుగా దర్యాప్తు చేసిన సైబరాబాద్‌ పోలీసులు కీలక విషయాలు సేకరించారు. బోధన్‌ కేంద్రంగా జరిగిన ఈ పాస్‌పోర్టుల కుంభకోణంలో నిందితులు కేవలం 5 ఫోన్‌ నంబర్లు, 7 చిరునామాలు వినియోగించారని గుర్తించారు. ఇలా జారీ అయిన 72 పాస్‌పోర్టుల్లో 42 వెరిఫికేషన్లను ఎస్సై మల్లేశ్, 30 వెరిఫికేషన్లను ఏఎస్సై అనిల్‌ చేశారు.

అక్రమంగా పాస్‌పోర్టులు పొందిన 72 మంది బంగ్లాదేశీయుల్లో 12 మందికి బోధన్‌కు చెందిన మీ–సేవ కేంద్రం నిర్వాహకుడు మతీన్‌ అహ్మద్‌ మీర్జా అక్రమంగా ఆధార్‌ కార్డులు జారీ చేయించగా... మిగిలిన 60 మంది పశ్చిమ బెంగాల్‌లో వాటిని పొంది, ఇతడి ద్వారా చిరునామా మార్పు చేయించుకున్నారు. ఇలా పొందిన పాస్‌పోర్టులతో 19 మంది విదేశాలకు వెళ్లిపోగా... ముగ్గురు శంషాబాద్‌ విమానాశ్రయంలో పట్టుబడ్డారు. మిగిలిన 50 మంది ఆచూకీ కోసం ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ కేసులో ఇప్పటివరకు 11 మందిని నిందితులుగా గుర్తించిన పోలీసులు... సమీర్, మనోజ్, సద్దాం హుస్సేన్‌ మినహా మిలిగిన వారిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న వారి కోసం లుక్‌ ఔట్‌ సర్క్యులర్స్‌ జారీ చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement