Pasuvadha
-
‘పశువధ’ రగడ
► నిషేధానికి వ్యతిరేకంగా సభలో ప్రత్యేక తీర్మానానికి పట్టు ► సీఎం దాటవేతతో ప్రతిపక్షాల ఆగ్రహం ► డీఎంకే, కాంగ్రెస్,ఐయూఎంఎల్ వాకౌట్ ► తాము సైతం అని అన్నాడీఎంకే మిత్రుల నిరసన ► ళని తీరుపై మండిపాటు పశు వధపై నిషేధం విధిస్తూ కేంద్రం తీసుకున్న చర్యలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో ప్రత్యేక తీర్మానానికి ప్రతి పక్షాలు పట్టుబట్టాయి. సీఎం పళనిస్వామి దాటవేత ధోరణి అనుసరించడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశాయి. డీఎంకే, కాంగ్రెస్, ఐయూఎంఎల్ సభ్యులతో పాటు అన్నాడీఎంకే మిత్రపక్షంగా ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలు సైతం సభ నుంచి వాకౌట్ చేశారు. సాక్షి, చెన్నై : పశువధపై నిషేధం విధిస్తూ కేంద్రం నోటిఫికేషన్ జారీచేసిన విషయం తెలిసిందే. సంతకు విక్రయ నిమిత్తం తీసుకెళ్లే పశువుల్ని కబేళాలకు అమ్మకూడదు, కొనకూడదు అన్న నిబంధనల్ని కేంద్రం విధించింది. దీనిపై రాష్ట్రంలో అధికార పక్షం మినహా తక్కిన పార్టీలు ఆందోళనలు సాగిస్తూ వస్తున్నాయి. మంగళవారం ఈ వ్యవహారం అసెంబ్లీని తాకింది. ప్రశ్నోత్తరాల అనంతరం ప్రధాన ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ ప్రసంగాన్ని అందుకున్నారు. పశువధపై నిషేధం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను ముక్తకంఠంతో వ్యతిరేకిద్దామని పిలుపునిచ్చారు. కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రత్యేక తీర్మానం తీసుకొద్దామని సూచించారు. పలు రాష్ట్రాలు తమ వ్యతిరేకతను అసెంబ్లీ తీర్మానాల రూపంలో తెలియజేశాయని గుర్తుచేశారు. సీఎం దాటవేత ధోరణి ప్రతిపక్షాల తీర్మానం పట్టు నినాదానికి సీఎం పళనిస్వామి దాటవేత ధోరణి అనుసరించారు. తన ప్రసంగంలో తమిళనాడులో 40 ఏళ్లుగా పశువధ నిషేధంలో ఉందంటూ పురాణ పాఠాన్ని అందుకున్నారు. ప్రస్తుతం వ్యవహారం కోర్టులో ఉన్న దృష్ట్యా, తీర్పు మేరకు తదుపరి నిర్ణయం తీసుకుందామంటూ ముగించారు. దీంతో ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తంచేశాయి. కనీసం కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకించకపోవడం శోచనీయమని, దీన్నిబట్టి చూస్తే, కేంద్రానికి భజన పాడుతున్నట్టు స్పష్టం అవుతోందని నినదించారు. ప్రత్యేక తీర్మానానికి పట్టుబడుతూ నినదించినా, స్పీకర్ ధనపాల్ ఖాతరు చేయలేదు. దీంతో సభ నుంచి డీఎంకే, కాంగ్రెస్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ సభ్యులు వాకౌట్ చేశారు. ఈ సమయంలో అన్నాడీఎంకేకు మిత్రపక్షంగా ఉన్న, ఆ పార్టీ చిహ్నంతో ఎన్నికల్లో గెలిచిన కరుణాస్, తమీమున్అన్సారీ, తనియరసు సీఎం తీరుకు నిరసన వ్యక్తంచేశారు. ప్రత్యేక తీర్మానం తీసుకురావాలని డిమాండ్‌చేశారు. ఇందుకు స్పీకర్ నిరాకరించడంతో తాము సైతం సభ నుంచి వాకౌట్ చేస్తున్నామని ప్రకటించి నిరసన వ్యక్తంచేశారు. కాగా, అన్నాడీఎంకేకి మిత్రులుగా ఉన్న ఆ ముగ్గురు సభనుంచి వాకౌట్ చేయడం చర్చకు దారితీసింది. వాకౌట్ అనంతరం మీడియాతో స్టాలిన్ మాట్లాడుతూ, కేంద్రం గుప్పెట్లో ఈ ప్రభుత్వం ఉందని స్పష్టం అవుతోందన్నారు. కేంద్రానికి భయపడి, ప్రజా వ్యతిరేకత పథకాలన్నీ ఇక్కడకు ఆహ్వానిస్తున్నారని మండిపడ్డారు. తమీమున్ అన్సారి మాట్లాడుతూ, సర్వత్రా వ్యతిరేకిస్తూ వస్తున్న కేంద్రం నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆహ్వానించే విధంగా ముందుకు సాగడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోని పక్షంలో తదుపరి తమ కార్యాచరణ ప్రకటించాల్సి ఉంటుందని హెచ్చరించారు. వాగ్వాదం అసెంబ్లీలో ఉదయం ప్రశ్నోత్తరాల సమయంలో వాగ్వివాద పర్వం హోరెత్తింది. పుదుకోట్టైలో సీఎం కార్యక్రమానికి వెళ్లిన డీఎంకే ఎమ్మెల్యేల అరెస్టు వ్యవహారంపై ఆరోగ్యశాఖ మంత్రి విజయభాస్కర్, ప్రధాన ప్రతిపక్ష నేత ఎంకేస్టాలిన్ మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం సాగింది. ఇక, స్థానిక ఎన్నికల నిర్వహణ జాప్యం డీఎంకే పుణ్యమేనని మంత్రి ఎస్పీ వేలుమణి చేసిన వ్యాఖ్యలు డీఎంకే, అన్నాడీఎంకే సభ్యులు మధ్య వివాదానికి దారితీసింది. స్పీకర్ జోక్యంతో సద్దుమణిగింది. ఇక, కోయంబత్తూరు సీపీఎం కార్యాలయంపై జరిగిన పెట్రోల్ బాంబు దాడి విషయంగా సీఎం స్పందిస్తూ, ఆ దాడిని ఖండిస్తూ, మూడు బృందాల్ని రంగంలోకి దించి విచారణ సాగిస్తున్నామన్నారు. -
మళ్లీ ఒకటిగా..
