Pending Challan
-
అలర్ట్: నేటి అర్ధరాత్రితో ముగియనున్న పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల గడువు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వాహనాల పెండింగ్ చలాన్లపై ప్రభుత్వం ప్రకటించిన రాయితీ గడువు నేటితో(గురువారం) ముగియనుంది. రాత్రి 11.59 గంటలకు డిస్కౌంట్ ఆఫర్ గడువు ముగియనుంది. ఈ గడువును ఇప్పటికే రెండుసార్లు పొడిగించిన విషయం తెలిసిందే. మొదట జనవరి 10ని ట్రాఫిక్ చలాన్ల డిస్కౌంట్‌కు చివరి తేదీగా నిర్ణయించగా.. ఆ తరువాత జనవరి 31 వరకు, మరోసారి ఫిబ్రవరి 15 వరకు పొడిగించారు. ఆ గడువు నేటితో ముగియనుంది. అయితే మరోసారి గడువు పెంచే అవకాశం లేదని అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటి వరకు కోటి 66 లక్షల పెండింగ్ చలాన్ల క్లియరెన్స్‌తో రూ.147 కోట్లు వసూలు అయినట్లు అధికారులు తెలిపారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3 కోట్ల 59 లక్షల కేసులు పెండింగ్‌లో ఉండగా.. ఇప్పటిరకు కోటి 66 లక్షల కేసులు క్లియర్ అయినట్లు పేర్కొన్నారు. 47 శాతం కేసులు క్లియర్ కాగా.. ఇంకా 53 శాతం పెండింగ్ కేసులు ఉన్నట్లు వెల్లడించారు. చదవండి: శివ బాలకృష్ణ సోదరుడికి ఏసీబీ కోర్టులో చుక్కెదురు -
3 రోజుల్లో చలాన్లకు రూ. 8.44 కోట్ల చెల్లింపు
సాక్షి, హైదరాబాద్: పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల రాయితీకి రాష్ట్ర వ్యాప్తంగా వాహనదారుల నుంచి భారీ స్పందన లభి స్తోంది. పెద్దఎత్తున జరిమానాలు పడిన వాహనదారులు ప్రభుత్వం ప్రకటించిన రాయితీని వినియోగించుకుంటు న్నారు. 3 రోజుల్లోనే 9.61 లక్షల చలాన్లకు సంబంధించి రూ.8.44 కోట్ల మేర జరిమానాలను చెల్లించారు. ఈ మేరకు రవాణా శాఖ వర్గాలు వివరాలు వెల్లడించాయి. హైదరా బాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో 3.54 లక్షల చలాన్లతో రూ. 2.62 కోట్లు, సైబరాబాద్ కమిషనరేట్ పరి ధిలో 1.82 లక్షల చలాన్ల చెల్లింపుతో రూ.1.80 కోట్లు, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 93 వేల చలాన్ల నుంచి రూ.76.79 లక్షల ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. కాగా, చెల్లింపులు అధికంగా ఉంటున్న నేపథ్యంలో సర్వర్ తరచూ మొరాయిస్తున్నట్లు వాహనదారులు తెలిపారు. -
ట్రాఫిక్ పోలీసుల ఓవరాక్షన్, వాహనదారుల చెంప చెళ్లుమనిపిస్తున్నారు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో ట్రాఫిక్ పోలీసులు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. వాహనదారులపట్ల పలువురి ట్రాఫిక్ ఇన్‌స్పెకర్ట్‌ల తీరు వివాదాస్పదంగా మారుతోంది. తాజాగా ద్విచక్ర వాహనదారుడిపై ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ చేయిచేసుకున్న