పేరుకు ఉచితం.. దోపిడీ యథాతథం
అధికారపార్టీ అనుచరుల గుప్పెట్లో ఇసుక రీచ్‌లు
నిత్యం వందలాది ట్రాక్టర్ల ద్వారా తరలింపు
శాఖల మధ్య సమన్వలోపం
నర్సీపట్నం: ఉచిత ఇసుక విధానం ప్రభుత్వం అమలులోకి తీసుకురావడంతో ఇక అందరికీ ఇసుక లభిస్తుందని ప్రజలు ఆశించారు. కాని అధికారపార్టీ అనుచరులు ఇసుక రీచ్‌లను వారి గుప్పెట్లో పెట్టుకుని యథేచ్ఛగా ఇసుక రవాణాకు పాల్పడుతున్నారు. అనుమతులు రద్దు చేసిన రీచ్‌ల్లో కూడా అధికార బలంతో తవ్వకాలు జరుపుతూ సొమ్ము చేసుకుంటున్నారు. ఉచిత ఇసుక రీచ్‌ల వలన సామాన్యులకు ఎలాంటి లాభం చేకూరడం లేదు. ఎప్పట్లాగే ట్రాక్టర్ ఇసుక రూ. 2 వేలు పెట్టి ఇసుక కొనుగోలు చేసుకుంటున్నారు. అధికార పార్టీ నేతలకు భయపడి అధికారులు కూడా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఓ పద్ధతి లేకుండా ఇష్టానుసారంగా ఇసుక తవ్వేస్తుండడంతో ఆ ప్రాంత వాసులు ఆందోళన చెందుతున్నారు. సంబంధిత శాఖలు ఎవరికి వారే యమునాతీరే చందంగా వ్యవహరిస్తుండడంతో ట్రాక్టర్లలో ఇసుక తరలించే వారికి అడ్డూ అదుపు లేకుండా పోయింది.
పాలసీ మారినా..: కొద్దికాలం క్రితం వరకు ఇసుక కష్టాలు అందరినీ వెంటాడాయి. వేలకు వేలు వచ్చించి రోజల తరబడి వేచి చూస్తేగాని లభించడం గగనంగా మారింది. డ్వాక్రా సంఘాల పేరిట కొందరు ఇసుక అమ్మకాలతో భారీగా వెనకేసుకున్నారు. ఇటువంటి తరుణంలో ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని అమల్లోకి తెచ్చింది. రూపాయి కూడా చెల్లించకుండా తీసుకోవచ్చని అదేశాలిచ్చింది. ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన రీచ్‌ల్లోనే తవ్వకాలు చేయాలని పేర్కొంది. దీంతో ఇసుక లభించడం సులభతరమైనా సామాన్యులు మాత్రం సొమ్ము వెచ్చించక తప్పడం లేదు. ట్రాక్టర్ల యజమానులు సమీపంలో రీచ్‌ల నుంచి పెద్ద ఎత్తున ఇసుక త వ్వి తరలిస్తున్నారు.
మూసేసిన రీచ్‌లోనూ తవ్వకాలు : రెవెన్యూ విడిజన్ పరిధిలోని మాకవరపాలెం మండలం నారాయణరాజుపేట ఇసుక రీచ్, కోటవురట్ల మండలంలో పందూరు, గొట్టివేడ, చౌడువాడ, కైలాసపట్నం, గొలుగొండ మండలం తాండవ జలాశయం పరిధిలోని ఇసుక రీచ్‌ల్లో తవ్వకాలకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. అనుమతులు ఇచ్చే సమయానికి నారాయణరాజుపేట ఇసుక రీచ్ ఖాళీ అయింది. పరిసర ప్రాంతాల్లోని తాగునీటి ఇబ్బందిని దృష్టిలో పెట్టుకుని నారాయణరాజుపేట రీచ్ అనుమతులను రద్దు చేశారు. అయినప్పటికీ అధికార పలుకుబడితో కొందరు నేటికీ యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు జరిపి సొమ్ము చేసుకుంటున్నారు. మిగిలిన కీలకమైన రీచ్‌ల్లో ఇష్టానుసారంగా తవ్వకాలు జరుగుతున్నాయి. రీచ్‌లో నిత్యం వందలాది ట్రాక్టర్లు వరుస కడుతున్నాయి. ఆయా రీచ్‌ల్లో ఎవరూ ప్రశ్నించేవారు లేకపోవడంతో ఓ క్రమపద్ధతి అంటూ లేకుండా ఎక్కడికక్కడ తవ్వకాలు జరిపేస్తున్నారు. రీచ్‌లోకి ట్రాక్టర్ ప్రవేశించగానే ఎక్కడ ఇసుక ఉంటే అక్కడే తవ్వేస్తున్నారు. నిబంధనల ప్రకారం ఒక మీటరు మించి ఎక్కువ లోతులో తవ్వకాలు జరపకూడదు. అలా చేస్తే ఆ ప్రాంతంలో భూగర్భ జలాలపై ప్రభావం చూపుతుంది. అయినా సరే ఏవీ పట్టించుకోవడం లేదు. రీచ్‌లకు ఏర్పాటు చేసిన హద్దులను సైతం పట్టించుకోకుండా తవ్వకాలు జరుపుతున్నారు. ఉచిత ఇసుకపై అటు గనులశాఖ, ఇటు రెవెన్యూ, పోలీసు శాఖలు ఏవీ పెద్దగా పట్టించుకోవటం లేదు. రీచ్‌ల్లో తవ్వకాలను పర్యవేక్షించటం లేదు. రహదారులపై వెళ్లే వాహనాలను మాత్రమే ఆపి విచారించి కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారు.
అనుమతి లేకుండా తవ్వితే చర్యలు.. ఆర్డీవో
ఈ విషయమై ఆర్డీవో కె.సూర్యారావును వివరణ కోరగా అనుమతులు లేని రీచ్‌ల్లో తవ్వకాలు జరిపితే తప్పని సరిగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పటికే ఆయా మండలాల తహసీల్దార్లకు ఈ మేరకు ఆదేశాలు ఇచ్చామన్నారు. అనుమతులు లేని రీచ్‌ల్లో తవ్వకాలు జరిపితే విచారణ చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు.