అనగనగా శనగ..
ఒంగోలు టూటౌన్ : శనగ సాగును రైతులు దాదాపు పక్కన పెట్టేశారు. పంట వేసేందుకు ఏ రైతూ ధైర్యం చేయడం లేదు. వ్యవసాయ శాఖ విత్తనాలు సరఫరా చేస్తున్నా.. రైతులు అంతగా ఆసక్తి చూపడం లేదు. కారణం.. మూడేళ్లుగా గిట్టుబాటు ధర దక్కక.. పండించిన శనగలన్నీ గోడౌన్లలో పేరుకుపోవడమే. దాదాపు 17.50 లక్షల క్వింటాళ్ల నిల్వలు కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ ఉన్నాయి. ప్రభుత్వం గిట్టుబాటు ధరకు కొనుగోలు చేస్తామని చెప్పి.. 4 నెలలు కావస్తోంది. ఇంత వరకు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు.
దీంతో శనగ పంట అంటేనే రైతులు బెంబేలెత్తుతున్నారు. గతంలో రబీ సీజన్లో శనగ పంటను ఇబ్బడిముబ్బడిగా సాగు చేశారు. 2013-14 రబీలో కూడా 69,465 హెక్టార్లలో శనగ సాగయింది. ప్రస్తుత రబీ సీజన్లో 88,817 హెక్టార్లలో సాగు లక్ష్యం కాగా ఇప్పటి వరకు కేవలం 2,349 హెక్టార్లకే పరిమితమైంది. అంటే మూడు శాతం మాత్రమే పంట సాగయింది. 62 వేల క్వింటాళ్ల శనగ విత్తనాలు అవసరమవుతాయని వ్యవసాయశాఖ ప్రభుత్వానికి ఇండెంట్ పెట్టగా.. 25 వేల క్వింటాళ్లు మాత్రమే పొజిషన్లో ఉంచారు. వీటిలో ఇప్పటి వరకు కేవలం 2,500 క్వింటాళ్ల శనగ విత్తనాలనే రైతులు రాయితీపై కొన్నారు.
జిల్లాలోని 56 మండలాల్లో వ్యవసాయశాఖ ద్వారా విత్తనాలు సరఫరా చేస్తున్నా శనగలు తీసుకునేందుకు రైతులు ఆసక్తి చూపడం లేదని వ్యవసాయ శాఖ జేడీ జే మురళీకృష్ణ తెలిపారు. రైతులంతా ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గుచూపుతున్నారని జేడీఏ పేర్కొన్నారు. ఎక్కువగా యూకలిప్టస్, మిర్చి, మినుము, అలసంద, మొక్కజొన్న, జొన్న లాంటి పంటల సాగుపై ఆసక్తి చూపుతున్నారని ఆయన వివరించారు.
జిల్లాలో పంటల సాగు 32 శాతం
‘జిల్లాలో ఇప్పటి వరకు మిరప 7,914 హెక్టార్లు, అలసంద 5,356 హెక్టార్లు, జొన్న 5,865 హెక్టార్లు, మొక్కజొన్న 2,145 హెక్టార్లలో సాగు చేశారు. వీటితో పాటు వరి 28,080 హెక్టార్లు, రాగి 42 హెక్టార్లు, వేరుశనగ 74 హెక్టార్లు, నువ్వులు 2,853 హెక్టార్లలో వేశారు. పత్తి రబీలో 1352 హెక్టార్లకు గాను 50 హెక్టార్లు, పొగాకు 36,983 హెక్టార్లలో సాగయింది. ఇంకా ఉల్లి, పసుపు, చెరకు, పెసర, చిరుధాన్యపు పంటలతో కలిపి మొత్తం ఇప్పటి వరకు 1,10,004 హెక్టార్లలో పంటలు వేశారు.
రబీ సాగు సాధారణ విస్తీర్ణం 3,44,321 హెక్టార్లు కాగా ఇప్పటి వరకు 32 శాతం పంటలు వేశారని’ జేడీఏ వెల్లడించారు. ప్రస్తుత సీజన్లో పొద్దుతిరుగుడు విత్తనాలు 870 క్వింటాళ్లు, మొక్కజొన్న 1,648 క్వింటాళ్లు, జొన్న 500 క్వింటాళ్లు, ఆముదం 200 క్వింటాళ్లు, నువ్వుల విత్తనాలు 95 క్వింటాళ్లను రైతులకు అందుబాటులో ఉంచామని, ఇంకా రైతులకు రాయితీపై విత్తనాలు అందజేస్తామని స్పష్టం చేశారు. విత్తనాల ధరను బట్టి కిలోకు రూ.25 రాయితీ ఇస్తామన్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో భూములు పదునెక్కాయని, సాగు విస్తీర్ణం ఇంకా పెరుగుతుందని జేడీఏ తెలిపారు.