సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించిన పెండింగ్‌లో ఉండిపోయిన ఈ–చలాన్లు క్లియర్ కోసం హైదరాబాద్ ట్రాఫిక్ విభాగం అధికారులు ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నారు. గతానికి భిన్నంగా కార్ల వంటి తేలికపాటి వాహనాలపై ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. ఫలితంగానే శనివారం ఎమ్మెల్యే దానం నాగేందర్ కారు చిక్కింది. నగరంలో ఉన్న వాహనాల్లో 72 శాతం టూ వీలర్లే. తేలికపాటి వాహనాలు 18 శాతం, మరో పది శాతం మిగిలిన కేటగిరీలకు చెందిన వాహనాలు ఉన్నాయి. గతంలో ట్రాఫిక్ పోలీసుల దృష్టంతా ద్విచక్ర వాహనాల పైనే ఉండేది. వీటినే రోడ్లపై ఆపుతూ పెండింగ్ చలాన్లు వసూలు చేయడానికి ప్రయత్నించే వాళ్లు. తేలికపాటి వాహనాల జోలికి తక్కువగా... హైఎండ్ కార్ల జోలికి అస్సలు పోయేవాళ్లు కాదు.
ఈ నేపథ్యంలోనే ఈ వాహనాలపై పెండింగ్ చలాన్లు పెరిగిపోయాయి. ఈ విషయం గుర్తించిన సిటీ ట్రాఫిక్ చీఫ్ ఏవీ రంగనాథ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ద్విచక్ర వాహనాలతో పాటు కార్లు, హైఎండ్ కార్లనూ ఆపి తనిఖీలు చేయాలని, పెండింగ్‌లో చలాన్లు ఉంటే కట్టేందుకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. దీంతో గడిచిన కొన్ని రోజులుగా ట్రాఫిక్ పోలీసుల వీటిపై దృష్టి పెట్టారు. పెండింగ్ చలాన్లు వసూలుతో పాటు చలాన్ల విధింపులోనూ ఈ కేటగిరీలకు చెందిన వాహనాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. శనివారం ఒక్క రోజే ట్రాఫిక్ విభాగం అధికారులు 1745 వాహనాలపై చలాన్లు విధించారు.
వీటిలో ద్విచక్ర వాహనాలు 943, త్రిచక్ర వాహనాలు 108, తేలికపాటి వాహనాలు 688 ఉన్నాయి. మిగినవి ఇతర రకాలకు చెందిన వాహనాలు. వాహనాలను ఆపుతున్న ట్రాఫిక్ విభాగం అధికారులు తమ వద్ద ఉన్న ట్యాబ్స్ ద్వారా డేటాబేస్‌లో వాటి రిజిస్ట్రేషన్ నెంబర్లను సెర్చ్ చేస్తున్నారు. ఇలా చేసినప్పుడు ఆ వాహనంపై పెండింగ్ చలాన్లు ఉండే ఆ విషయం ట్రాఫిక్ పోలీసులకు తెలుస్తోంది. సదరు వాహనచోదకుడు ఆ మొత్తం క్లియర్ చేసే వరకు వాహనాన్ని లేదా «ధ్రువీకరణ పత్రాలన పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు.
గడువు ఇచ్చి చార్జ్‌షీట్ దాఖలు
ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన, పెండింగ్ చలాన్ల వసూలు విషయంలో అన్ని రకాలైన వాహనాలకు సమప్రాధాన్యం ఇస్తున్నాం. మహిళలు, యువతులు, కుటుంబాలతో ప్రయాణిస్తున్న వారి వాహనాల వివరాలను తనిఖీ చేసినప్పుడు వారికి కొన్ని వెసులుబాట్లు ఇస్తున్నాం. ఇలాంటి వారి వాహనాలపై పెండింగ్ చలాన్లు ఉంటే వెంటనే కట్టాలని ఒత్తిడి చేయట్లేదు. వాటిని క్లియర్ చేసుకోవడానికి గరిష్టంగా 72 గంటల సమయం ఇస్తున్నాం. ఆ గడువు తర్వాత క్లియర్ చేయని వాహనాలపై న్యాయస్థానంలో చార్జ్‌షీట్లు దాఖలు చేస్తున్నాం.
– ఏవీ రంగనాథ్, సిటీ ట్రాఫిక్ చీఫ్
(చదవండి: సికింద్రాబాద్ విధ‍్వంసంలో 46 మంది అరెస్ట్.. వారి వల్లే ఇలా జరిగింది)
Comments
Please login to add a commentAdd a comment