ఇదే మి సేవ..?
* ప్రభుత్వ ధ్రువీకరణ పత్రాల జారీలో జాప్యం
* వారాలు గడిచినా రాని సర్టిఫికెట్లు
* వేలాది సర్టిఫికెట్లు పెండింగ్
* నానా అగచాట్లు పడుతున్న విద్యార్థులు, తల్లిదండ్రులు
* సర్వర్లు డౌన్, సాంకేతిక సమస్యలతో సతమతం
* రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యమూ కారణమే
* క్షేత్రస్థాయి తనిఖీకే వారాలు పడుతున్న వైనం
* సర్టిఫికెట్ల జారీ వెనుక అవినీతి ఆరోపణలు?
సాక్షి ప్రతినిధి, ఖమ్మంజిల్లా కేంద్రానికి చెందిన సంతోష్‌కు డిగ్రీలో చేరేందుకు కుల, ఆదాయ, ఇతర ధ్రువీకరణ పత్రాలు కావాలి. వాటిని కళాశాలలో సమర్పిస్తేనే అడ్మిషన్ దొరుకుతుంది. సర్టిఫికెట్ల కోసం పదిరోజుల క్రితం స్థానిక ‘మీసేవ’ కేంద్రంలో అతను దరఖాస్తు చేసుకున్నాడు. కానీ ఇంతవరకు అతనికి సర్టిఫికెట్ రాలేదు. మీసేవా కేంద్రం చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ప్రయోజనం లేకపోయింది. తెలంగాణ ప్రభుత్వం అని రాసిన ధ్రువీకరణపత్రాలు ఇంకా రాలేదని కొన్ని రోజులు.. సాంకేతిక సమస్యలున్నాయని.. సర్వర్లు డౌన్ అయ్యాయని మరికొన్ని రోజులు..ఇలా తిప్పుతూనే ఉన్నారు తప్ప అతనికి సర్టిఫికెట్లు మాత్రం ఇవ్వడం లేదు. ఒక్క సంతోష్‌దే కాదు జిల్లాలోని దాదాపు మెజార్టీ మీసేవ, ఈసేవ కేంద్రాల్లో ఇదే పరిస్థితి. ప్రభుత్వం ఇచ్చే ధ్రువీకరణ పత్రాల కోసం విద్యార్థుల నుంచి రైతుల దాకా అందరూ వారాల తరబడి తిరగాల్సి వస్తోంది. చేతులు తడిపితే మాత్రం సర్టిఫికెట్ ఇట్టే జారీ అయిపోతుండటం గమనార్హం.
జిల్లాలో మీ సేవ కేంద్రాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. సర్టిఫికెట్ల జారీలో తీవ్ర నిర్లక్ష్యం చోటుచేసుకుంటోంది. సాంకేతిక సమస్యలకు తోడు రెవెన్యూ సిబ్బంది నిర్లక్ష్యంతో అవస్థలు పడాల్సి వస్తోందని పలువురు వాపోతున్నారు. విద్యార్థుల పరిస్థితి అయితే మరీ దారుణంగా మారింది. మీసేవ కేంద్రాల చుట్టూ తిరగలేక వారి చెప్పులు అరిగిపోతున్నాయి. క్షేత్రస్థాయి నుంచి తహశీల్దార్ల వరకు సర్టిఫికెట్ల జారీ లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, డబ్బు ముట్టిన దాన్ని బట్టి సర్టిఫికెట్ల జారీ అవుతున్నాయని, ఒక్కో సర్టిఫికెట్‌కు వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
సాంకేతిక సమస్యలకు తోడు మానవ తప్పిదాలు వాస్తవానికి ఏపీ ఆన్లైన్, ఈసేవ, మీసేవ కేంద్రాల ద్వారా ఆన్లైన్లో సర్టిఫికెట్ల జారీ రోజురోజుకూ సులభతరం కావాల్సింది పోయి క్లిష్టమతున్నాయి. ముఖ్యంగా సర్వర్ ప్రాబ్లమ్ అటు కేంద్రాల నిర్వాహకులు, ఇటు దరఖాస్తుదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. నెట్ క నెక్ట్ కావడం లేదని, సర్వర్లు పనిచేయడం లేదని దరఖాస్తుదారులను నిర్వాహకులు వెనక్కు పంపుతున్నారు. రెవెన్యూ సిబ్బంది నిర్లక్ష్యం కూడా స్పష్టంగా కనిపిస్తోంది.
చాలా చోట్ల తహశీల్దార్లు, డెప్యూటీ తహశీల్దార్ల డిజిటల్ సంతకాలు లేక సర్టిఫికెట్లు పెండింగ్‌లో ఉంటున్నాయి. మరోవైపు దరఖాస్తుపై విచారణ స్థాయిలో కూడా జాప్యం జరుగుతోంది. ఈ విచారణ పేరుతో వీఆర్వోలు వారాల తరబడి జాప్యం చేస్తున్నారు. ఇదేమంటే మాకు ఇదొక్కటే పనికాదు కదా అని బదులిస్తున్నారు. ఇదిలా ఉంటే సర్టిఫికెట్ల జారీలో అవినీతి జరుగుతుందనే ఆరోపణలు కూడా వస్తున్నాయి.
