కన్నుకొట్టి... కొనొచ్చు
- కన్నుగీటే సెల్ఫీతో చెల్లింపు చేయొచ్చు
- అమెజాన్ అమ్ములపొదిలో కొత్త టెక్నాలజీ
- పేటెంట్ పొందిన ఆన్లైన్ దిగ్గజం
ఆన్లైన్ పోర్టల్‌లో ఏదైనా వస్తువు కొనాలంటే... పేమెంట్ చేయడానికి క్రెడిట్, డెబిట్ కార్డు వివరాలివ్వాలి... వన్‌టైమ్ పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయాలి. నెట్ బ్యాంకింగ్ ద్వారా అయితే యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌ల గోల తప్పదు. ఈ గోల ఏమీ లేకుండా ఓ సెల్ఫీతో ఆన్లైన్ పోర్టల్‌లో మనకు నచ్చిన వస్తువులు కొనేసుకొంటే. ఇదేదో సూపర్‌గా ఉంటుంది కదూ. ఆన్లైన్ వ్యాపార దిగ్గజం అమెజాన్ ఈ దిశగా పెద్ద ముందడుగు వేసింది.
సెల్ఫీతో మన కార్డు లేదా బ్యాంకు వివరాలను లింక్ చేసి.. వస్తువులు మనం కొంటున్నవేనని నిర్ధారించుకొని, పేమెంట్ జరిగిపోయే టెక్నాలజీకి అమెజాన్ ఇటీవలే పేటెంట్ పొందింది. సమీప భవిష్యత్తులో అమెజాన్‌లో ఈ సౌకర్యం కొనుగోలుదారులకు అందుబాటులోకి వచ్చే అవకాశముంది. నిజానికి కొద్దికాలం కిందటే మాస్టర్‌కార్డ్ సెల్ఫీతో చెల్లింపులను ఆథరైజ్ చేసే టెక్నాలజీని (సెల్ఫీ పే) పరీక్షించింది. అయితే ఎవరైనా మన ఫొటోను మన సెల్‌ఫోన్ కెమెరా ముందుంచి ఫొటో తీసి కొనుగోలు చేస్తే మనం మోసపోయే అవకాశం ఉంది.
ఇప్పుడు అమెజాన్ ఇలాంటి మోసాలను నివారించి కెమెరా ఎదురుగా ఉన్నది నిజమైన కొనుగోలుదారేనని, జీవించి ఉన్న వ్యక్తేనని నిర్ధారించుకోవడానికి కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేసి.. పేటెంట్ పొందింది. మనం కొనుగోలు చేసే వస్తువులను ఎంపిక చేసుకున్నాక చెల్లింపు జరపడానికి సెల్ఫీ తీసుకోవాలి. దీన్ని వాళ్ల రికార్డుల్లో ఉన్న మన ఫొటోతో సరిపోల్చుకొని తదుపరి మరో సెల్ఫీ అడుగుతుంది. నిజంగా మనమే కొంటున్నామని నిర్ధారించుకోవడానికి కుడి కన్నుగీటమని అడుగుతుంది.
కన్నుకొట్టేస్తే.. మనం అంతకుముందే వారికిచ్చిన కార్డు వివరాల ఆధారంగా కొనుగోలు చేసిన వస్తువులకు చెల్లింపు జరిగిపోతుంది. ఆయా కార్డులపై బిల్లింగ్ జరుగుతుంది. వస్తువులు మనకు డెలివరీ అవుతాయి. యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ల చౌర్యం, దుర్వినియోగం అనే సమస్యలే ఉండవని, ఇదో సురక్షిత చెల్లింపు విధానమని అమెజాన్ చెబుతోంది. కన్నుకొట్టడం అనేది సరదాగా ఉంటుందని ఈ విధానాన్ని ఎంచుకున్న అమెజాన్ తలను ఒక దిశలో కదపడం, నవ్వడం ద్వారా కూడా మన ఐడెంటిటీని ఆథరైజ్ చేసే వెసులుబాటును పొందుపర్చింది.
4(ఎ):మొబైల్లో అమెజాన్ సైట్లోకి వెళ్లి కొనాల్సిన వస్తువులను ఎంపిక చేసుకోవాలి.
4(బి): సెల్ఫీ కోసం ఒక బాక్స్ వస్తుంది. మన ముఖం అందులో వచ్చేలా సెల్ఫీ దిగాలి. ఫేషియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీ ద్వారా అమెజాన్ వద్దనున్న రికార్డుల్లోని మన ఫోటోతో దీన్ని పోల్చిచూస్తుంది.
4(సి): ఇతరులు మన మొబైల్ ద్వారా మన ఫోటోను కెమెరా
ముందు పెట్టి దుర్వినియోగం చేయకుండా... ‘దయచేసి
కుడికన్ను కొట్టండి’ అని అడుగుతుంది. కన్నుకొడితే...
కొనుగోలు చేస్తున్నది అసలైన వ్యక్తేనని గుర్తించి
చెల్లింపును ఆథరైజ్ చేస్తుంది.
4(డి): చెల్లింపు జరిగిపోయాక... మన ఆర్డర్‌ను ధ్రువీకరిస్తూ...
కృతజ్ఞతలు తెలిపే సందేశం వస్తుంది.