స్పాంజి రహదారులు రానున్నాయి!
నిన్నగాక మొన్న మన మహానగరాల్లో కురిసిన వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. రహదారులు చిన్నపాటి వరద నీటి కాలువలయ్యాయి. వందలాది వాహనాలు నీట మునిగాయి. వీటన్నిటి మధ్య నోరు తెరచుకుని ఉన్న భయంకర మ్యాన్‌హోల్స్ మనుషుల్ని అమాంతం మింగేసేందుకు ఏమాత్రం వెనకాడలేదు. విశాఖలో గల్లంతైన చిన్నారి అదితినే ఇందుకు ఉదాహరణ. ఇలాంటి ఘోరాలు జరగకుండా ఉండాలంటే..? వరదనీరు ఎక్కడికక్కడ ఇంకిపోవాలన్నదే నేటితరం సమాధానం. సాంకేతికత నానాటికీ అభివృద్ధి చెందుతోన్న ప్రస్తుత సమాజానికి స్పాంజి సిటీలు కావాలంటున్నారు నిపుణులు.
ప్రపంచంలో శరవేగంగా అభివృద్ధి చెందుతోన్న దేశాల్లో చైనా ఒకటి. అత్యధిక నగరాలున్న దేశం కూడా ఇదే. ఏకంగా 657 నగరాలు చైనాలో ఉన్నాయి. ఎక్కడ నగరాలు ఉంటే అక్కడ కచ్చితంగా తాగునీటి, వరదనీటి సమస్య ఉండితీరుతుంది. చైనా నగరాలు కూడా ఈ విషయంలో మినహాయింపేమీ కాదు. ఇక్కడి సగం నగరాల్లో ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారం నీటి కొరత తీవ్రంగా ఉంది. మిగతా సగం వరదనీటి నియంత్రణ విషయంలో జాతీయ ప్రమాణాలు అందుకోలేదు. 2013 వరదల్లో 230 నగరాలు ముంపునకు గురవ్వడం, 90 శాతం నగర ప్రాంతాల్లో ప్రాథమిక వరద ప్రణాళికలు కూడా లేకపోవడం దీనికి ఉదాహరణలు.
స్పాంజి నగరాలు..
దీంతో చైనా ప్రభుత్వం మేల్కొంది. తాజాగా ఆ దేశంలోని 16 నగరాలను స్పాంజి నగరాలుగా మార్చాలని నిర్ణయించుకుంది. ఈ కారణంగా రానున్న మూడేళ్లలో ఒక్కో నగరం 600 మిలియన్ల యువాన్లను అందుకోనుంది. ఈ నిధులతో కొలనులు, ఫిల్టరేషన్ పూల్స్, వెట్ల్యాండ్స్తో పాటు నీటిని పీల్చుకునే రహదారులు (పర్మియబుల్ రోడ్స్) నిర్మిస్తారు. వీటన్నిటి కలయికే స్పాంజి నగరం. ఈ ప్రణాళిక ఫలితంగా కనీసం 60 శాతం వర్షపునీటిని నియంత్రించవచ్చనేది అధికారుల అంచనా. అమెరికాలోని లాస్ఏంజిలీస్ క్వారీ ప్రాజెక్టులో ఇప్పటికే స్పాంజి నగర నమూనాని ప్రయోగాత్మకంగా చేపట్టారు. అయితే, ఇది కొంచెం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం.
పర్మియబుల్ రహదారులు..
స్పాంజి నగరాల్లో ప్రధానంగా ప్రస్తావించాల్సింది పర్మియబుల్ రహదారుల గురించే. పర్మియబుల్ కాంక్రీటుతో నిర్మించే ఈ రోడ్లు నీటిని అత్యంత వేగంగా లోపలికి పీల్చుకుంటాయి. రహదారులపై పడే నీరు క్షణాల్లో ఇంకిపోతుంది. ఈ తంతును చూస్తే కాంక్రీటులో స్పాంజి ఉందేమోనన్న అనుమానం కలుగుతుంది. అయితే, ఇందులో అలాంటిదేమీ ఉండదు. దీన్ని పెద్ద కంకర రాళ్లను ఉపయోగించి తయారుచేస్తారు. ఈ కాంక్రీటు మిశ్రమాన్ని సాధారణ రహదారుల్లో వినియోగించే చిన్న చిన్న కంకర రాళ్లపై గుమ్మరించడం ద్వారా రహదారులు తయారుచేస్తారు. ఇవి సగటున ఒక్కో చదరపు మీటరుకు నిమిషానికి 600 లీటర్ల నీటిని పీల్చుకోగలవు.
పర్మియబుల్ కాంక్రీటు..
నీటిని పీల్చుకోగలిగే సామర్థ్యమున్న కాంక్రీటును 1800లోనే వినియోగించారు. యూరప్‌లోని గృహాల నిర్మాణంలో దీన్ని వాడారు. ఇందులో సిమెంట్ పాళ్లు తక్కువగా ఉండటంతో వ్యయం కూడా అదుపులోనే ఉంటోంది. 1920 నాటికి స్కాట్లండ్, ఇంగ్లండ్‌ల్లో రెండంతస్తుల భవనాలకు దీన్ని ఎక్కువగా వాడేవారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత సిమెంటు లభ్యత తక్కువ కావడంతో దీనికి మరింత ఆదరణ పెరిగింది. అయితే, 1970 వరకూ అమెరికాలో ఇది పెద్దగా ప్రభావం చూపలేదు. మనదేశంలో 2000 నుంచి అందుబాటులోకి వచ్చింది.
ఉపయోగాలు..
- వర్షపు నీటిని పీల్చుకోవడం ద్వారా వరద నియంత్రణకు సహకరిస్తుంది.
- భూగర్భ నిల్వలు పెంచడంలో సహాయపడుతుంది.
- వాతావరణంలోని కార్బన్ ఉద్గారాలను పీల్చుకోవడం ద్వారా కాలుష్యాన్నినివారిస్తుంది.
- వరదనీటిలోని కాలుష్యకారకాలను శుద్ధి చేయడం ద్వారా స్వచ్ఛమైన నీటిని అందిస్తుంది.
- చెట్ల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. పర్యావరణానికి మేలు చేకూరుస్తుంది.