Peddavaduguru
-
జేసీ సోదరులకు షాక్
సాక్షి, పెద్దవడుగూరు: తాడిపత్రి నియోజకవర్గంలో జేసీ సోదరులకు దెబ్బమీద దెబ్బ పడుతోంది. వారి అరాచకాలు భరించలేని టీడీపీ నేతలు, కార్యకర్తలు ఎన్నికల వేళ వైఎస్సార్ సీపీకి మద్దతు తెలుపుతూ ఆపార్టీలో చేరుతున్నారు. ఇప్పటికే చాలా మంది వైఎస్సార్ సీపీ కండువాలు వేసుకోగా...శుక్రవారం మండల పరిధిలోని చిత్రచేడు గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ, జేసీ సోదరుల ప్రధాన అనుచరుడు రఘునాథరెడ్డి, ఆయన కుమారులు రంగారెడ్డి, రవీంద్రారెడ్డిలతో కలసి తాడిపత్రి వైఎస్సార్ సీపీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రఘునాథరెడ్డి మాట్లాడుతూ, ఏళ్లుగా జేసీ సోదరులకు అండగా నిలిచినా...తమకు కనీస గౌరవం, గుర్తింపు ఇవ్వలేదన్నారు. పైగా టీడీపీ పాలనలో తాడిపత్రిలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. ఇక ప్రజా సంక్షేమం కోసం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలు పేదల అభ్యున్నతికి ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. అందువల్లే వైఎస్సార్సీపీకి మద్దతు తెలిపేందుకు 150 మంది అనుచరులతో కలిసి వైఎస్సార్సీపీలో చేరినట్లు తెలిపారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుపునకు తనవంతు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో మండల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. -
దివాకరా.. విను మా మొర !
► అభివృద్ధికి దూరంగా పెద్దవడుగూరు ► జేసీ దివాకర్‌రెడ్డి దత్తత గ్రామంలో సమస్యల తిష్ట ► జేసీ తీరుపై స్థానికుల అసంతృప్తి పెద్దవడుగూరు: అనంతపురం జిల్లాలోనే ఈ ప్రాంతానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. జాతిపిత మహాత్మాగాంధి స్వాతంత్య్ర సమరం జరుగుతున్న సమయంలో 1934లో ఈ గ్రామాన్ని కుమ్మెత చిన్నారపరెడ్డి ఆహ్వానం మేరకు సందర్శించారు. సామంతరాజులు కూడా పరిపాలించిన ఈ ప్రాంతం ప్రస్తుతం అభివృద్ధికి దూరంగా ఉంది. అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి దత్తత తీసుకొని రెండేళ్లవుతున్నా ఏ మాత్రం పట్టించుకోకపోవడంతో జనంతా కష్టాలతో సావాసం చేస్తున్నారు. - పెద్దవడుగూరు పేరు వచ్చిందిలా.... ఈ ప్రాంతాన్ని సామంతరాజులు పరిపాలించినట్లు కొన్ని చారిత్రక ఆధారాల వల్ల తెలుస్తోంది. 17 వ శతాబ్ధం నుండి జనజీవనం ప్రారంభం అయినట్లుగా చరిత్రకారులు చెబుతారు. ఇక్కడ శైవారాధకులు అధికంగా నివసించేవారు. పూర్వం బ్రాహ్మణులు ఇక్కడ ఎక్కువగా నివసించేవారు. బ్రాహ్మణ బాలురకు ఉపనయన సంస్కారం చేయడమే వీరికి ప్రధాన వృత్తిగా ఉండేది. ఉపనయనమునే స్థానిక వ్యవహారిక భాషలో వడుగు అని అంటారు. వడుగుల కార్యక్రమం అధికంగా జరుగుతున్న గ్రామం కనుక ఇది వడుగూరుగా పిలువ బడిందని చరిత్రకారులు చెబుతారు. కాలక్రమేనా పెద్దవడుగూరుగా మారింది. పట్టించుకోని జేసీ ప్రస్తుత అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి... ఎన్నో ఏళ్లు తాడిపత్రి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. అయితే పెద్దవడుగూరు గ్రామాన్ని మాత్రం ఆయన ఏరోజూ పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి. కేవలం ఎన్నికల సమయంలోనూ, సంక్షేమ పథకాలు ప్రారంభ సమయంలోనూ గ్రామాల్లో పర్యటించేవారని గ్రామస్తులు వాపోతున్నారు. రెండు సంవత్సరాల క్రితం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. సమస్యల తిష్ట డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో ఊరంతా కంపు కొడుతూ పెద్ద దిబ్బలాగా కనపడుతోంది. గ్రామంలో ఎక్కడ చూసినా మురికి గుంతలే దర్శనం ఇస్తున్నాయి. గ్రామం నుండి మిడుతూరుకి