శిక్షణ సమయంలోనే మర్యాద పాఠాలు
డ్రైవింగ్ స్కూళ్లకు ఆర్టీవో హుకుం
సాక్షి, ముంబై: అత్యవసర సేవలందించే వాహనాలకు ప్రాధాన్యత ఇవ్వాలనే విషయాన్ని శిక్షణ సమయంలోనే డ్రైవర్లకు నేర్పించాలని ప్రాంతీయ రవాణా కార్యాలయం(ఆర్టీఓ) భావిస్తోంది. అందుకు నగరంలోని అన్ని మోటార్ డ్రైవింగ్ స్కూళ్లకు సర్క్యులర్ జారీ చేయాలని నిర్ణయించింది. డ్రైవర్లకు సరైన అవగాహన లేకపోవడంవల్ల అంబులెన్స్, ఫైరింజన్ వంటి అత్యవసర సేవలందించే వాహనాలు ముందుకు వెళ్లేందుకు దారి దొరకడం లేదు. దీంతో రోగిని అంబులెన్స్‌లో సకాలంలో ఆస్పత్రికి చేర్చ లేకపోతున్నాయి. అగ్నిప్రమాదాలు సంభవించిన ప్పుడు కూడా భారీగా ఆస్తి, ప్రాణనష్టం జరుగుతోంది.
కొందరు డ్రైవర్లు వీటికి దారి ఇవ్వకపోవడంవల్ల గమ్యానికి ఆలస్యంగా చేరుకుంటున్నాయని పలు అధ్యయనాల్లో తేలింది. ఫలితంగా అప్పటికే జరగాల్సిన ప్రాణ, ఆస్తి నష్టం జరిగిపోతుంది. దీంతో ఇకనుంచి వీటికి ఫుల్స్టాప్ పెట్టాలని ఆర్టీఓ ఈ నిర్ణయం తీసుకుంది. నగరంలో విపరీతంగా ట్రాఫిక్ పెరిగిపోయింది. ఎన్ని ఫ్లై ఓవర్లు నిర్మించినా పరిస్థితి ఎప్పటిలాగే ఉంది. ఉదయం, పగలు, రాత్రి అని తేడా లేకుండా రహదారులన్నీ వాహనాలతో నిండిపోతున్నాయి.
ఇలాంటి సమయం లో ఏదైనా ప్రమాదం జరిగితే అత్యవసర సేవలు అందించే వాహనాలు ఘటనాస్థలానికి చేరుకోవడాని అనేక ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ట్రాఫిక్‌లోంచి దారి చేసుకుంటూ ముందుకు వెళ్లడం సవాలుగా మారుతోంది. అందుకు ముం దు వెళ్తున్న కార్లు, ఇతర వాహనాలు సహకరిస్తే కొంత మేలు జరుగుతుందని ఆర్టీఓ భావించింది. ప్రస్తుతం నగరంలో వాహనాలు తోలుతున్న డ్రైవర్లలో చాలామందికి అత్యవసర వాహనాల ప్రాధాన్యత గురించి తెలియదు.
తమ వాహనం వెనకాలే వస్తున్న అంబులెన్స్ లేదా ఫైరింజిన్ సైరన్ మోగుతున్నా కొందరు పట్టించుకోవడం లేదు. ముందుకు వెళ్లేందుకు దారి ఇవ్వకపోవడంతో సంఘటన స్థలానికి ఆలస్యంగా చేరుకుంటున్నట్లు అనేక ఫిర్యాదులు ఆర్టీఓకు అందాయి. దీంతో మోటార్ డ్రైవింగ్ స్కూళ్లలో డ్రైవింగ్ నేర్చుకునే సమయంలోనే వారికి అత్యవసర వాహనాల ప్రాధాన్యత గురించి వివరిస్తే భవిష్యత్తులో ఇలాంటి దుస్థితి రాదనే అభిప్రాయంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అందుకు మోటార్ డ్రైవింగ్ స్కూళ్ల సాయం ఎంతైనా ఉందని భావించిన ఆర్టీఓ ఆ మేరకు ఈ ఆదేశాలు జారీ చేసింది. అత్యవసర వాహనాలకు కుడి నుంచి ముందుకు వెళ్లేందుకు అవకాశం ఇవ్వాలని, అందుకు తాము నడుపుతున్న వాహన వేగాన్ని తగ్గించాలని ఆదేశాలలో సూచించింది.