ఘటన కేపీహెచ్బీలో చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఓం ప్రకాశ్ రెడ్డి అనే వ్యక్తిని కైత్లాపూర్ వద్ద కూకట్పల్లి ట్రాఫిక్ పోలీసులు ఆపారు. వాహనంపై పెండింగ్ చలాన్లు ఉన్నాయని, వెంటనే డబ్బులు చెల్లించాలని తెలిపారు. అయితే ప్రస్తుతం తనవద్ద డబ్బులు లేవని, అత్యవసర పని మీద వెళ్తున్నానని, మరుసటి రోజు చెల్లిస్తానని కోరాడు. దీంతో ఆగ్రహించిన ట్రాఫిక్ సీఐ బోస్ కిరణ్ .. సదరు వాహనదారుడిని దుర్భాషలాడుతూ చేయిచేసుకున్నాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చదవండి: ‘నా మృతదేహం దరిదాపుల్లోకి కూడా అత్తింటివారిని రానివ్వద్దు’ మరో ఘటనలో మియాపూర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సుమన్ ఓ వాహనదారుడిపై దురుసుగా ప్రవర్తించాడు. డ్రంకన్ డ్రైవ్‌లో పట్టుబడిన వ్యక్తిపై మియాపూర్ ఇన్స్పెక్టర్ సుమన్ చేయి చేసుకున్నాడు. ఎందుకు కొడుతున్నారని అడిగితే.. విధులకు ఆటకం కలిగిస్తున్నావంటూ మళ్లీ మళ్లీ చెంప చెళ్లుమనిపించారు. -
ఖైరతాబాద్ ఎమ్మెల్యే కార్లపై 66 చలాన్లు.. రూ. 37, 365 చెల్లించి..
సాక్షి, హైదరాబాద్: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు చెందిన అయిదు కార్లకు పెండింగ్ చలాన్లను ఆదివారం క్లియర్ చేశారు. కొంత కాలంగా ఆయనకు చెందిన టీఎస్ 09 ఎఫ్ఏ 0999తోపాటు మరో నాలుగు కార్లకు 66 చలానాలు పెండింగ్‌లో ఉన్నాయి. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తూ తిరుగుతున్న ఈ వాహనాలపై బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో పెండింగ్ చలాన్ల జాబితా గుట్టురట్టైది. దీంతో 66 చలానాలకుగాను రూ. 37365లను ఎమ్మెల్యే చెల్లించారు. ఈ మేరకు బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీసులు ఒక ప్రకటన విడుదల చేస్తూ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు చెందిన అయిదు కార్లకు చెందిన చలానాలు క్లియర్ అయినట్లు తెలిపారు. చదవండి: బంజారాహిల్స్: ఖరీదైన కార్లే లక్ష్యంగా ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు -
కార్ల పైనా కన్నేస్తున్నారు!
సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించిన పెండింగ్‌లో ఉండిపోయిన ఈ–చలాన్లు క్లియర్ కోసం హైదరాబాద్ ట్రాఫిక్ విభాగం అధికారులు ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నారు. గతానికి భిన్నంగా కార్ల వంటి తేలికపాటి వాహనాలపై ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. ఫలితంగానే శనివారం ఎమ్మెల్యే దానం నాగేందర్ కారు చిక్కింది. నగరంలో ఉన్న వాహనాల్లో 72 శాతం టూ వీలర్లే. తేలికపాటి వాహనాలు 18 శాతం, మరో పది శాతం మిగిలిన కేటగిరీలకు చెందిన వాహనాలు ఉన్నాయి. గతంలో