Ðవెళ్ళే ప్రధాన రహదారికి సిమెంటు రోడ్డుకు ఇరు పక్కలా మురికి నీటి కాలువలు లేకపోవడంతో చిన్న పాటి వర్షం వస్తే రోడ్డు పైకి వర్షంనీరు వచ్చి దుర్వాసన వెదజల్లుతోంది. గ్రామంలోకి ఎమ్మెల్యే వస్తున్నాడని తెలిస్తేనే అధికారులు గ్రామంలోని మురికి కాలువలు , రోడ్లు శుభ్రం చేస్తారు తప్ప తరువాత పట్టించుకోరని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వంకగేరిలో సైడు కాలువల్లో పూడికతీయక పోవడంతో మురికి నీరు సీసీ రోడ్డు పై చేరి దుర్వాసన వెదజల్లుతోందని స్థానికులు వాపోతున్నారు. దీంతో రోగాల బారిన పడుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దత్తత తీసుకున్నా అభివృద్ధి శూన్యం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి పెద్దవడుగూరును దత్తత తీసుకున్న తర్వాత అభివృద్ధి పేరుతో గ్రామంలో కొన్నిమార్పులు తీసుకురావడానికి చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా కొద్దిరోజులు అధికారులు గ్రామంలో తిరిగి సీసీ రోడ్లు, సైడు కాలువలు నిర్మించి అభివృద్ధి పరుస్తామని చెప్పారు. అయితే ఇప్పటి వరకూ కేవలం గుత్తిరోడ్డు మాత్రమే అభివృద్ధి చేశారు. నూతనంగా రూ.2.5 కోట్ల కల్యాణ మండపాన్ని నిర్మిస్తున్నారు. పెద్దవంకలో వాటర్‌షెడ్డు నిర్మాణం, గండికోట రిజర్వాయర్ నుండి శాశ్వత తాగునీటి పరిష్కారానికి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్ విరాళం ఇచ్చారు. సుమారు రూ. 35 లక్షల పన్నులు వసూళ్లతో పంచాయతీ ఆర్థికంగా బలంగా ఉన్నా ఇంత వరకూ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి పనులు మాత్రం ఊపందుకోలేదు. పెద్ద పనులు చేపడుతున్న జేసీ సోదరులు చిన్న చిన్న సమస్యలను పరిష్కరించడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేనేత కాలనీలో సీసీ రోడ్లు లేక స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటి వరకు తమ కాలనీ వైపు కన్నెత్తి చూడటం లేదని వాపోతున్నారు. గ్రామంలో వీధి దీపాలు కూడా వెలగడం లేదంటే పరిస్థితి ఎంత దారుణంగా అర్థం చేసుకోవాలని అంటున్నారు. దూరమైన పాఠశాల 30 ఏళ్లుగా గ్రామం నడిబొడ్డున ఉన్న ప్రధాన ప్రాథమిక పాఠశాల భవనాన్ని తొలగించి 16–09–2015 లో పంచాయతీ కాంప్లెక్స్ నిర్మాణం చేయడానికి భూమి పూజ చేశారు. ఈ ఆదేశాలు కూడా వివాదాస్పదమయ్యాయి. ఎందుకంటే ఈ పాఠశాల ఎస్సీ కాలనీ ప్రజలకు దగ్గరగా ఉండటంతో ఎక్కువగా ఎస్సీ విద్యార్థులే ఈ పాఠశాలలో చదువుకునేందుకు ఎక్కవగా వస్తుండేవారు. పాఠశాల భవనాన్ని కూల్చివేయడాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు తప్పుబడుతున్నారు. ప్రస్తుతం ఈ పాఠశాలను జిల్లా పరిషత్ పాఠశాలలోకి మార్చడంతో దూరం ఎక్కువడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని అసహనం వ్యక్తం చేస్తున్నారు. దిష్టిబొమ్మలా డంపింగ్‌యార్డ్ గ్రామంలో చెత్త నిల్వ కేంద్రం నిర్మాణం పూర్తయినా ఇటీవల అగ్ని ప్రమాదానికి గురైంది.ఇందులో చెత్తను వేరుచేసి సంపదను సృష్టించే యంత్రాలను ఇప్పటి వరకూ ఏర్పాటు చేయకపోవడంతో దిష్టిబొమ్మలా ఉంది. అయితే పంచాయితీ ఆర్థికంగా ఎదుగుదల కోసం కాంప్లెక్స్ నిర్మిస్తామని ఎమ్మెల్మే చెబుతున్నారు. కాలనీ వైపు కన్నెతి చూడలేదు గ్రామంలోని చేనేత కాలనీలో సుమారుగా 150 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. కాలనీలో సమస్యలు అధికంగా ఉన్నాయి. కొన్ని చోట్ల మాత్రమే సీసీ రోడ్లు వేశారు. ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత జేసీ ప్రభాకర్‌రెడ్డి కాలనీలోకి ఒక్కసారి కూడా రాలేదు. - సుధీర్ చేనేత కాలనీ ఇబ్బందులు పట్టవా? సీసీ రోడ్లు వేశారు. కాని సైడు కాలువలు వేయలేదు. ఎక్కడి మురికి నీరు అక్కడే నిలువ ఉంటోంది. ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. కళ్యాణ మండపం, గుత్తి రోడ్డు తప్ప ప్రజల ఇబ్బందులు పట్టించుకోలేదు. - వెంకటనారాయణ ఎస్టీ కాలనీ ⇒నియోజకవర్గం : తాడిపత్రి ⇒మండలం: పెద్దవడుగూరు ⇒జనాభా : 5963 ⇒పురుషులు: 2952 ⇒స్త్రీలు : 3011 ⇒ఓటర్లు :4179 ⇒పురుషులు: 2334 ⇒స్త్రీలు : 2145 ⇒చదువుకున్న వారు :3858 ⇒పురుషులు:1920 ⇒స్త్రీలు :1938 -
