శాంతించండి!
సాక్షి, చెన్నై:అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత కర్ణాటకలోని పరప్పన అగ్రహారం చెరలో ఉన్న విషయం తెలిసిందే. ఆమెకు జైలు శిక్ష విధించిన రోజు నుంచి రాష్ట్రంలో అన్నాడీఎంకే శ్రేణులు నిరసనబాట పట్టాయి. జయలలితను విడుదల చేయాలన్న డిమాండ్‌తో సాగుతున్న ఈ నిరసనలు అక్కడక్కడ శ్రుతి మించుతున్నాయి. అమ్మకు ఎదురైన కష్టాన్ని తలచుకుని ఆవేదనకులోనై గుండె పోటుతో కొందరు, ఆత్మహత్యలతో మరి కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 70 మంది వరకు ఇలా మరణించినట్టు సంకేతాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో జయలలిత అనారోగ్యంతో ఉన్నట్టుగా ప్రచారం ఊపందుకోవడంతో అన్నాడీఎంకే వర్గాల్లో ఆందోళన నెలకొంది. ఇది కాస్త ఎక్కడ శాంతి భద్రతలకు విఘాతం కల్గిస్తుందోనన్న ఆందోళన బయలుదేరింది.
ఇబ్బంది కల్గించొద్దు: రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలిగించకుండా, ప్రజలకు ఇబ్బంది కల్గకుండా ముందుకు సాగాలని పార్టీ శ్రేణులకు జయలలిత ఆదివారం సంకేతం ఇచ్చారు. పరప్పన అగ్రహారం జైలు వర్గాల ద్వారా ఈ సమాచారం పంపించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగా ఉన్నట్టు జైలు వర్గాలు స్పష్టం చేశాయి. ఇక కార్యకర్తలను ఉద్దేశించి ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా, శాంతియుతంగా ముందుకు సాగాలని పిలుపు నిచ్చారు. తనను చూడాలన్న ఆశతో ఎవరూ బెంగళూరుకు రావొద్దని సూచించారు. జైలులో ఉన్న జయలలిత అక్కడ జరిగిన దసరా వేడుకకు దూరంగా ఉన్నారు. ఆ రోజున జయలలితతో శశికళ, సుధాకరన్, ఇలవరసి కలుసుకున్నట్టు జైలు వర్గాలు పేర్కొంటున్నాయి.
కొనసాగుతున్న నిరసనలు: జయలలితకు పడ్డ శిక్షను వ్యతిరేకిస్తూ ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కొనసాగాయి. అన్నాడీఎంకే శ్రేణుల నే తృత్వంలో దీక్షలు, నిరసన ర్యాలీలు, మౌన దీక్షలు కొనసాగారుు. జయలలితకు బెయిల్ రావాలని, ఆమె బయటకు రావాలని వేడుకుంటూ ఆలయాల్లో పూజలు చేశారు. మంత్రి వలర్మతి నేతృత్వంలో హోమాది కార్యక్రమాలు, నిప్పు కుండలతో ఆధ్యాత్మిక ర్యాలీలు నిర్వహించారు. చెన్నైలో ప్రభుత్వ విప్ మనోహరన్ నేతృత్వంలో అన్నాడీఎంకే ఎమ్మెల్యేల మానవ హారం నిర్వహించారు. అన్నాడీఎంకే, డీఎండీకే రెబల్, మిత్ర పక్షాల ఎమ్మెల్యేలు నల్ల చొక్కాలు ధరించి మెరీనా తీరానికి తరలి వచ్చారు. గాంధీ విగ్రహం నుంచి మానవ హారం నిర్వహించారు. కార్పొరేషన్ మేయర్ సైదై దురై స్వామి నేతృత్వంలో అన్నాడీఎంకే కౌన్సిలర్లు ఎంజీయార్ సమాధి వద్ద దీక్ష నిర్వహించారు.
ప్రైవేటు బంద్: జయలలితకు మద్దతుగా ప్రైవేటు బస్సుల యాజమాన్యాలు బంద్ పాటించాయి. ఎక్కడికక్కడ బస్సులు షెడ్లకు పరిమితమయ్యాయి. డ్రైవర్లు, క్లీనర్లు, యజమానులు నిరసన దీక్షల్లో కూర్చున్నారు. కరూర్‌లో 200, ఈరోడ్‌లో 250, నామక్కల్‌లో 300, విల్లుపురంలో 150, ఇతర ప్రాంతాల్లో వందకు పైగా ప్రైవేటు బస్సులు ఆగాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు బస్సులు ఆగడంతో ప్రయాణికులకు తంటాలు తప్పలేదు. రాష్ట్రంలో అనేక మారుమూల గ్రామాలకు ఒకటి అరా ప్రభుత్వ బస్సులు న డుస్తున్నాయి. అత్యధికంగా ప్రైవేటు బస్సులు పలు మార్గాల్లో నడుస్తుండడంతో ఆయా ప్రాంతాల్లోని ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. కొన్ని చోట్ల ప్రభుత్వ బస్సులు ఓవర్ లోడ్‌తో ముందుకు కదలక తప్పలేదు. సోమవారం విమానాశ్రయాల్లోని ప్రైవేటు టాక్సీ డ్రైవర్లు జయలలితకు మద్దతుగా ఓ రోజు టాక్సీ బంద్‌కు పిలుపునిచ్చారు.
జైలు మార్పు నినాదం: పరప్పన అగ్రహారం చెరలో ఉన్న జయలలితను శాంతి భద్రతల దృష్ట్యా, మరో జైలుకు లేదా ఆస్పత్రికి మార్చాలన్న నినాదం తెర మీదకు వచ్చింది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి టీ పాండియన్ మాట్లాడుతూ, జయలలితను ఆస్పత్రికి తరలించడం లేదా, మరో జైలుకు మార్చే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇందుకు కర్ణాటక ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. విచారణతో పాటుగా ఆమె శిక్షను ఎదుర్కొనే రీతిలో ఈ మార్పు ఉండాలని సూచించారు. ఇక, జయలలితను చెన్నై పుళల్ జైలుకు మారిస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ కేంద్ర సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్ పేర్కొన్నారు.