ట్రాఫిక్ పోలీసుల దృష్టంతా ద్విచక్ర వాహనాల పైనే ఉండేది. వీటినే రోడ్లపై ఆపుతూ పెండింగ్ చలాన్లు వసూలు చేయడానికి ప్రయత్నించే వాళ్లు. తేలికపాటి వాహనాల జోలికి తక్కువగా... హైఎండ్ కార్ల జోలికి అస్సలు పోయేవాళ్లు కాదు. ఈ నేపథ్యంలోనే ఈ వాహనాలపై పెండింగ్ చలాన్లు పెరిగిపోయాయి. ఈ విషయం గుర్తించిన సిటీ ట్రాఫిక్ చీఫ్ ఏవీ రంగనాథ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ద్విచక్ర వాహనాలతో పాటు కార్లు, హైఎండ్ కార్లనూ ఆపి తనిఖీలు చేయాలని, పెండింగ్‌లో చలాన్లు ఉంటే కట్టేందుకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. దీంతో గడిచిన కొన్ని రోజులుగా ట్రాఫిక్ పోలీసుల వీటిపై దృష్టి పెట్టారు. పెండింగ్ చలాన్లు వసూలుతో పాటు చలాన్ల విధింపులోనూ ఈ కేటగిరీలకు చెందిన వాహనాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. శనివారం ఒక్క రోజే ట్రాఫిక్ విభాగం అధికారులు 1745 వాహనాలపై చలాన్లు విధించారు. వీటిలో ద్విచక్ర వాహనాలు 943, త్రిచక్ర వాహనాలు 108, తేలికపాటి వాహనాలు 688 ఉన్నాయి. మిగినవి ఇతర రకాలకు చెందిన వాహనాలు. వాహనాలను ఆపుతున్న ట్రాఫిక్ విభాగం అధికారులు తమ వద్ద ఉన్న ట్యాబ్స్ ద్వారా డేటాబేస్‌లో వాటి రిజిస్ట్రేషన్ నెంబర్లను సెర్చ్ చేస్తున్నారు. ఇలా చేసినప్పుడు ఆ వాహనంపై పెండింగ్ చలాన్లు ఉండే ఆ విషయం ట్రాఫిక్ పోలీసులకు తెలుస్తోంది. సదరు వాహనచోదకుడు ఆ మొత్తం క్లియర్ చేసే వరకు వాహనాన్ని లేదా «ధ్రువీకరణ పత్రాలన పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. గడువు ఇచ్చి చార్జ్‌షీట్ దాఖలు ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన, పెండింగ్ చలాన్ల వసూలు విషయంలో అన్ని రకాలైన వాహనాలకు సమప్రాధాన్యం ఇస్తున్నాం. మహిళలు, యువతులు, కుటుంబాలతో ప్రయాణిస్తున్న వారి వాహనాల వివరాలను తనిఖీ చేసినప్పుడు వారికి కొన్ని వెసులుబాట్లు ఇస్తున్నాం. ఇలాంటి వారి వాహనాలపై పెండింగ్ చలాన్లు ఉంటే వెంటనే కట్టాలని ఒత్తిడి చేయట్లేదు. వాటిని క్లియర్ చేసుకోవడానికి గరిష్టంగా 72 గంటల సమయం ఇస్తున్నాం. ఆ గడువు తర్వాత క్లియర్ చేయని వాహనాలపై న్యాయస్థానంలో చార్జ్షీట్లు దాఖలు చేస్తున్నాం. – ఏవీ రంగనాథ్, సిటీ ట్రాఫిక్ చీఫ్ (చదవండి: సికింద్రాబాద్ విధ్వంసంలో 46 మంది అరెస్ట్.. వారి వల్లే ఇలా జరిగింది) -
గతంలో నేనూ ఆటో డ్రైవర్‌నే.. పెండింగ్ చలాన్లు రద్దు చేస్తా: సీఎం