తహశీల్దార్ కార్యాలయం స్థాయిలో మామూళ్లు ఇచ్చిన కేంద్రాల సర్టిఫికెట్లు మాత్రమే క్లియర్ అవుతున్నాయని, పెద్దగా ముడుపులు ఇవ్వని కేంద్రాల సర్టిఫికెట్ల జారీలో జాప్యం జరుగుతోందని కూడా కొన్ని చోట్ల ఆరోపణలు ఉన్నాయి. ఈ మామూళ్లకు మధ్యవర్తులుగా క్షేత్రస్థాయిలో దరఖాస్తులను విచారించే రెవెన్యూ సిబ్బంది వ్యవహరిస్తున్నారని సమాచారం. మరోవైపు సర్టిఫికెట్ల వారీగా కొన్ని చోట్ల వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. కుల ధ్రువీకరణ పత్రాల కోసం రూ.3వేలు, ఆదాయం కోసం రూ.వెయ్యి, జనన, మరణ ధ్రువీకరణ పత్రాల కోసం రూ.4వేల వరకు వసూలు చేస్తున్నారని సమాచారం.
జిల్లావ్యాప్తంగా ఇదే పరిస్థితి..
భద్రాచలంలో మీసేవా, ఈ సేవా ఆన్లైన్లలో విద్యార్థులకు సర్టిఫికెట్లు అందక పదిరోజులుగా నానా ఇబ్బందులు పడుతున్నారు. డివిజన్లోని అన్ని మండలాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. దీనిపై మీసేవా నిర్వాహకులను ప్రశ్నిస్తే పదిరోజులుగా ప్రింటింగ్ స్టేషనరీ ప్రభుత్వం నుంచి అందటం లేదని చెపుతున్నారు. భద్రాచలం మీసేవలో తహశీల్దార్ సంతకం అయి కూడా వందల సంఖ్యలో కుల, ఆదాయ ధ్రువీకరణ ప్రతాలు జారీ కావడం లేదు. కూనవరంలో 122, వెంకటాపురంలో 60 వరకు ఇలానే పెండింగ్‌లో ఉన్నాయని నిర్వహకులు తెలిపారు.
ఇల్లెందు పట్టణ, మండల పరిధిలో ఆరు ఈసేవా కేంద్రాలు ఉన్నాయి. జూన్ 29వ తేది నుంచి జూలై 04వ తేదీ వరకు 2000 సర్టిఫికెట్ల( కుల,ఆదాయ, నివాస, ఈబీసీ, ఓబీసీ) కోసం విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీటిల్లో 760 ధ్రువీకరణ పత్రాలు తహశీల్దార్ మంజూరు చేయగా, 250 పత్రాలు ఈసేవా నుంచి లబ్ధిదారులకు విడుదల చేశారు. ఇంకా 410 సర్టిఫికెట్లు ఈసేవా నుంచి లబ్ధిదారులకు అందాల్సి ఉంది. నాలుగు రోజుల నుంచి తెలంగాణ ప్రభుత్వ ముద్రతో కూడిన పత్రాలు అందుబాటులో లేవు. గార్ల మండలంలో 424 మంది విద్యార్థుల సర్టిఫికెట్లు తహశీల్దార్ కార్యాలయంలో పెండింగ్‌లో ఉన్నాయి. తహశీల్దార్‌కు రిజిస్టర్ కీ ఇచ్చి రెండేళ్లు అయింది. రిజిస్టర్ కీ కాల పరిమితి ఈనెల 3తో ముగిసింది. తహశీల్దార్ రిజిస్టర్ కీ లేనందున విద్యార్థుల సర్టిఫికెట్లు పెండింగ్‌లో ఉంటున్నాయి.
పాలేరు నియోజకవర్గంలో ఈ, మీసేవా కేంద్రాలకు వచ్చిన దరఖాస్తులు వందల సంఖ్యలో పెండింగ్‌లోనే ఉన్నాయి. స్టేషనరీ పేపర్లు సమయానికి రాకపోవడం, సర్వర్లు మొరాయించడంతో విద్యార్థులకు సర్టిఫికెట్లు అందటం లేదు. ఖమ్మం రూరల్ మండలంలోని పెదతండా, తల్లంపాడులో 30 వరకు పెండింగ్‌లో ఉన్నాయి. తిరుమలాయపాలెం, కూసుమంచి, నేలకొండపల్లి మండలాల్లోనూ ఇదే పరిస్థితి. కౌన్సిలింగ్‌కు వెళ్లాల్సిన విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.
సర్వర్ ప్రాబ్లమ్ అని తిప్పుతున్నారు: పొట్టపింజర బాలస్వామి, నేలకొండపల్లి
మీ సేవా, ఈ సేవా కేంద్రాల్లో సర్వర్ ప్రాబ్లమ్‌తో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. కేంద్రాలలో పని అయిపోయిందని తహశీల్దార్ కార్యాలయానికి వెళితే అక్కడా అదే పరిస్థితి... రోజుల తరబడి తిప్పుతున్నారు. కాలేజీ, వసతి గృహాలలో చేరేందుకు అవసరమైన సర్టిఫికెట్లు సకాలంలో అందటం లేదు.