బాలిక కిడ్నాప్ కేసు చేధింపు
పెద్దవడుగూరు: బాలిక కిడ్నాప్ కేసును పోలీసులు సోమవారం చేధించారు. మండలంలోని కొండూరు గ్రామానికి చెందిన బాలికను గత నెల 28న అదే గ్రామానికి చెందిన భూమిపోగుల మారుతీప్రసాద్, మరో ముగ్గురితో కలిసి కిడ్నాప్ చేసినట్లు తండ్రి సూర్యనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని రంగంలోకి దిగిన పోలీసులు కిడ్నాపర్ల కదలికలపై ప్రత్యేక దృష్టి పెట్టి అదుపులోకి తీసుకున్నారు. బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు. కిడ్నాప్ చేసిన వ్యక్తిని సోమవారం అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరిచినట్లు ఎస్ఐ రమణారెడ్డి తెలిపారు. -
కెనాల్లో గుర్తు తెలియని మృతదేహం
పెద్దవడుగూరు: మండలంలోని లక్ష్ముంపల్లి సమీపంలో గల కెనాల్ లో ఓ గుర్తు తెలియని వ్యక్తి(50) మృతదేహాన్ని బుధవారం కనుగొన్నట్లు ఎస్ఐ రమణారెడ్డి తెలిపారు. పది రోజుల సదరు వ్యక్తి కెనాల్లో పడి మరణించి ఉండొచ్చని భావిస్తున్నారు. మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్నాయి. ఘటనా స్థలంలో ఎయిడ్స్‌కు సంబంధించిన మాత్రల డబ్బా లభించడంతో మృతుడు ఎయిడ్స్ వ్యాధితో బాధపడుతూ తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్మకు పాల్పడి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. లేదా వడదెబ్బ తగిలి స్పృహ కోల్పోయి మృతి చెంది ఉండొచ్చని కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతదేహం కుళ్లిపోవడంతో పామిడి పీహెచ్సీ డాక్టర్ లింగేశ్వర్‌ను అక్కడికే పిలిపించి పోస్టుమార్టం చేయించారు. మృతుడు బూడిద కలర్ నిక్కర్, నలుపు, తెలుపు పట్టీల లుంగీ, మెంతు రంగు కలర్ చారలు గల చొక్కా ధరించినట్లు ఎస్ఐ తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది. -
రోడ్డు తవ్వకాల్లో బయటపడిన శిలాశాశనం
పెద్దవడుగూరు(తాడిపత్రి): పెద్దవడుగూరు మండలం తెలికి రోడ్డులో మంగళవారం ఉదయం బయటపడింది. పైప్‌లైన్ నిర్మాణం కోసం పైప్‌లైన్ కోసం జేసీబీ సహాయంతో మట్టిని తవ్వుతుండగా శిలాశాసనం కనిపించింది. దానిపై అక్షరాలు, బొమ్మలు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. అశోకుని చిహ్నాలుగా పోలి ఉన్నాయని పేర్కొన్నారు. ఈ విషయం ఈ ప్రాంతంలో చర్చనీయాంశమైంది. అయినా అధికారులెవరూ అటువైపు చూడకపోవడంతో బయటపడిన శిలాశాశానాన్ని స్థానికులు అక్కడే వదిలేశారు. -
యువకుడు అనుమానాస్పద మృతి
పెద్దవడుగూరు(తాడిపత్రి): పెద్దవడుగూరు మండలం గుత్తి అనంతపురం సమీపంలోని ప్రధాన రహదారి పక్కన ముళ్ల పొదల్లో చిన్నవడుగూరు గ్రామానికి చెందిన శ్రీకాంత్ (24) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. శుక్రవారం ఉదయం స్థానికుల నుంచి సమాచారం అందుకున్న ఎస్ఐ రమణారెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుడు శ్రీకాంత్ గుత్తిలో మందుల దుకాణంలో పనిచేసేవాడని తెలిపారు. మృతదేహంపై చిన్నపాటి గాయాలు, సమీపంలోనే ద్విచక్రవాహనం పడి ఉండటాన్ని గుర్తించారు. ఎవరైనా చంపి పడేశారా.. అనారోగ్య కారణాలతో మృతి చెందాడా.. లేక ఆత్మహత్య చేసుకున్నాడా? అన్న కోణంలో విచారణ చేస్తున్నారు. మృతుడికి భార్య శ్రీలత, 9 నెలల కుమార్తె ఉన్నారు.