చండీగఢ్: ఆటోడ్రైవర్లపై వరాల జల్లు కురిపించారు పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ. వారి ఆటోలపై ఉన్న పెండింగ్ చలాన్లు అన్నింటిని రద్దు చేసి.. వారికి కొత్త రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఇస్తానని ప్రకటించారు. సోమవారం లూథియానాలోని గిల్ చౌక్ ప్రాంతంలోని ధాన్యం మార్కెట్‌కు వెళ్తున్న చన్నీ.. మార్గ మధ్యంలో తన వాహనాన్ని ఆపి.. ఆటోడ్రైవర్లతో భేటీ అయ్యాడు. వారితో పాటు చెక్కమీద కూర్చుని.. టీ తాగి.. వారి సమస్యలను విన్నారు సీఎం చన్నీ. ఈ సందర్భంగా సీఎం చన్నీ మాట్లాడుతూ.. ప్రారంభంలో రాజకీయాల్లోకి రాకముందు తాను ఆటో డ్రైవర్‌గా పని చేశానని తెలిపాడు. వారి నిజమైన డిమాండ్లను సానుభూతితో పరిగణలోకి తీసుకుంటున్నట్లు వెల్లడించాడు. ఈ సందర్భంగా ఇప్పటివరకు ఆటోల మీద ఉన్న పెండింగ్ చలాన్లు అన్నింటిని రద్దు చేస్తానని ప్రకటించాడు. అంతేకాక అధికారుల వేధింపులను అరికట్టేందుకు త్వరలోనే కొత్త రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు జారీ చేస్తానని ప్రకటించారు. (చదవండి: ఆ ఆహ్వానం నచ్చింది... అందుకే ఈ రాత్రికి అక్కడికి వెళ్తా!!) ఈ సందర్భంగా ఆటోడ్రైవర్లు ట్రాఫిక్ నియమానలు పాటించాలని సీఎం చన్నీ సూచించాడు. ఇక రోడ్డు మీద ఆటో రిక్షాలు నడపడానికి ప్రత్యేకంగా పసుపు గీత గీసి స్థలాన్ని కేటాయించాలని కోరిన ఆటో డ్రైవర్ల విజ్ఞప్తిని చన్నీ అంగీకరించాడు. ఈ పర్యటనలో చన్నీతో పాటు సిద్ధూ, మంత్రులు మన్‌ప్రీత్ సింగ్ బాదల్, భరత్ భూషణ్ అషు, ఎమ్మెల్యేలు కుల్దీప్ సింగ్ వైద్, సంజయ్ తల్వార్, లఖ్బీర్ సింగ్ లఖా కూడా ఉన్నారు. (చదవండి: పిలవకుండానే పెళ్లికి వెళ్లి వధూవరులను ఆశీర్వదించిన సీఎం) అయితే చన్నీ చర్యలపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కారణం ఏంటంటే.. త్వరలోనే కేజ్రీవాల్ పంజాబ్ ఆటో డ్రైవర్లతో ఆటో సంవాద్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. దానికి ముందే చన్నీ వారితో భేటీ అయ్యి.. చలాన్లు రద్దు చేస్తానని ప్రకటించి.. కేజ్రీవాల్‌కు షాక్ ఇచ్చారు. చదవండి: రాహుల్ చెప్పిందే నిజమయ్యింది.. వైరలవుతోన్న ట్వీట్ -
ఒక యాక్టివా.. 72 చలానాలు
నల్లకుంట: సుమారు 72 పెండింగ్ చలానాలు ఉన్న ఓ యాక్టివా ద్విచక్ర వాహనం నల్లకుంట ట్రాఫిక్ పోలీసులకు చిక్కింది. ఎస్ఐ రమేశ్ వివరాల ప్రకారం.. బుధవారం రాత్రి 8 గంటల సమయంలో నల్లకుంట ఫీవర్ ఆస్పత్రి సిగ్నల్స్ వద్ద నల్లకుంట ట్రాఫిక్ పోలీసులు పెండింగ్ చలానాలపై స్పెషల్ డ్రైవ్ చేట్టారు. అదే సమయంలో అంబర్‌పేటకు చెందిన సురేశ్ అనే వ్యక్తి యాక్టివా (టీఎస్11 ఈజే 7202) ద్విచక్ర వాహనంపై అటుగా వచ్చాడు. అనుమానంతో ఆ వాహనాన్ని నిలిపి తనిఖీ చేయగా 72 పెండింగ్ చలానాలు (రూ. 9,750) ఉన్నాయి. దీంతో వాహనాన్ని సీజ్ చేసిన ట్రాఫిక్ పోలీసులు స్టేషన్‌కు తరలించారు. -
పెండింగ్ చలాన్లు చెల్లిస్తేనే ఎంట్రీ
