‘పశువధ’ రగడ
► నిషేధానికి వ్యతిరేకంగా సభలో ప్రత్యేక తీర్మానానికి పట్టు
► సీఎం దాటవేతతో ప్రతిపక్షాల ఆగ్రహం
► డీఎంకే, కాంగ్రెస్,ఐయూఎంఎల్ వాకౌట్
► తాము సైతం అని అన్నాడీఎంకే మిత్రుల నిరసన
► ళని తీరుపై మండిపాటు
పశు వధపై నిషేధం విధిస్తూ కేంద్రం తీసుకున్న చర్యలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో ప్రత్యేక తీర్మానానికి ప్రతి పక్షాలు పట్టుబట్టాయి. సీఎం పళనిస్వామి దాటవేత ధోరణి అనుసరించడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశాయి. డీఎంకే, కాంగ్రెస్, ఐయూఎంఎల్ సభ్యులతో పాటు అన్నాడీఎంకే మిత్రపక్షంగా ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలు సైతం సభ నుంచి వాకౌట్ చేశారు.
సాక్షి, చెన్నై : పశువధపై నిషేధం విధిస్తూ కేంద్రం నోటిఫికేషన్ జారీచేసిన విషయం తెలిసిందే. సంతకు విక్రయ నిమిత్తం తీసుకెళ్లే పశువుల్ని కబేళాలకు అమ్మకూడదు, కొనకూడదు అన్న నిబంధనల్ని కేంద్రం విధించింది. దీనిపై రాష్ట్రంలో అధికార పక్షం మినహా తక్కిన పార్టీలు ఆందోళనలు సాగిస్తూ వస్తున్నాయి.
మంగళవారం ఈ వ్యవహారం అసెంబ్లీని తాకింది. ప్రశ్నోత్తరాల అనంతరం ప్రధాన ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ ప్రసంగాన్ని అందుకున్నారు. పశువధపై నిషేధం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను ముక్తకంఠంతో వ్యతిరేకిద్దామని పిలుపునిచ్చారు. కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రత్యేక తీర్మానం తీసుకొద్దామని సూచించారు. పలు రాష్ట్రాలు తమ వ్యతిరేకతను అసెంబ్లీ తీర్మానాల రూపంలో తెలియజేశాయని గుర్తుచేశారు.
సీఎం దాటవేత ధోరణి
ప్రతిపక్షాల తీర్మానం పట్టు నినాదానికి సీఎం పళనిస్వామి దాటవేత ధోరణి అనుసరించారు. తన ప్రసంగంలో తమిళనాడులో 40 ఏళ్లుగా పశువధ నిషేధంలో ఉందంటూ పురాణ పాఠాన్ని అందుకున్నారు. ప్రస్తుతం వ్యవహారం కోర్టులో ఉన్న దృష్ట్యా, తీర్పు మేరకు తదుపరి నిర్ణయం తీసుకుందామంటూ ముగించారు. దీంతో ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తంచేశాయి. కనీసం కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకించకపోవడం శోచనీయమని, దీన్నిబట్టి చూస్తే, కేంద్రానికి భజన పాడుతున్నట్టు స్పష్టం అవుతోందని నినదించారు.
ప్రత్యేక తీర్మానానికి పట్టుబడుతూ నినదించినా, స్పీకర్ ధనపాల్ ఖాతరు చేయలేదు. దీంతో సభ నుంచి డీఎంకే, కాంగ్రెస్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ సభ్యులు వాకౌట్ చేశారు. ఈ సమయంలో అన్నాడీఎంకేకు మిత్రపక్షంగా ఉన్న, ఆ పార్టీ చిహ్నంతో ఎన్నికల్లో గెలిచిన కరుణాస్, తమీమున్‌అన్సారీ, తనియరసు సీఎం తీరుకు నిరసన వ్యక్తంచేశారు. ప్రత్యేక తీర్మానం తీసుకురావాలని డిమాండ్‌చేశారు. ఇందుకు స్పీకర్ నిరాకరించడంతో తాము సైతం సభ నుంచి వాకౌట్ చేస్తున్నామని ప్రకటించి నిరసన వ్యక్తంచేశారు.
కాగా, అన్నాడీఎంకేకి మిత్రులుగా ఉన్న ఆ ముగ్గురు సభనుంచి వాకౌట్ చేయడం చర్చకు దారితీసింది. వాకౌట్ అనంతరం మీడియాతో స్టాలిన్ మాట్లాడుతూ, కేంద్రం గుప్పెట్లో ఈ ప్రభుత్వం ఉందని స్పష్టం అవుతోందన్నారు. కేంద్రానికి భయపడి, ప్రజా వ్యతిరేకత పథకాలన్నీ ఇక్కడకు ఆహ్వానిస్తున్నారని మండిపడ్డారు. తమీమున్ అన్సారి మాట్లాడుతూ, సర్వత్రా వ్యతిరేకిస్తూ వస్తున్న కేంద్రం నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆహ్వానించే విధంగా ముందుకు సాగడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోని పక్షంలో తదుపరి తమ కార్యాచరణ ప్రకటించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
వాగ్వాదం
అసెంబ్లీలో ఉదయం ప్రశ్నోత్తరాల సమయంలో వాగ్వివాద పర్వం హోరెత్తింది. పుదుకోట్టైలో సీఎం కార్యక్రమానికి వెళ్లిన డీఎంకే ఎమ్మెల్యేల అరెస్టు వ్యవహారంపై ఆరోగ్యశాఖ మంత్రి విజయభాస్కర్, ప్రధాన ప్రతిపక్ష నేత ఎంకేస్టాలిన్ మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం సాగింది. ఇక, స్థానిక ఎన్నికల నిర్వహణ జాప్యం డీఎంకే పుణ్యమేనని మంత్రి ఎస్‌పీ వేలుమణి చేసిన వ్యాఖ్యలు డీఎంకే, అన్నాడీఎంకే సభ్యులు మధ్య వివాదానికి దారితీసింది. స్పీకర్ జోక్యంతో సద్దుమణిగింది. ఇక, కోయంబత్తూరు సీపీఎం కార్యాలయంపై జరిగిన పెట్రోల్ బాంబు దాడి విషయంగా సీఎం స్పందిస్తూ, ఆ దాడిని ఖండిస్తూ, మూడు బృందాల్ని రంగంలోకి దించి విచారణ సాగిస్తున్నామన్నారు.