► ఒకే వేదికగా ప్రతి పక్షాలు ► పశువధ వ్యవహారంలో కేంద్రం తీరుపై శివాలు ► కోర్టు రూపంలో కేంద్రానికి చెక్ సాక్షి, చెన్నై : రాష్ట్రంలో ప్రతి పక్షాలన్నీ మళ్లీ ఒకే వేదిక మీదకువచ్చాయి. కేంద్రాన్ని ఢీకొట్టేందుకు సిద్ధమయ్యాయి. పశువధ వ్యవహారంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబడుతూ ఉమ్మడిగా ప్రతి పక్షాల నేతలు ప్రకటన విడుదల చేయడం గమనార్హం. ఇక, కేంద్రం నిర్ణయానికి కోర్టు స్టే విధించడంతో రైతులు, మాంసం విక్రయదారులు, పశువుల పెంపకం దారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రతి పక్షాలు ఎవరి దారి వారిది అన్నట్టుగా సాగుతూ వచ్చిన విషయం తెలిసిందే. రైతు సమస్యల్ని అస్త్రంగా చేసుకుని డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ ఇచ్చిన పిలుపునకు కొన్ని ప్రతి పక్షాలు కదిలాయి. ఆ మేరకు డీఎంకే, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, వీసీకే, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, మనిదనేయమక్కల్ కట్చిలు ఏకమైన రైతు సమస్యలపై ఉద్యమించాయి. తదుపరి ఎవరి దారి వారిదే. ఈ పరిస్థితుల్లో పశువధకు వ్యతిరేకంగా కేంద్రం వ్యవహరిస్తుండడంతో మళ్లీ ప్రతి పక్షాలు ఏకం కావడం గమనార్హం. నేతలు ఉమ్మడిగా ప్రకటన విడుదల చేస్తూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై శివాలెత్తడం బట్టి చూస్తే, ఈ స్నేహం రానున్న ఎన్నికల్లోనూ సాగేనా అన్న ప్రశ్నను తెరమీదకు తెచ్చింది. మళ్లీ ఏకం.. ఉమ్మడిగా ప్రకటన: డీఎంకే కార్య నిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్, తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు తిరునావుక్కరసర్, సీపీఎం నేత రామకృష్ణన్, సీపీఐ నేత ముత్తరసన్, వీసీకే నేత తిరుమావళవన్, ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్ నేత ఖాదర్ మొహిద్దీన్, మనిదయనే మక్కల్ కట్చి నేత జవహరుల్లాలు కేంద్రం తీరును తప్పుబడుతూ ఉమ్మడిగా మంగళవారం ప్రకటన విడుదల చేశారు. పశువధ విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని లేని పక్షంలో, తీవ్రంగా స్పందించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నోరు మెదపక పోవడంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఖండిస్తూ నేతలు తీవ్రంగానే స్పందించారు. ఇక, డీఎంకే, కాంగ్రెస్‌ల నేతృత్వంలో బుధవారం ఆందోళనలుసాగనున్నడం గమనార్హం. కోర్టు స్టేతో హర్షం : కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా, రాష్ట్ర ప్రభుత్వ మౌన వైఖరికి నిరసనగా రాష్ట్రంలో మంగళవారం కూడా ఆందోళనలు హోరెత్తాయి. ఈ పరిస్థితుల్లో మదురైకు చెందిన సెల్వ గోమతితో పాటు మరొకరు దాఖలు చేసిన పిటిషన్‌కు మదురై ధర్మాసం స్పందించడంతో సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. పశువుల పెంపకం దారులు, మాంసం విక్రయ దారులు, రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం నిర్ణయానికి మధ్యంతర స్టే విధించ బడ్డా, ఇది తాత్కాలికమే కావడంతో నిరంతరంగా అడ్డుకట్ట వేయాలన్న నినాదంతో సర్వత్రా ముందుకు సాగుతున్నారు.