మనది నగరం కాదు కాదా... ఏదో పనిమీద వచ్చాం... పోతున్నాం... తొందరపాటులో ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తే ఏమవుతుందులే అనుకుంటే పొరపాటే... ఇలా నిబంధనలు అతిక్రమించినవారు వందల్లో ఉన్నారని గుర్తించిన హైదరాబాద్, సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పెండింగ్ చలాన్లు రాబట్టేందుకు టోల్‌ప్లాజాల వద్దే సంయుక్త తనిఖీలు చేపడుతున్నారు. పెండింగ్ చలాన్లు ఉంటే జరిమానా అక్కడికక్కడే కట్టాల్సిందే. లేదంటే వాహన డాక్యుమెంట్లు తీసుకోనున్నారు. - సాక్షి, హైదరాబాద్ * టోల్‌ప్లాజాల వద్ద ‘ట్రాఫిక్’ ప్రత్యేక డ్రైవ్ * అక్కడికక్కడే జరిమానా చెల్లించాల్సిందే.. * నేటి నుంచి శంషాబాద్ టోల్‌ప్లాజా వద్ద అమలు హైదరాబాద్‌లోకి ప్రవేశించి ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించిన వాహనదారులపై హైదరాబాద్, సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. వారికి విధించిన పెండింగ్ చలాన్లను వసూలు చేసేందుకు సంయుక్తంగా స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నారు. నగరంలోకి ప్రవేశించే టోల్‌ప్లాజాల వద్ద తనిఖీలు చేపట్టి ట్రాఫిక్ అతిక్రమణదారుల నుంచి జరిమానా వసూలు చేయనున్నారు. తొలిసారిగా పైలట్ పద్ధతిన ఈ ప్రత్యేక డ్రైవ్‌ను శంషాబాద్ విమానాశ్రయ టోల్‌ప్లాజా వద్ద శుక్రవారం నుంచి చేపడుతున్నారు. సుమారు ఆరుగురుతో కూడిన బృందం పెండింగ్ చలాన్లు చెల్లించని వాహనదారులను గుర్తించి...అక్కడికక్కడే జరిమానాను కట్టిస్తారు. దీనికోసం ప్రత్యేకంగా పే బూత్‌ను కూడా తాత్కాలికంగా ఏర్పాటు చేస్తున్నారు. మూడు మించి చలాన్లు ఉంటే తప్పనిసరిగా కట్టాల్సిందే. ఒకవేళ జరిమానా కట్టని పక్షంలో సదరు వాహన పత్రాలను ట్రాఫిక్ పోలీసులు స్వాధీనం చేసుకుంటారు. వందల్లో పెండింగ్ చలాన్లు... నగరంలోకి ప్రవేశించి రాష్ డ్రైవింగ్, నో పార్కింగ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్, హెల్మెట్ లేకుండా, లేన్ అండ్ లైన్ క్రాసింగ్... ఇలా నిబంధనలు అతిక్రమించి చలాన్లు చెల్లించనివారు... దాదాపు వందల్లో ఉన్నట్టు గుర్తించిన హైదరాబాద్, సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా స్పెషల్ డ్రైవ్ చేపట్టి జరిమానాలను వసూలు చేయాలనే నిర్ణయానికి వచ్చారు. శంషాబాద్ అనంతరం ఇతర టోల్‌ప్లాజాల వద్ద కూడా స్పెషల్ డ్రైవ్‌ను చేపట్టనున్నారు. బయటివారి కోసమే.. నగరానికి వచ్చి పోతూ చలాన్లు పెండింగ్‌లో ఉన్న వారిని పట్టుకోవడానికి టోల్‌ప్లాజాల వద్ద తనిఖీలు చేపడితే బాగుంటుందని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులతో చర్చించాం. అందుకే సంయుక్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాం. దీంతో వాహనదారుల్లో ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించరాదన్న భయం కలుగుతుంది. - జితేంద్ర, ట్రాఫిక్ అదనపు పోలీసు కమిషనర్