ఒకటి రెండుసార్లు నేను కూడా కొన్నాను
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ శాసనసభలో సోమవారం హైవేలు, రోడ్డు ప్రమాదాల నివారణపై చర్చ జరిగింది. అలాగే జాతీయ రహదారులపై బార్లు వల్ల కూడా ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని విశాఖ ఉత్తర బీజేపీ ఎమ్మెల్యే పెన్మెత్స విష్ణుకుమార్ రాజు ఈ సందర్భంగా సభ దృష్టికి తీసుకు వచ్చారు. వాహనాలు నడిపే డ్రైవర్లు కొందరు మద్యానికి బానిసలై వుండడంతో రాత్రిపూట హైవేలపై ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయన్నారు. బార్లు ఆకర్షించేలా ఉండటం వల్ల ....తాను కూడా ఒకటి, రెండుసార్లు మద్యం కొన్నానని విష్ణుకుమార్ రాజు అన్నారు. దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని, బార్లను నియంత్రించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
సభ్యుల అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. హైవేలు, రోడ్డు ప్రమాదాల నివారణకు కచ్చితమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం వెల్లడించింది. రోడ్డు ప్రమాదాల్లో రోజూ పదుల సంఖ్యలో ప్రజలు చనిపోతున్నారని.. పలువురు సభ్యులు ప్రశ్నోత్తరాల్లో ప్రస్తావించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ సభ్యులు ఎ.సురేష్, గొట్టిపాటి రవికుమార్‌తో పాటు, పి.విష్ణుకుమార్‌రాజు, రామారావు, ధూళిపాళ్ల నరేంద్ర తదితరులు ఇదే విషయంపై వివరణ కోరారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ఇప్పటికే కొన్ని చర్యలు తీసుకున్నామని.. భవిష్యత్‌లో మరింత దృష్టి పెడతామని ప్రభుత్వం సమాధానమిచ్చింది.