Pedakakani Police Station
-
ఎంపీ గల్లా అనుచరులపై కేసు
పెదకాకాని (పొన్నూరు) : పాత వాహనం కొనుగోలు విషయంలో కత్తితో దాడికి పాల్పడిన గుంటూరు పార్లమెంట్ సభ్యుడు గల్లా జయదేవ్ అనుచరులు ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు గుంటూరు జిల్లా పెదకాకాని పోలీసులు తెలిపారు. గుంటూరు ఆటోనగర్‌లో శనివారం పాత బస్సు కొనుగోలు చేసిన వ్యవహారంలో జరిగిన ఘర్షణలో ఎంపీ గల్లా జయదేవ్ అనుచరులు షబ్బీర్ ఆయన కుమారులు ఇంతియాజ్, రియాజ్, ఫిరోజ్, ఆయన సోదరుని కుమారుడు సయ్యద్ గఫార్‌లు కలిసి వైఎస్సార్సీపీ కార్యకర్త మురాద్ అలీపై దాడి చేయగా, అడ్డుకున్న మురాద్ అలీ సోదరుని కుమారుడు అక్రమ్‌పై కత్తితో దాడి చేసి గాయపరచిన సంగతి విదితమే. ఈ ఘటనలో మురాద్ అలీ ఫిర్యాదు మేరకు ఎంపీ అనుచరులు ఐదుగురిపై కేసు నమోదు చేశారు. కాగా, ఇదే వ్యవహారంలో ఇంతియాజ్ ఫిర్యాదు మేరకు మురాద్ అలీ, అక్రమ్‌లపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ జె.అనురాధ తెలిపారు. చదవండి : గల్లా అనుచరుల దాష్టీకం -
కీచక ప్రొఫెసర్‌పై కేసు నమోదు
పెదకాకాని: నాగార్జున వర్సిటీలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్‌పై గుంటూరు జిల్లా పెదకాకాని పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. వివరాలిలా ఉన్నాయి. యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలో విజయనగరానికి చెందిన ఓ విద్యార్థిని బీటెక్ మెకానికల్ ద్వితీయ సంవత్సరం అభ్యసిస్తోంది. ఆ విభాగంలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ కృష్ణకిషోర్ ఈనెల 15న విద్యార్థిని ఫోన్‌కు ఓ మెసేజ్ పెట్టాడు. 16న డిపార్ట్మెంట్కు ఒక్కదానివే రావాలని, పర్సనల్‌గా మాట్లాడాలని అందులో ఉంది. ఆమె సహ విద్యార్థినిని తోడు తీసుకుని వెళ్లగా ఆమె ను బయటకు పంపి, బాధిత విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించడమే గాక, మరో వ్యక్తితో ఆమె కలసి ఉండటం ముగ్గురం చూశామనీ, వారితోనూ మాట్లాడమని చెప్పాడు. ఇంకా లాప్టాప్లో విద్యార్థిని ఫేస్‌తో మార్ఫింగ్ చేసిన నగ్న చిత్రాలను చూపాడు. అతడినుంచి తప్పించుకుని వచ్చిన వి ద్యార్థిని ప్రిన్సిపాల్, తల్లిదండ్రులకు జరిగిన విషయం చెప్పింది. 16వ తేదీ రాత్రి కూడా కృష్ణకిషోర్ మెసేజ్ పెట్టడంతో మంగళవారం తండ్రిని రప్పించి తనతో కలసి పెదకాకాని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు మంగళగిరి డిఎస్పీ ఎం మధుసూదనరావు తెలిపారు.