
సాక్షి విశాఖపట్నం: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్‌రాజుకు ఆ పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ సంఘం షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు తెలిసింది. ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో విష్ణుకుమార్ రాజు సంబంధం లేని వ్యాఖ్యలు చేసినందుకు ఈ నోటీసు జారీ చేసినట్లు సమాచారం.
పార్టీవర్గాల కథనం ప్రకారం.. విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యలపై బీజేపీ అధిష్ఠానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో క్రమశిక్షణ సంఘం ఆయనకు నోటీసు జారీ చేసింది.
వ్యాఖ్యలపై ఆదివారం సాయంత్రంలోగా వివరణ ఇవ్వాలని, లేకుంటే సస్పెన్షన్‌కు గురికావలసి వస్తుందని హెచ్చరించింది. కేంద్ర దర్యాప్తు సంస్థలపై అసత్య ఆరోపణలు, ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశానికి పిలవకపోయినా పిలిచినట్లు ప్రస్తావిస్తూ అబద్ధపు మాటలు ఎలా చెబుతారని ఆగ్రహం వ్యక్తంచేసింది. పొత్తులపై స్థాయిని మరిచి మాట్లాడినందుకు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. గతంలో కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేయరాదని హెచ్చరించామని ఆ నోటీసులో పేర్కొన్నట్లు తెలిసింది.